Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మూలం
న మై అబ్ దిల్ కో అబ్ హర్ మకా బేచ్తా హూఉ
కోఈ ఖూబ్-రూ లే తో హాఉ బేచ్తా హూఉ
వో మరు జిస్ కో సబ్ బేచ్తే హై ఛుపా కర్
మై ఉస్ మరు కో యారో అయా బేచ్తా హూఉ
లియే హాత్ పర్ దల్ కో ఫిరా హూఉ యారో
కోఈ మోల్ లేవే తో హా బేచ్తా హూఉ
జో పూరా ఖరీదార్ పాఊ తో యారో
మై యే సబ్ జమీన్-ఒ-జమాన్ బేచ్తా హూఉ
జిసే మోల్ లేనా హౌ లే లే ఖుషీ సే
మై ఇస్ వఖ్త్ దోనోం జహా కో బేచ్తా హూఉ
బికీ జిన్స్ ఖాలీ దుకా రV్‌ా గఈ హై
సో అబ్ ఇస్ దుకాన్ కో భీ హా బేచ్తా హూఉ
మొహబ్బత్ కే బాజార్ మే ఐ 'నజర్' అబ్
మై ఆజిజ్ ఘరీబ్ అప్నీ జా బేచ్తా హూఉ
అనువాదం
ఇంటింటికీ తిరిగి నా గుండెను ఇపుడు అమ్మనుగా నేను
అందమైన వారెవరైనా కొంటానంటే హా అమ్మేస్తాను నేను
ఏ మధువునైతే అందరూ దాచి దాచి అమ్ముతారో
ఆ మధువును అందరి ముందర అమ్మేస్తాను నేను
చేతిలో సామాన్లు పట్టుకొని జనసమూహాల్లోకి వెళ్తాను
ఎవరైనా వెలకడతానంటే చెప్పండి అమ్మేస్తాను నేను
దేనినైనా కొనేయగల కొనుగోలుదారు దొరికితే మాత్రం
మిత్రమా! ఈ భూమినంతటిని, కాలాన్ని అమ్మేస్తాను నేను
మీకు ఏది కావాలో దానిని ఖుషీ ఖుషీ గా కొనుక్కోండి
ఇప్పుడు ఈ రెండు ప్రపంచాలను అమ్మేస్తాను నేను
వస్తువులన్నీ అమ్ముడైపోయాయి దుకాణమొకటే మిగిలింది
ఇంకేముంది! ఇప్పుడిక ఈ దుకాణాన్ని కూడా అమ్మేస్తాను నేను
ప్రేమ అనే ఈ అంగడి బజారులో ఇప్పుడు, ఓ 'నజీర్'
నిస్సహాయ పేదనైన నేను ఈ ప్రాణాన్ని కూడా అమ్మేస్తాను.
సహదయుడైన కవి, దేనినైనా స్పశించి కవిత్వం చేయగలడు. ఏ హద్దులు బంధించలేని తన మనసు విశ్వమానవ దక్పథాన్ని కలిగివుంటుంది. భౌతికంగా కవి వాస్తవ్యాలు కులమతాలకు చెందినా కూడా, తన మేధస్సు సకల భేదాలకు అతీతంగా విషయాలను అన్వేషించి అర్థం చేసుకుంటుంది. కాళిదాసు, రూమీ, బైరన్, మీర్, ఠాగూర్, వేమన వంటి కవులలో ఆ దక్పథం ఉంది కాబట్టే వారి కవిత్వాన్ని మనం నేటికీ ఆస్వాదిస్తున్నాం. ఈ తరహా కవులలో నజ్మ్ కవితల పితామహుడిగా పరిగణించబడే ఉర్దూ మహాకవి నజీర్ అక్బరాబాదీ ఒకడు. ఇతని అసలు పేరు సయ్యద్ వలీ మొహమ్మద్. 18వ శతాబ్దానికి చెందిన నజీర్, దిల్లీలో జన్మించినా, 1739లో నాదిర్ షా దాడి వల్ల కుటుంబంతో అక్బరాబాద్ (ఆగ్రా) కి వచ్చి అక్కడే స్థిరపడ్డాడు. మథురలో పిల్లలకి చదువు చెప్పుతూ జీవనం సాగించాడు. నిరాడంబరమైన ఇతని స్వభావం స్వచ్ఛమైనది, సరళమైనది. నజీర్ హిందూ-ముస్లీం, పేద-ధనిక అనే భేదాలు లేకుండా అందరినీ గౌరవించేవాడు.బిచ్చగాళ్ళు సైతం ఇతనితో పద్యాలు పాటలు రాయించుకుని పరవశించేవారు. గొప్ప వారు ఇతన్ని సన్మానించగా, బీదవారు, పీడిత ప్రజలు నజీర్ ని తమ సొంత మనిషిలా చూసేవారు. ఇతను మతానికి జీవితానికి గల సంబంధం, వర్గాల భిన్నత్వం, మనిషి అవసరాలు మొపప విషయాల పట్ల స్పష్టమైన దక్పథం కలిగినవాడు. సుఖ దుఃఖాలు రెంటినీ అనుభ వించిన నజీర్, ఆటలు, వ్యాయామం, కుస్తీ వంటి ఆసక్తికరమైన కార్య క్రమాల్లో చురుగ్గా పాల్గొనే వాడు. ముస్లీం పండు గలతో పాటు హిందూ పండుగలైన హౌలీ, దీపావళి, రాఖీ, కష్ణాష్టమి పండుగులలో ఎంతో ఉత్సాహంతో పాల్గొనడమే కాక కవితలు కూడా రాసాడు.
ఏ దర్శనశాస్త్రాలనూ, సంప్రదాయాలను చదవకుండా భార తీయ సంస్కతుల పట్ల జ్ఞానం సంపాదించిన నజీర్, నానక్, నబీ, ప్రవక్త, పీర్ గూర్చి రాయ డమే కాకుండా శ్రీకష్ణుడు, మహాదేవుడు, భైరవుడు మొదలైన వారి గురించి కూడా వర్ణించాడు. నజీర్ రాసిన కవితల్లో బంజా రానామా, ఆద్మీనామా మొదలైన కవితలు అత్యంత ప్రసిద్ధి గాంచినవి. వాటిని పాఠ్యపుస్తకాల్లో కూడా ముద్రించారు. నజీర్ గురించి అయోధ్యాప్రసాద్ అనే హిందీ రచయిత ఇలా అంటాడు- ''ఖురాన్, హదీసు, గీత, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఇవన్నీ కరిగించి త్రాగిన సిద్ధుడొకడు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది''. నజీర్ ని ఎన్నో రాజదర్బారులు ఆహ్వానించినా నిరాకరించాడు.1830 సంవత్సరం ఆగ్రాలో నజీర్ మరణించాడు.
ఉర్దూ సాహిత్యంలో నజీర్ సాహిత్య ప్రస్థానం చారిత్రాత్మకమైనది. తన పూర్వకవులు సామాన్య విషయాలను, ప్రజల జీవితాన్ని గురించి రచనలు చేయడానికి సంకోచించేవారు. కానీ నజీర్ సామాన్య కవి ప్రస్తావించలేని పిండి, పప్పు, ఈత, కాకి పిల్ల వంటి చిన్న చిన్న విషయాలను కూడా తనదైన శైలిలో చక్కగా వ్యక్తీకరించి ఉర్దూ సాహిత్య చరిత్రలో నూతన సంప్రదాయానికి తలుపులు తెరిచాడు. తన పూర్వకవులలో లేని వాస్తవికత, దేశభక్తి, ప్రజాజీవన పరిజ్ఞానం, మానవ ప్రేమ, సహదయత, నిరాడంబరత మొదలైన గొప్ప గుణాలు నజీర్ కవితల్లో సమద్ధిగా ఉంటాయి. ఇందుకు నజీర్ ఏ శాస్త్రాలనూ చదవలేదు. అతను జీవితాన్ని ఎలా చూశాడో, ఎలా అనుభవించాడో అలానే సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా తన కవితలను చిత్రీకరించాడు. నజీర్ మీర్, ముశాఫీల సమకాలికుడు. ఆ కాలంలో విమర్శకులు నజీర్ కి ఎలాంటి ప్రాముఖ్యత ఇవ్వకపోవడంతో తన కవిత్వం కావాల్సినంత ప్రచారం పొందలేదు. కాని ఆధునిక కవులెందరో నజీర్ కవిత్వాన్ని గుర్తించి గుండెలకు హత్తుకున్నారు. నజీర్ రాసిన చాలా వరకు గజళ్ళు సరళంగా ఉంటాయి. సామాన్య ప్రజలు కూడా అర్థం చేసుకునేలా ఉంటాయి. ఈ కాలమ్ లో తీసుకున్న గజల్ ఆసక్తికరంగా ఉంటుంది. కవి తనని అమ్మకపుదారునిలా ఊహించుకుని తన గుండెను, మధువును, లోకాన్ని, కాలాన్ని, ప్రాణాన్ని అమ్మేస్తానని అంటాడు.
- ఇనుగుర్తి లక్ష్మణాచారి
సెల్: 94410 02256