Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రాచీన చీనా, జపనీయ కవులు ఎక్కువగా సంచార కవులు.పెక్కు మంది భిక్షుక కవులు.వారి కవిత్వంలో నిజాయితీ, ప్రకతి నివేదన, నిరాడంబరత వారి కవిత్వాన్ని ప్రత్యేకమైనవిగా చేస్తాయి. అందువల్ల ఆ కవిత్వం చదవడం వల్ల నేను పొందిన రసానుభూతిని నేను నా సహ మిత్రులకు పంచదలచాను. అందుకే నాకు నచ్చిన వారి కవిత్వాన్ని నాకు చేతనయినట్టుగా తెలుగులోకి అనువదిస్తున్నాను. నేను ఆనందించినట్టే కొంతమంది మిత్రులు వీటిని చదివి ఆనందించడం సంతోషంగా వుంది. అయితే నా కన్నా ముందు చాలా మంది వీటిని అనువదించారు. ఎవరి అనువాదం వారిది.ఒక రచనకు వివిధ రకాలైన అనువాదాలు వున్నాయి.ఒకళ్లకు మించిన అనువాదకులు ఇంకొకరు వున్నారు.
సీనియర్ కవి అయిన ఆయన ఇప్పటికే దాదాపు 7 పుస్తకాలను కవిత్వ రంగానికి అందించాడు. వ్యక్తులకు, సంఘానికి కవితా పంక్తులతో ధైర్యాన్ని నూరిపోయడమే కాదు కవిత్వంలో అనేక ప్రయోగాలు చేస్తూ కవిత్వానికి వినూత్నను చేకూర్చుతున్న కవి ఆయన. చీనా, జపనీయ, ఉర్దూ భాషలలోని ప్రసిద్ధ కవితలను తెలుగులోకి అనువదించి తన కవిత్వంలోని విలక్షణతను చాటు కున్నాడు. హైకూ కవిగా, అనువాద కవిగా ఇప్పటికే చిరపరిచితుడైన శ్రీనివాస్ గౌడ్ కథ, నవల వంటి అంశాలపై కూడా సాధికారిక వ్యాఖ్యానం చేస్తూ సాగుతున్నారు. ఆయనతో ఈ వారం నర్రా అభిముఖం...
- మీ మొదటి పుస్తకం ' ముంజంత మదువైన హైకు' . తొలుత హైకూలే ఎందుకు రాశారు?
హైకు మూడు పాదాల్లో వుండే ఒక చిన్న పద్యం. ఒక కొత్త పాఠకుడిని ఒక మేలిమి హైకు ఇట్టే ఆకట్టుకుంటుంది.ఒక మిత్రుని ద్వారా నాకు ఈ హైకు పరిచయం అయింది. దానిలో వున్న సొగసు,సంక్షిప్తత నన్ను ఆకర్షించాయి.అవి నా మనసుకు దగ్గరగా అనిపించాయి.వాటిని అనుకరిస్తూ కొన్ని కవితలు రాసాను. ఆ తర్వాత గాలి నాసరరెడ్డి గారి పరిచయంతో హైకు మీద అవగాహన వచ్చింది. మూడు పాదాల్లో రాసి ముందు తనకు తనని, ఆ తర్వాత పాఠకుడ్ని మెప్పించడం తేలిక కాదు. ఆ తర్వాత కాలంలో కొద్దికొద్దిగా హైకు రాయడం మెరుగు పరుచుకున్నాను. నా మొదటి పుస్తకం ' ముంజంత మదువైన హైకు '. ఇది జనవరి 2001 లో వచ్చింది.దీన్ని ఇస్మాయిల్ గారు మెచ్చి ముందుమాట రాయడం ఒక అనుకోని ఆనందం. హైకు గురించి బాగా చదువుకున్న తర్వాత హైకు రాయడం తగ్గింది.ఇంగ్లీషు నుండి భారతీయ, అంతర్జాతీయ హైకులు అనువాదాలు చేసాను.
- 'దిగులు వర్ణాలు' పుస్తకం పలు లఘుకవితా ప్రక్రియల కలబోత. ఆ ప్రత్యేకతలు చెప్పండి?
దిగులు వర్ణాలు నా రెండవ పుస్తకం.2003 లో వచ్చింది.అందులో నాకు ఏది వస్తే అది రాసాను. హైకు వుంది.హైకుని సామాజికం చేసి రాసిన గౌడ హైకులున్నాయి.సెన్- ర్యూ (వ్యంగ హైకు) వుంది.లఘు కవితలు వున్నాయి. ఆంగ్లం లో రాసిన హైకులు వున్నాయి.ఒక పెద్ద కవిత వుంది.అన్ని ప్రక్రియలు కలగాపులగంగా వున్న ఈ పుస్తకం ఒక ప్రయోగంగా మిగలడమే కాకుండా శివారెడ్డి లాంటి ప్రముఖ కవి దష్టి నా మీద పడేలా చేసింది.
- రెక్కలు ప్రక్రియలో వచ్చిన ' వెలుతురు వలయాలు' సంపుటి మీకు ఏ మేరకు పేరు తెచ్చింది? ఈ ప్రక్రియలో వచ్చిన పుస్తకం చదవటం వల్ల లాభమేంటి?
వెలుతురు వలయాలు (2008 ) రెక్కల పుస్తకానికి ముందు 'ఇదీ జీవితం' ( 2007) కవితా సంపుటి వేసి వున్నాను.కవిత్వం అంటే ఏమిటో తెలుసుకునే దశలో వున్నాను. కవిత్వం ఏదైనా అది ఒక తాత్వికతను ప్రతిపాదించాలని ,అది ఒక నిర్దిష్ట సత్యం చెప్పాలని అనుకుంటాను.హైకు అలాంటి ప్రక్రియ. మొదటిసారి నేను రెక్కలు చదివినప్పుడు ఒక పొడిగించిన హైకు చదివిన భావన కలిగింది. రెక్కలు కూడా మానవ జీవితంలోని అనేక సంక్లిష్టతలను విప్పి సత్యదర్శనం చేయిస్తాయి. అనుభవసారం పిండి ఒక ఎరుకను, enlightenment తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాయి. సుగమ్ బాబు గారి రెక్కలు చదివి చాలా రోజులు నేనేం రాయలేదు.కానీ ఆ రెక్కల కవిత్వానుభూతి వెంటాడుతూనే వుంది. దాంతో అప్రయత్నంగా రెక్కలు రాయడం, అవి పత్రికలలో రావడం, చాలా మంది పాఠకులకు నచ్చడం, పెక్కు మంది రెక్కలు రాయడానికి ప్రయత్నించడం జరిగింది. రెక్కలు రాయడంలో వున్న కష్టం ఏమిటంటే చివరి రెండు పాదాలు పాఠకుని హదయాన్ని వెలిగించాలి.ఒక అనుభవం నుంచి ఒక పాఠం నేర్చుకున్న experience రావాలి.అందుకు కవిలో ఒక తాత్వికచింతన వుండాలి.తక్కువ పదాల్లో ఒక సత్యాన్ని ఆవిష్కరించగల సత్తా వుండాలి. అప్పుడు రెక్కలు ఒక వేమన పద్యంలా,ఒక సుమతీ శతక పద్యంలా మనకొక ఆహ్లాదకరమైన అనుభూతిని ఇస్తాయి.రెక్కలే కాదు ఏ కవిత్వ ప్రక్రియైనా చేయదగ్గ పని ఇదే కదా! రెక్కలు తెలుగు సాహితీ ప్రపంచంలో విమర్శకుల ప్రశంసలు పొందింది. అద్దేపల్లి రామమోహనరావు లాంటి ప్రసిద్ధ విమర్శకులు రెక్కల ప్రక్రియను ప్రశంసిస్తూ వ్యాసాలు రాసారు.రెక్కల కవుల సంకలనాలకు పీఠికలు రాసారు. సుగమ్ బాబు రెక్కలు తర్వాత ఆ ప్రక్రియలో వచ్చిన మొదటి రెక్కల సంపుటి 'వెలుతురు వలయాలు' .ఈ పుస్తకాన్ని ప్రశంసిస్తూ అన్ని పత్రికలలో సమీక్షలు వచ్చాయి. సీనియర్ సాహిత్యవేత్తలు వడలి మందేశ్వర రావు,కిరణ్ బాబు, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, మాకినీడి సూర్యభాస్కర్,పురాణం శ్రీనివాస శాస్త్రి మొదలైన వారి మెచ్చుకోళ్లు దక్కాయి.రాజాహుస్సేన్ లాంటి విమర్శకులు నేటికీ రెక్కల మీద వ్యాసాలు రాస్తూనే వున్నారు.
- 'ఒక మెలకువ' పుస్తకం గురించి ఏమైనా?
'ఒక మెలకువ' 2011లో వచ్చింది. ఒక విధంగా రక్తనిష్టగా రాసిన కవిత్వం ఇది. 2006 నుండి 2011 వరకు ఉదతంగా రాసిన.కవిత్వాన్ని కలలు కనిన రోజులవి.శివారెడ్డిగారు మంచి పీఠిక రాసారు. ఒక స్పష్టమైన దక్పథంతో రాసిన ఈ కవితా సంపుటి ఫ్రీవర్స్ ఫ్రంటుతో సహా అనేక అవార్డులు పొందింది.దానికంటే ఎంతోమంది పాఠక మిత్రుల్ని, కవిమిత్రుల్ని సంపాయించి పెట్టింది. 'ఒక మెలకువ' ఒక విధంగా ఒక settled expression.
- మీ ప్రాచీన జపనీయ, చీనా కవిత్వ అనువాద లక్ష్యం ఏమిటి?
చీనా, జపనీయుల కవిత్వం చదివినప్పుడు నేను ఇదీ అని చెప్పలేని ఉద్వేగానికి లోనవుతాను. ఆ కవిత్వమూ , ఆ కవిత్వ అసంగత్వమూ నా మనసుకు చాలా పరిచితమైనవిగా అనిపిస్తాయి. ప్రాచీన చీనా, జపనీయ కవులు ఎక్కువగా సంచార కవులు.పెక్కు మంది భిక్షుక కవులు.వారి కవిత్వంలో నిజాయితీ, ప్రకతి నివేదన, నిరాడంబరత వారి కవిత్వాన్ని ప్రత్యేకమైనవిగా చేస్తాయి. అందువల్ల ఆ కవిత్వం చదవడం వల్ల నేను పొందిన రసానుభూతిని నేను నా సహ మిత్రులకు పంచదలచాను.అందుకే నాకు నచ్చిన వారి కవిత్వాన్ని నాకు చేతనయినట్టుగా తెలుగులోకి అనువ దిస్తున్నాను.నేను ఆనందించినట్టే కొంతమంది మిత్రులు వీటిని చదివి ఆనందించడం సంతోషంగా వుంది. అయితే నా కన్నా ముందు చాలా మంది వీటిని అనువదించారు.ఎవరి అనువాదం వారిది.ఒక రచనకు వివిధ రకాలైన అనువాదాలు వున్నాయి.ఒకళ్లకు మించిన అనువాదకులు ఇంకొకరు వున్నారు. అయితే మూల రచనకు కట్టుబడి ప్రతిభావంతంగా చీనా,జపనీయ కవిత్వాన్ని ఇతర భాషలలోకి అనువాదం చేయడం బహు కష్టం. అందువల్ల ఇంగ్లీషు నుంచి తెలుగు పాఠకులకు అందుతున్న కవిత్వం సగం పరిమళం, సారం కోల్పోయిన కవిత్వమే అని నా అభిప్రాయం. అయినప్పటికీ ఆ కవిత్వం అలరిస్తున్నదంటే ఇక మూల రచన ఎంత అద్భత సజనో కదా!
- జపనీయ, చీనా, ఉర్దూ భాష, సాహిత్యాలపై ఆసక్తి ఎలా కలిగింది? వాటిపై పట్టు ఎలా సాధించారు?
నేను మొదట చదివిన అనువాద హైకులు కంజిర (ప్రత్యేక సంచిక) గాలి నాసరరెడ్డి గారి అనువాదం. ఒక వినూత్న కవితా ప్రపంచం ద్వారాలు తెరిచాయవి. ఆ తర్వాత ఆయనవే చీనా కవితల అనువాద కవితలు చదివాను.ముందే చెప్పి నట్టు అవి నా మానసిక ప్రపంచంలో ఒక పార్ట్ ని ఆక్రమించాయి.గాలి నాసరరెడ్డి గారి సహచర్యం కూడా అందుకు దోహదం చేసింది. నా వంతుగా నాకు నచ్చిన హైకులు,తంకలు,చీనా కవి తలు అనువాదం చేసే ప్రయత్నం చేసాను.చీనా కవులు లి- బొ,దు- ఫు,వాంగ్ వురు,సు తుంగ్ పొ,లి చింగ్ చావొ,లు యు,చు షు చెన్,జపనీయ కవులు ర్యోకన్ మొదలుకొని తనెద సంతొక వరకు ఇష్టంగా అనువాదం చేసాను.నా మాతభాషలో వారి కవిత్వాన్ని చూసుకొని మురిసిపోవడానికి అనువాదం చేసినప్పటికీ, ఆ అనువాదాలు పాఠక మిత్రుల అభిమానానికి పాత్రం కావడం అదనపు ఆనందమే. ఇవే కాక ఉర్దూ, ఇతర ప్రపంచ భాషల కవుల కవితలు ఎన్నో ఇంగ్లీషు నుండి అనువాదం చేసాను.
- మీరు రాసే వచన కవిత్వంపై ఎవరి ప్రభావం ఉంది? ఎక్కువగా ఎవరెవరి కవితలు చదువుతుంటారు?
నా కవిత్వంపై నేను ఇష్టపడిన అందరి కవుల ప్రభావం వుంది. తిలక్,బైరాగి,కష్ణశాస్త్రి, ఇస్మాయిల్, జాషువా, మద్దూరి నగేష్ బాబు, తెరేష్ బాబు,శివారెడ్డి, శ్రీకాంత్, ఆశారాజు,కొప్పర్తి, దర్భశయనం,నరేష్ నున్నా,సిద్దార్థ, నామాడి శ్రీధర్, వరవరరావు, అరసవిల్లి, బి.వి.వి. ప్రసాద్, మోహన్ రుషి, కొండేపూడి నిర్మల, చల్లపల్లి స్వరూపరాణి, షాజహానా లాంటి ఇంకా చాలామంది కవుల్ని ఇష్టంగా చదువుకుంటాను. నన్ను ఆవహించిన వారందరి కవిత్వం నాలో మోగుతూనే వుంటుంది. కానీ, వారందరి వ్యక్తీకరణ నాలోంచి పలకకుండా వుండడానికి,స్వంత గొంతుతో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాను.ప్రతి కవి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా A poet made out of thousand poets.
- పది సం''ల తర్వాత 'ధైర్య వచనం' పుస్తకం తీశారు? ఆంధ్రప్రదేశ్ ఆధునిక తెలుగు సాహిత్యంలో దీని స్థానం?
అవును. పది సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత వచ్చిన కవిత్వం 'ధైర్యవచనం'. జీవితంలో ఏర్పడిన అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ, కరోనా విపత్కర కాల పరిస్థితులను అనుభవిస్తూ, నన్ను నేను సాంత్వన పరుచుకోవడానికి,దుఃఖం నుండి విముక్తి కావడానికి దుఃఖంలో నిలబడి రాసిన కవితలు 'ధైర్యవచనం' లోనివి. ఈ విరామ కాలంలో ఎంతోమంది కవులు సరికొత్త సవాళ్లు స్వీకరిస్తూ కొత్తగా కవిత్వం రాస్తూ వున్నారు.వీరందరి మధ్య నేనెక్కడ వున్నాననేది కూడా ఒక సవాలు. నేటి ఆధునిక కవితా ప్రపంచంలో ధైర్యవచనం ఎక్కడ నిలబడుతుందనేది పాఠకులు, విమర్శకులు నిర్ణయిస్తారు. నేను చేయగలిగిందల్లా రాసుకుంటూ పోవడమే.
- మీ 'పాదాలు... పాదాలు మాత్రమే' , 'ఏముంటుందా చేతుల్లో' , 'అనేక సార్లు' , 'పిల్లవాడి ప్రపంచం' వంటి కవితల్లో శీర్షిక ఎక్కువ సార్లు పలికింది! ఇలా ఒక వాక్యాన్ని పదేపదే పునరుక్తం చేయటం వల్ల కవితకు ఏ మేరకు బలం చేకూరుతుంది?
ఒక కవిత రాసేటపుడు దాని రూపం అదే నిర్ణయిస్తుంది. అనేక వ్యూహాలతో కవితని నిర్మించేటపుడు కవితకు పుష్టినిచ్చే నిర్మాణ పద్ధతులు కవి అవలంభిస్తాడు.అందులో భాగంగానే కొన్ని పదాలు,వాక్యాలు పునశ్చరణ అవుతుంటాయి.ఆ పద్ధతి వల్ల కవిత బలంగా రాకపోతే పాఠకులు దాన్ని ఫెయిల్ చేస్తారు.
- మీ ఇతర సాహిత్య కార్యకలాపాల గురించి చెప్పండి?
నేను హైకు,తంకలు,రెక్కలు,లఘు కవితలు వగైరాలు రాసాను. ప్రక్రియ ఏదైనా అందులో సాహిత్యం, కవిత్వం వుండాలని నమ్ముతాను. వస్తువు తన రూపాన్ని తనే వెతుక్కుంటుంది. కొన్ని కవితల రూపంలో, కొన్ని గేయల రూపంలో, కొన్ని కథల రూపంలో, కొన్ని నవలల రూపంలో .... ఇలా వివిధ ప్రక్రియలలో వ్యక్తమవుతాయి.ఏ విధంగా వ్యక్తీకరిస్తే ఆ వస్తువుకు పూర్తి న్యాయం జరుగుతుందో ఆ విధంగానే అది వ్యక్తం కావాలి. ఇతర సాహిత్య కార్యక్రమాలలో భాగంగా నేను కథలు రాస్తున్నాను.'స్వర్ణగేటు కతలు' శీర్షికన నవ మల్లెతీగ మాసపత్రికలో కతల సిరీస్ రాస్తున్నాను. పుస్తక సమీక్షలు చేస్తున్నాను.కథల,నవలల విశ్లేషణ చేయబోతున్నాను. 'ధైర్యవచనం' తర్వాత ఈ నెలలోనే 'చిన్ని చిన్ని సంగతులు' కవితా సంపుటి వస్తోంది. అక్టోబరులో కథల సంపుటి,డిసెంబరులో అనువాద కవిత్వం పుస్తక రూపంలో రాబోతున్నాయి.
- నర్రా ప్రవీణ్ రెడ్డి
ఉస్మానియా విశ్వవిద్యాలయం