Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భాషకందని కమ్మటి భావన. చుట్టూ అల్లుకున్న మానవ సంబంధాల పొదరింట్లో విరిసిన అందమైన గులాబీ. జీవితంలో మరిచిపోలేని ఒక మధుర జ్ఞాపకం. ఎప్పుడో చిన్నప్పుడు...బుడి బుడి అడుగుల బాల్యంలోనే అల్లుకునే స్నేహ బంధాలు కొన్నయితే...పరవళ్లు తొక్కే యవ్వనంలో పెనవేసుకునే అనుబంధాలు మరి కొన్ని. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఏ కాలేజీలోనో, లైబ్రరీలోనో, కలిసి నడిచే కారిడార్లోనో, తరగతి గదిలోని ఒకే బెంచిపై, మాస్టారు బోధించే పాఠాల్లోని సందేహాల్లో ఊపిరి పోసుకొనే స్నేహం..
ఒక మహావక్షంలా ఎదుగుతుంది. జీవితంతో మమేకమవుతుంది. ఒక విడదీయరాని అనుబంధమైపోతుంది. అసలు కళాశాల అంటేనే స్నేహితుల కలల కాణిచి. సహ విద్యార్థిగా రూపుదిద్దుకొనే పరిచయం..స్నేహమై ఎలా ఎదుగుతుందో, జీవితంలో ఒక తీపి గుర్తుగా ఎలా మిగిలిపోతుందో ఏ డైరీని అడిగినా చెబుతాయి. మదిలో నిక్షిప్తమైన భావాలను, అనుభవాలను, అనుభూతులను పంచుకోవడం తప్ప ఏ స్వార్ధం లేని జీవన బంధం స్నేహం. జీవితంలో ఎవరున్నా, లేకున్నా మంచి నేస్తం ఒకరు తోడుంటే చాలునని కోరుకోని వాళ్లు ఉంటారా. నేడు స్నేహితుల దినోత్సవం. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే..