Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గేయకవిగా తన సాహిత్య ప్రస్థానాన్ని ప్రారంభించిన ఖతీల్ శిఫాయీ అసలు పేరు ఔరంగజేబ్ ఖాన్. ఇతను పాకిస్తాన్ లోని హజారా జిల్లాలో 1919 డిసెంబర్ 24న జన్మించాడు. 1935 సంవత్సరంలో తన తండ్రి మరణం తరువాత తన విద్యను ఆపాల్సి వచ్చింది. ఆ తరువాత జీవనం సాగించడం కోసం ఒక క్రీడా వస్తువుల దుకాణం ప్రారంభించిన ఖతీల్, వ్యాపారంలో నష్టం రావడంతో రావల్పిండికి మకాం మార్చాడు. 1947లో పాకిస్తాన్ ఫిల్మ్ ఇండిస్టీలోకి సినీగీత రచయితగా ప్రవేశించిన ఇతను, స్వల్ప కాలంలో తన పాటలతో భారత్ లో కూడా అభిమానులను సంపాదించుకున్నాడు. తన కలం పేరులోని సగం ''శిఫాయీ'' అనే పదం, తన కవిత్వ గురువైన శిఫా కాన్పూరీ గౌరవార్థం స్వీకరించాడు. ఖతీల్ హైయాలీ, గుఫ్తగూ, బర్గద్, మత్రబా మొదలుకొని 14 కవితా సంకలనాలు వెలువరించాడు. 1948లో 'తెరీ యాద్' అనే సినిమాలో మొదటి సినిమా పాట రాసిన ఖతీల్, తన జీవిత కాలంలో రెండు దేశాల్లో కలిపి 201 సినిమాలలో 2500కి పైగా సినీగీతాలు రాసి సరస హదయుల మనసులు చూరగొన్నాడు. హిందీ, గుజరాతీ, రషియన్, చైనీస్ మొపప భాషలలో అనువదించబడిన తన రచనలు, తనకి అంతర్జాతీయ కీర్తిని తెచ్చిపెట్టాయి. ఖతీల్ 1946లో అదబ్-ఎ-లతీఫ్ పత్రికకు ఉపసంపాదకుడిగా కూడా వ్యవహరించాడు. తాను చేసిన అక్షర కషికి పాకిస్తాన్ ఫిల్మ్ ఇండిస్టీ నుండి నిగర్ జీవిత సాఫల్య పురస్కారం, భారత్ నుండి అమీర్ ఖుస్రో పురస్కారంతో పాటుగా ఎన్నో పురస్కారాలను అందుకున్నాడు. ఎటువంటి సాహిత్య నేపథ్యం లేని ఖతీల్ శిఫాయీ, 20వ శతాబ్దాపు ఉర్దూ మహాకవులలో ఒకడిగా పలువురి ప్రశంసలు అందుకున్నాడు. 11 జులై 2001, లాహౌర్ లో ఖతీల్ తన చివరి శ్వాస విడిచాడు.
ఖతీల్ తన కవితా ప్రస్థానాన్ని గజళ్ళ రచనతోనే ప్రారంభించాడు. వాస్తవానికి ఖతీల్ ఒక మంచి గేయకవి. ఇతని కలంలో అద్భుతమైన శబ్ద, సంగీత స్పహలు గోచరిస్తాయి. ఖతీల్ కవితల్లోని పదాల కూర్పు ఎంతో లలితంగా, మధురంగా ఉంటుంది. తను రాసే నజ్మ్ కవితలలో కూడా సంగీతం సహజంగానే నిక్షిప్తమై ఉంటుంది. ఇక ఇతని భావుకత గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇతని షేర్లు విన్న ఏ శ్రోత కూడా వాహ్వా వాహ్వా అనకుండా ఉండలేడు. ఈ కాలమ్ లో కూడా అలాంటి ఒక గజల్ నే తీసుకోవడం జరిగింది. మొదటి షేర్లో ప్రేయసిని గురించి చెబుతూ తనని ఒక కసాయితో పోలుస్తాడు. దీని అర్థం ప్రేయసి చంపేస్తుందని కాదు. ఇక్కడ ప్రేయసి నయవంచకురాలని, తన వలన చివరికి దుఃఖమే మిగులుతుందని అర్థం. కాబట్టి తనని కోరుకోవద్దని అంటాడు. అయితే ఆ దుఃఖాన్ని వ్యక్తీకరించే క్రమంలో ప్రేయసిని కసాయితో, అలాగే ఆ దుఃఖాన్ని మరణంతో పోలుస్తాడు. రెండవ షేర్ లోని మొదటి మిస్రాలో ప్రేయసి చూపుల మాయాజాలాన్ని గురించి చెబుతాడు. ఆ చూపుల వల్ల పడిపోయిన ప్రియుడు చనిపోయాడని అనుకోండి. చనిపోయాక కూడా తన హదయానికున్న రోగానికి మందును ఆశించొద్దనంటాడు. అంటే ప్రేయసి పైనున్న ప్రేమని ఒక రోగంతో పోలుస్తాడు. మొత్తంగా ప్రియుడి ప్రేమ చనిపోయాక కూడా ఉంటుందని.. అంటే శాశ్వతమైనదని అర్థం. ఇక మూడవ షేర్లో ఆ చూపులను కోరుకోవడం ముళ్ళ నుండి పూల పరిమళాన్ని ఆశించడం వంటిదే అని అంటాడు, అంటే అదంతా భ్రమ మాత్రమే. నాల్గవ షేర్లో నిజం చెప్పే ప్రతిసారీ అన్నింటికీ సంసిద్ధమై ఉండాలని చెబుతూ, నిజం చెప్పడాన్ని విషం తాగడంతో పోలుస్తాడు. ఇక ఐదవ షేర్లో సాధ్యపడని విషయాలను గురించి ఊహించడం ఎడారిలో నీడనిచ్చే గోడ కోసం వెదకడం లాంటిదే అని ముగిస్తాడు.
మూలం...
యారో కిసీ ఖాతిల్ సే కభీ ప్యార్ న మాంగో
అప్నే హీ గలే కే లియే తల్వార్ న మాంగో
గిర్ జాఓగే తుమ్ అప్నే మసీహా కీ నజర్ సే
మర్ కర్ భీ ఇలాజ్-ఎ-దిల్-ఎ-బీమార్ న మాంగో
ఖుల్ జాఏగా ఇస్ తరV్‌ా నిగాహౌం కా భరమ్ భీ
కాంటోం సే కభీ ఫూల్ కీ మహకార్ న మాంగో
సచ్ బాత్ పే మిల్తా హై సదా జహర్ కా పియాలా
జీనా హై తో ఫిర్ జీనే కా ఇజ్హార్ న మాంగో
ఉస్ చీజ్ కా క్యా జిక్ర్ జో ముంకిన్ హీ నహీ హై
సహ్రా మే కభీ సాయా-ఎ-దీవార్ న మాంగో
అనువాదం...
మిత్రమా! ఒక కసాయి నుండి ప్రేమనెన్నడూ ఆశించకు
నీ గొంతును కోయించడం కోసం ఏ ఖడ్గాన్ని ఆశించకు
పడిపోతావు నువ్వు నీ ప్రియురాలి చూపుల వల్ల
చనిపోయాక కూడా ఈ ఎద రోగానికి ఔషధాన్ని ఆశించకు
ఈ విధమైన చూపుల భ్రమలన్నీ తొలగిపోతాయిలే
ముళ్ళ నుండి పూల పరిమళాన్నెన్నడూ ఆశించకు
నిజం మాట్లాడే ప్రతిసారీ విషం తాగాల్సి వస్తుంది
బ్రతకాలని నీకనిపిస్తే ఇక బ్రతికే తీరును ఆశించకు
సాధ్యపడని విషయాలను ఊహించడమూ అసాధ్యమే
ఎడారిలో ఎన్నడూ నీడనిచ్చే గోడ ఉంటుందని ఆశించకు
- ఇనుగుర్తి లక్ష్మణాచారి,
సెల్: 9441002256