Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అతనో మాటకారి. అదేంటి? అంత మాట అనేశారు అనుకుంటున్నారా? అదంతే. అతను మాటలతో ఆత్మీయతను ఒంపి నలుగురితో మాట్లాడించగలడు. అతడో చమత్కారి .. తన మాటలతో కవ్వించి నవ్విస్తాడు. అతడో పాటగాడు.. కమ్మని పాటను వినిపిస్తాడు. 'హలో.. బావున్నారా?' అంటూ ఉదయపు రాగాలను ఆలపించే ఓ వేణువు. రెయిన్బో.. ఎఫ్ఎమ్లో గత పదేళ్ళకుపైగా 'రేడియో జాకీ'గా అశేష శ్రోత శ్రవణానందులను చేస్తున్న వేణుశ్రావణ్ అలియాస్ రేడియో జాకీ వేణుగాన అంతరంగ తరంగం ఇది.'జోష్' పాఠకులకు ప్రత్యేకం.
రేడియో అంటే బోల్డన్ని జ్ఞాపకాల దొంతర. అలాంటి రేడియోతో పద్నాలుగు ఏండ్లగా జతకట్టి, తన గళ మాధుర్యంతో రేడియో వ్యాఖ్యాత (జాకీ) గా కెరీర్లో కొనసాగడం అంటే ఓ అందమైన అనుభవమే. అలాంటి మధురమైన అనుభవాన్ని దక్కించుకొని తానో రేడియో జాకీగా నిలబడ్డానికి అలుపెరగని కషి, సాధన, ఆ పాత్రకు కావాల్సిన పరకాయ ప్రవేశం, అధ్యయనం, సున్నీతమైన పరిశీలన అనే వాటిని నిత్యకత్యాలుగా మార్చుకున్నాడు వేణు శ్రావణ్.
సమయస్ఫూర్తే.. ప్రధానం
దశ్య, శ్రవణం మాధ్యమాలేవైనా ప్రేక్షకులే అంతిమ నిర్ణేతలు. టీవీ కార్యక్రమం నచ్చకపోతే.. రిమోట్ బటన్ నొక్కి మార్చినట్టు.. రేడియోలో మాట నచ్చకపోయినా.. పక్కస్టేషన్ తిప్పేస్తాం. అలా శ్రోతలు పక్కదారి పట్టకుండా ఉండాలంటే.. రేడియో వ్యాఖ్యాత గొంతులో ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి. పుక్కిట ప్రవచనాలు వల్లించకపోయినా.. పక్కింటి అబ్బాయిలానో, కలిసి పనిచేసే సహచర ఉద్యోగిలానో, బడిలో జీడి కాకి ఎంగిలితో పంచుకున్న దోస్తుగాడిలానో మాటలు కలపాలి. అలా మాటల పల్లకీని.. భుజానెత్తుకుని.. శ్రోతలను అందమైన లోకంలో విహరింపచేయాలి. అలా చేయాలంటే ముందస్తు కసరత్తులు చాలానే ఉంటాయి. ఎందుకంటే నోటికొచ్చింది మాట్లాడితే.. వినేంత ఓపిక జనాలకు ఉండదు. పోనీ అలా మాట్లాడితే.. 'రేడియో జాకీ' అనే కుర్చీలో కూర్చోబెట్టేంత ఔదార్యమూ రేడియో స్టేషన్లకు ఉండదు. ఎందుకంటే..
రేడియోజాకీ అనేది ఓ వత్తి. అందులో మధురమైన స్వరమే కాదు. విజ్ఞానపు విపంచిని సైతం మీటాలి. అది రాత్రికి రాత్రే వచ్చేదికాదు. నేర్చుకునేది అంతకన్నా కాదు. వేణు బాల్యం అలాంటి
సంగతులనెన్నో ముడిపడ్డవి కనుకనే.. ఆ జ్ఞాపకాల కరస్పర్శతో అనతికాలంలోనే తన వత్తిలో గుర్తింపు కలిగిన విజయాన్ని అందుకోగలిగాడు.
సొంతూరు
వేణు పుట్టి పెరిగింది ఖమ్మం దగ్గరలోని బ్రాహ్మణపల్లి అనే గ్రామం. బిఎస్సీ, ఎంఏ తెలుగు చదువుకున్నాడు. కానీ కళాశాలలో చదివిన చదువు కంటే.. కటుంబ నేపథ్యం, పెరిగిన వాతావరణం, బాల్యం నుంచే తనలో కళాత్మక అభిరుచిని పండించుకున్నాడు. 'మాది ఉమ్మడి కుటుంబం. తాతయ్య..కొడుకులతో సమానంగా అమ్మకూ వాటా ఇవ్వడంతో.. తాతయ్య ఇంట్లోనే నా బాల్యమంతా గడిచింది. నాన్న లక్ష్మారెడ్డి పోస్ట్‌మాస్టర్. చిన్నప్పటి నుంచే సినిమాలు చూడ్డం అలవడింది. దీనికో కథ ఉంది. మా తాతయ్య మోతుబరి. ఆయన మా ఇంటి ముందున్న విశాలమైన ప్రాంగణంలో పెద్దపెద్ద తెరలు కట్టించి, సినిమాలు వేయించేవారు. అలా అవి చూడ్డం వల్లనో ఏమోగానీ.. సినిమాలపై ఆసక్తి ఏర్పడింది. అలాగే మా చిన్నతనంలో ఊళ్ళో ఒకటి అరా.. ఇళ్ళళ్లో మాత్రమే టీవీలు ఉండేవి. పిల్లలమంతా అలా టీవీ ఉండే చోటకు వెళ్ళి చిత్రలహరి, ఆదివారం సినిమాలు చూసేవాళ్ళం. ఇలాంటి బాల్యపు అనుభవాలే టీవి, సినిమా పట్ల తెలియకుండానే నాలో ఆసక్తిని పెంచాయి. మా అమ్మమ్మ చాలా బాగా పాడేవారు. మాకో రైస్‌మిల్లు ఉండేది. ఆవిడ ఆ మిల్లు నుంచి బియ్యం మూటల్ని తెప్పించి.. పేదలకు పంచిపెట్టేది. ఒకరకంగా ఆవిడకున్న కళా, సేవాత్మక అభిరుచి చిన్నప్పుడే నాలో ముద్రపడిందేమో' అంటూ తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరవేసుకుంటాడు వేణు.
మౌనమే.. అమ్మ భాష!
ప్రతి సవ్వడి వెనుక.. ఓ అందమైన నిశ్శబ్దమూ ఉంటుంది. వేణు గళ ప్రవాహం వెనుక అలాంటి మనసుని తడి చేసే నిశ్శబ్దమూ ఉంది. వేణు తల్లిగారు ప్రమీల మాట్లాడలేరు. అందుకే అమ్మ ఒడిలో ఉన్నప్పటి నుంచే.. తల్లి మనసులోని లాలిపాట మాధుర్యాన్ని అర్థం చేసుకుంటూ పెరిగాడు. అమ్మతో 'మౌనమే నీ భాష ఓ మూగమనసా..' అంటూ అమ్మలాలనై సాగాడు. అలా అనురాగపు నిశ్శబ్ధంలోంచి నిత్యసవ్వడిగా మారాడు వేణు.
ఆర్టిస్ట్‌గా.. ప్రయత్నం
ఆర్టిస్ట్ కావాలనే ఆసక్తితో సొంతూరు వదిలి, హైదరాబాద్ వచ్చిన వేణు తొలినాళ్ళల్లో సినిమాలలోకి వెళ్లే ప్రయత్నాలు చేశాడు. అయితే ఆ రంగంలో తనకి గాడ్‌ఫాదర్స్ ఎవరూ లేకపోవడంతో.. సరైన దారి దొరకలేదు. దొరికినా.. నిలబడే వేషాలేవి రాలేదు. 'సినిమాల్లో నటించాలనే కోరిక తప్ప.. ఎలా ప్రయత్నాలు చెయ్యాలనేది తెలిసేది కాదు. ఏజెంట్ల ద్వారా 'అందరివాడు', 'జానీ' వంటి సినిమాల్లో చేశాను. కానీ, నిలబడి ఉండేవే తప్ప డైలాగ్స్ లేని పాత్రలవి. నాకు నటించగలిగే పాత్రలు ఉంటే చెప్పండి అని అడిగితే.. 'ఇలాంటివి చేస్తేనే.. రోజూ పని ఉంటుంది. డైలాగ్స్ ఉన్న పాత్రలైతే.. ఒకటి రెండురోజులే ఉంటాయి' అని ఏజెంట్లు తమ ధోరణిలో అనేవారు. బాగా బాధ కలిగించిన విషయమేమంటే.. ఒకరోజు షూటింగ్లో లైన్లో నిలబడి మధ్యాహ్నం భోజనం తినాల్సి వచ్చింది. నాకు తెలియదు.. జూనియర్ ఆర్టిస్టుల్ని అలాగే ట్రీట్ చేస్తారని. మాది కాస్తంత కలిగిన కుటుంబమే. మా ఇంట్లో నిత్యం ఎంతోమందికి అన్నం పెడుతుంటాం. ఇదేంటి నేను.. ఇలా లైన్లో నిలబడి తినడమేంటి? అని తలచుకోగానే కండ్ల వెంట నీరు కారిపోయింది. అలాంటి సినిమా అవకాశాలు చాలా వచ్చినా.. వద్దునుకున్నా' అంటూ కెరీర్ ప్రారంభంలో తనెలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడో చెప్పాడు వేణు.
యాంకర్‌గా మొదలై ...
ఈటీవిలో 'విధి' సీరియల్‌తో బుల్లితెరకు తొలిసారిగా పరిచయమైన వేణు.. ఆ పరిచయాలతో జీటీవి, ఈటీవి, దూరదర్శన్, మరికొన్ని తెలుగు ఛానళ్లలో వచ్చే పాటలు, ఇతర వినోద కార్యక్రమాలకు యాంకర్ (వీజే) గా గుర్తింపు కలిగిన ఆన్‌స్క్రీన్ కార్యక్రమాలు చాలానే చేశాడు. అలా టీవి యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు ఆ క్రమంలోనే.. తెలిసిన వారి ద్వారా ఆల్ ఇండియా రేడియోవారి రెయిన్బో ఎఫ్ఎమ్ విభాగంతో పరిచయం, ఆ తర్వాత ఆడిషన్లో వందలాది మందిలోంచి ఫైనల్‌కి చేరడం, అనేక వడపోతల నడుమ ఫైనలిస్టులో తనొకడిగా నిలబడ్డం.. చకచకా జరిగిపోయాయి. అలా తొలిసారి అంటే 2007 నవంబర్ 21న 'నేను ఆర్జే వేణు.. ఈ అబ్బాయి చాలా మంచోడు' అంటూ తన రేడియో ప్రయాణం మొదలెట్టాడు.
సమాంతరంగా కొన్ని సినిమాలు, టీవీల్లో నటుడిగా, సాంస్కతిక వేదికలపై వ్యాఖ్యాతగా, ఈవెంట్ ఆర్గనైజర్‌గా.. ఇలా బహురూపాల్లో రాణించే వేణు.. తన కేరియర్ లో ఎప్పుడూ రేడియోను మాత్రం వదల్లేదు. ఎందుకంటే.. రేడియోతో ప్రయాణం అనేది.. ఓ జీవితకాలం నిలిచిపోయేంత అందమైన అనుభవం. అలా తనకు రేడియోతో లెక్కలేనన్ని జ్ఞాపకాలు ముడిపడిపోయాయి అంటాడు వేణు. అందుకు తగ్గట్టుగానే శ్రమపడ్డాడు. కేవలం గలగల మాట్లాడితే సరిపోదు.. రేడియోజాకీ అంటే సమయస్ఫూర్తి కావాలి. ప్రాపంచిక విషయాలపై అవగాహన ఉండాలి. రేడియో అనేది ఓ కళాత్మకమైన వేదిక కనుక కళలపైనా పట్టు ఉండాలి. అలా విజ్ఞానం, భాషా, సాంస్కతిక అంశాలపై అవగాహన కోసం నిరంతరం ఓ విద్యార్థిలా శ్రమిస్తాడు వేణు 'రేడియో జాకీగా చేసిన ఈ పదేళ్ళ కాలంలో.. కార్యక్రమాల కోసం రాసుకున్న రాతప్రతులు (స్క్రిప్ట్) అన్నీ ఇప్పటికీ దాచుకున్నా.. అవేకాదు, దినపత్రికల్లో వచ్చే అనేక విజ్ఞానదాయక విషయాలను కత్తిరించి.. వాటిని పుస్తకాలుగా రూపొందించి, ఎప్పటికప్పుడు భద్రపరుస్తా. ఎప్పుడైనా ఏదైనా అవసరమైతే వాటిని చదివి, స్క్రిప్ట్ రాసుకుంటా. అలాగే కొంతమందిని చూసి కొన్ని నేర్చుకోవాలి. ఝాన్సీ, సుమ, ఉదయభాను వంటి యాంకర్లలో ఒక్కొక్కరిలో ఒక్కో క్వాలిటీ ఉంటుంది. అలాంటి వారినీ పరిశీలిస్తా. ఇలాంటివన్నీ సాధన చేస్తేనే రేడియో జాకీ అనే వత్తికి న్యాయం చేయగలం అని నేను నమ్ముతా' అంటూ చెప్పే వేణు తన వత్తిని ఎంతగా ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. అలా వత్తిలో ఒదిగిపోయాడు కనుకనే రేడియోలో తాను చేసే కార్యక్రమాల ద్వారా.. వ్యక్తిత్వ వికాసాన్ని అద్దుకున్న మాటల ద్వారా ఎంతో మందిలో ఉత్తేజాన్ని, చైతన్యాన్ని కలిగించాడు. కొందరైతే వేణు రేడియోలో చెప్పే మాటలు విని 'ఆత్మహత్య' ఆలోచనల నుంచి బయటపడ్డ సంఘటనలూ ఉన్నాయి. అలాంటి వ్యక్తిత్వ వికాసాన్ని పులుముకున్న ఆత్మీయ గొంతు వేణుది.
మాటల మనిషి కాదు.. చేతల మనిషి..
చేసే పనిద్వారా పేరు, ప్రఖ్యాతులు సంపాదించడమే జీవిత లక్ష్యం కాకూడదు అనే వేణు.. మాటల్లోనే కాదు చేతల్లోనూ పరోపకారి. ఆపదలో ఉన్న పేద విద్యార్థులు, అనారోగ్యం బారిన పడిన చిన్నారులు, వద్ధులు, అనాథలకు 'కలర్స్' అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా విద్య, వైద్యపరమైన సేవలూ అందిస్తున్నాడు. మాటల్లో, చేతల్లో స్వచ్ఛత, నిష్కల్మష పలకరింత, అలరింపుతో నిత్యం సవ్వడి చేసే వేణు రేడియో జాకీగా కషి అభినందనీయం. అందుకే తానొక వేణుగానమై, రేడియో తరంగమై భవిష్యత్తులోనూ మరిన్ని కళాత్మక విజయాలు సాధించాలని కోరుకుందాం!!
- అనంతోజు మోహన్ కృష్ణ