Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువకవి సాంబమూర్తి లండ. సాధారణ కుటుంబం నుండి ఎదిగొస్తున్న కవి. అమ్మ తన నుండి దూరం కావడంతో ఊహించని బాధలోకి వెళ్ళిపోయాడు. అమ్మ లేని లోటు కవిత్వం ద్వారా తీర్చుకుంటూ కవితలతో జట్టుకట్టి ఒంటరితనాన్ని దహించేసాడు. శూన్యం నుండి కవిత్వ మెరుపునందుకొని తన జీవితాన్ని సార్థకం చేసుకునే పనిలో పడ్డాడు. ' కొన్ని ఆశలు సజీవంగా ఉంటాయనీ/మనం నమ్మకంతో నీళ్ళు పోస్తుంటే/ జీవితమూ చిగురిస్తుంద' ని విశ్వసించే కవి ఈయన. తన తొలి కవితా సంపుటి' గాజు రెక్కల తూనీగ' తో సాహితీ రంగంలో అడుగుపెట్టి కవిత్వాన్ని రాస్తూ పోతున్న కవి సాంబమూర్తి లండ. ఆయనతో ఈ వారం నర్రా అభిముఖం...
- కవిగా ఎదగడానికి మీకు దోహదపడిన అంశాలేంటి?
చూస్తున్న సమాజాన్ని,అనుభవిస్తున్న కష్టాన్ని,గొంతు పూడుకుపోయేలా చేసే దుఃఖాన్ని, భయపెడుతున్న అమానవీయ పార్శ్వాన్నీ అక్షరాల్లోకి అనువదించే ప్రయత్నం చేసాను. కొన్ని సంఘటనలు నన్ను ముక్కలు చేస్తాయి. నన్ను నేను అతికించుకోవడానికి కవిత్వాన్ని ఆశ్రయిస్తాను. కొన్ని విపరీత ధోరణులు, ప్రభుత్వాల తెంపరితనం, రాజ్యహింస, అభివద్ధి విధ్వంసం,ప్రజల అనేకానేక నిస్సహాయతలు నన్ను కలవరపెడతాయి. అక్షరం మీద వ్యక్తీకరణ మీద ఉన్న పరిమితులు నిర్ఘాంతపరుస్తాయి. అప్పటికప్పుడు ఏదో ఒకటి మాట్లాడకపోతే ఉక్కిరిబిక్కిరి అవుతున్నానని చెప్పకపోతే బతుకుతున్నట్టు అనిపించదు. ప్రపంచంతో సాగించే నా సంభాషణే నా కవిత్వం.
- 'గాజు రెక్కల తూనీగ' కవిత్వంలోని ప్రత్యేకతలు చెప్పండి?
జీవితం పట్ల సున్నితమైన కోణం నన్ను ఎక్కువగా భావోద్వేగానికి గురిచేస్తూ వుంటుంది. దానిని కవిత్వీకరించే క్రమంలో ఒక చిన్న అపభ్రంశం,ఒక వాతావరణ మార్పు,కొద్ది పాటి నిర్లక్ష్యం చాలు బతుకులు భళ్ళున పగిలిపోవడానికి అని అర్థమైంది. ఆ ఆలోచనే 'గాజురెక్కల తూనీగ' కు నాంది.
- మీ 'అమ్మ గర్భాన్ని కాలదన్నుకొని...' కవిత ఆంగ్ల భాష వ్యామోహాన్ని నిరసించింది. మాతృభాష పరిరక్షణలో యువకవుల బాధ్యత ఎట్లా ఉంది?
ప్రపంచంలోని భాషలన్నీ గొప్పవే. ఏ భాషనూ మరో భాషతో పోల్చి తక్కువ ఎక్కువ అని చెప్పడానికి లేదు. కేవలం ఇంగ్లీష్ మాత్రమే అద్భుతమైనది అనే భావన తలకెత్తుకున్నట్టు వ్యవహరించే ప్రభుత్వాల/కొందరు వ్యక్తుల ధోరణిని తప్పకుండా నిరసించాల్సిందే. ప్రాంతీయ పలుకుబడులకు చోటివ్వడం, మాతభాషలో వ్యక్తీకరణ, మాతభాషా వాతావరణం లో వస్తువును చెప్పడం ద్వారా తల్లిభాషను బతికించుకోవచ్చు. ప్రతి కవీ, ఆ మాట కొస్తే ప్రతి సాహితీవేత్తా ఒక భాషా పరిరక్షకుడిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. రేపటితరం ప్రతినిధులుగా యువకవులకు గరిష్ట బాధ్యత వుంటుంది.
4. పల్లియ కవులకు నగరం కవితా వస్తువు అయినప్పుడు వారి భావాభివ్యక్తి ఎలా ఉండవచ్చు?
గ్రామీణ నేపథ్యం నుండి వచ్చిన కవులకు పల్లె మీద కొండంత ప్రేమ వుంటుంది. నగరం పట్ల కొంత అభద్రతాభావం కనిపిస్తుంటుంది. అది వారి కవిత్వంలో ప్రతిఫలిస్తూ వుంటుంది. గాజురెక్కల తూనీగ కూడా దీనికి అతీతం కాదు. సౌకర్యాలు,ఉపాధి అవకాశాల పరంగా నగరాన్ని తక్కువగా చూడడానికి లేదు. కొన్ని పల్లెలైనా ఇప్పటికీ స్వచ్ఛమైన పరిసరాలు సహజ సోయగాలతో అలరారుతున్నాయి. ఏదేమైనా కవి వాస్తవికతకు ఎంత త్వరగా చేరువైతే అంత మంచిది.
- మీ 'ఇంకొంచెం యుద్ధాన్ని ప్రేమించు...' కవితా ఉద్దేశ్యం?
ఒక చిన్న మనస్తాపానికో, ఒక ఎదురుదెబ్బకో, ఒక అవాంఛిత ఫలితానికో జీవితాన్ని త్యజించేటంత నైరాశ్యంలోకి మనుషులు, ముఖ్యంగా విద్యార్థులు , యువత, జారుకోవడం బాధ కలిగించింది. కాస్త సంయమనం, సహనం, వేచిచూడడం అలవాటు చేసుకోవడం అనివార్యం అని చెప్పాలి. అదే చేసాను ఈ కవితలో. ఒక టీచర్ తన పిల్లల్ని కన్విన్స్ చేస్తున్నట్టుగా రాశాను.
- మీ కవిత్వంపై తిలక్ 'అమతం కురిసిన రాత్రి' ప్రభావం ఏమైనా ఉందా?
ఉంది. తిలక్ ని నేను నా 16వ ఏట నుండీ చదువు కుంటూనే వున్నాను. నా 'వెన్నెల' ,'జ్ఞాపకాల్ని పూసే కొమ్మ' కవితలలో కదలాడే భావుకతకు తిలక్ కవిత్వమే ప్రేరణ. అయితే, వస్తువులు మాత్రం నాలోంచి చేదుకున్నవే.
- సీనియర్ కవులలో మీరిష్టపడే కవులెవరు? ఎందుకని వారే ఇష్టం?
పెద్ద జాబితానే వుంది.అజంతా,శివారెడ్డి,పాపినేని, శివసాగర్,దేవిప్రియ, హెచ్చర్కే, సీతారాం, అఫ్సర్, దర్భశయనం, ఆశారాజు, శిఖామణి, ఎన్.గోపి, ఓల్గా, కొండేపూడి నిర్మల,భవానీ దేవిలు. గొప్ప అభివ్యక్తి,కవిత్వంలో నిజాయితీ,జీవితాన్ని కవిత్వం చేసే నేర్పు,సమాజాన్ని దిశానిర్దేశం చేయగల ప్రతిభ ఇలా ఒక్కొక్కరూ ఒక్కో విశిష్టతతో కట్టిపడేస్తారు. అందుకే వీరంటే ఇష్టం.
- మీ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి?
కవిత్వంలో మొదటి దశనుండి రెండో దశలోకి ప్రయాణిస్తున్నాను. చాలా నడక ఉంది.చాలా విషయాలు నేర్చుకోవాల్సివుంది. రాయడం తగ్గించుకుని, కవిత్వాన్ని చదవడానికి ఎక్కువ సమయం కేటాయించుకుంటున్నాను. అయితే 2022లో నా రెండో కవితా సంపుటి రానుంది.
- నర్రా ప్రవీణ్ రెడ్డి
ఉస్మానియా విశ్వవిద్యాలయం