Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఎంత వద్దనుకున్న...''
ఈ లోకం చివరి తలుపు దగ్గర నిలబడి
ప్రేమకై తపించిపోయో ఏ నిర్భాగ్యుడి దోసిళ్ళకో
ఈ కవితను దానం చేస్తున్నాను
ఇది పాటై పాదరసంలా పారిపోయి
గాలిపొడిలా రాలిపోయి
ఏ చివరి క్షణాన్నో నీ పాదాలను తాకుతుంది
ఆ క్షణం వరకూ ఏ బుక్కాఫకీరో
కులాలు సమాధి చేసిన ప్రేమగాథల
అస్తిత్వాన్ని గానం చేస్తుంటాడు
దీపాలను ఆర్పేసే తుఫాను నవ్వులా
నీ ఎడబాటు, చీకటి కాళ్ళతో నడచివెళ్ళి
ఆకాశం మెడపై పెట్టిన ముద్దు
దిక్కుల్ని పగలేసి చుక్కల్ని పాలిపోయేలా చేస్తుంది
కాలభారాన్ని మోసేందుకు
గుండెలో దిగేసిన మేకు
సుకుమారమైన విధ్వంసాన్ని కళ్ళచూస్తుంది
ఎండకు కరిగే మంచు వంచనకన్నా
అది శాశ్వతమని నమ్మిన అందమైన ఊహే
మనసుని చీలికలు చీలికలుగా చెరుపుతుంది
పచ్చదనాన్ని దోచుకుపోయిన గ్రీష్మాన్ని శపిస్తూ
పక్షులన్నీ ఒక్కొక్కటిగా నేలరాలినట్టు
ప్రేమలో తానమాడిన నా ఆశలన్నీ నిను తిట్టుకుంటూ
అగ్గిమొగ్గలై రాజుకొని రాజుకొని
చల్లారిపోతున్న నీ ప్రాణదీపంలో
మిణుగురులగా మూగి లీనమైపోతాయి
నీ పేరు వింటేనే మూర్ఛనలుపోయే ఈ కవిత
కన్నీటిని ఎంతగానో దిగమింగాలనుకున్నా
బిరడా వదులైన నెత్తురు సీసాలా
కనురెప్పల కవచాన్ని తొలుచుకొని
కాగితంపై పాదపాదాలుగా ఒలికిపోతుంది
నేను నిలబడ్డ చోటు భూమధ్య రేఖై
సతతం అశ్రువర్షాన్ని కురిసి పోతుంటే
ఎంత వద్దనుకున్న తడిసిపోతాను
నిశ్శబ్దంగా రాలిపడే ఆ కన్నీళ్ళలో
ఏ దేవునికై ఎన్ని మొరలున్నాయో.
- డా.బి.బాలకష్ణ, 9948997983.