Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మూలం :
ముస్కురా కర్ ఖితాబ్ కర్తే హౌ
ఆదతే క్యూం ఖరాబ్ కర్తే హౌ
మార్ దో ముఝ్ కో రహ్మ్ దిల్ హౌం కర్
క్యా యే కార్- ఎ- సవాబ్ కర్తే హౌ
ముఫ్లిసీ ఔర్ కిస్ కో కహ్తే హై
దౌలతోం కా హిసాబ్ కర్తే హౌ
సిర్ఫ్ ఇక్ ఇల్తిజా హై ఛోటీ సీ
క్యా ఉసే బార్యాబ్ కర్తే హౌ
హమ్ తో తుమ్ కో పసంద్ కర్ బైఠే
తుమ్ కలిసే ఇంతిఖాబ్ కర్తే హౌ
ఖార్ కీ నోక్ కౌ లహూ దే కర్
ఇంతిజార్-ఎ-గులాబ్ కర్తే హౌ
ఏక్ దిన్ ఐ 'అదమ్' నా పీ తో క్యా
రోజ్ శఘ్ల్-ఎ-శరాబ్ కర్తే హౌ
కిత్నే బే-రహ్మ్- హౌ అదమ్ తుమ్ భీ
జిక్ర్-ఎ-అహ్ద్-ఎ-శబాబ్ కర్తే హౌ
అనువాదం :
ముసిముసి నవ్వులతో పలకరిస్తావు
అలవాట్లనెందుకు ఖరాబు చేస్తావు
చంపేయి నన్ను దయగల హదయంతో
ఈ మంచి పని కాస్త చేసిపెడతావు కదూ!
పేదవారని ఇంకెవరిని అంటారు
నువ్వు ఆస్తులను లెక్కపెడుతుంటావు
ఒక చిన్న కోరిక మాత్రమే ఉంది
దానిని నువ్వొప్పుకుంటావు కదూ!
నేనైతే నిన్ను కోరి కూర్చున్నాను
నువ్వు ఎవరిని ఎంచుకుంటావు
ముళ్ళ మొనలకు రక్తాన్ని అర్పించి
ఎర్రని గులాబీ కోసం వేచి ఉంటావు
'అదమ్' ఒక్కరోజు తాగకుంటే ఏమవుతుందిలే
ఎలాగో త్రాగే పని నువ్ ప్రతిరోజూ పెట్టుకుంటావు
నువ్ కూడా ఎంత దయలేని వాడవు 'అదమ్'
ఇంకా యవ్వనాన్నే గురుతుకు తెచ్చుకుంటావు.
అదమ్ అసలు పేరు సయ్యద్ అబ్దుల్ హమీద్. ఇతను 1910 ఏప్రిల్ 10న పాకిస్థాన్ లోని గుజ్రాన్వాలాలో జన్మించాడు. అదమ్ ప్రాథమిక విద్యాభ్యాసం తన ఇంటి వద్దనే జరిగింది. 1927-28 సంవత్సరంలో భారత సైన్యంలో చేరి రెండవ ప్రపంచ యుద్దం ఆరంభం కాకముందు వరకు పని చేశాడు. యుద్ధం తరువాత పుణెలో పోస్టింగ్ ఇవ్వబడింది. అక్కడే అదమ్ కి అమితంగా తాగడం అలవాటైంది. పాకిస్తాన్ స్వాతంత్య్రం తరువాత అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ మిలిటరీ అకౌంట్స్ పోస్ట్ లో రావల్పిండికి ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఆ తరువాత 1966లో పదవి విరమణ చేసాడు. యవ్వనం నుండే షేరో షాయారీ రాయడం ప్రారంభించిన అదమ్, గజళ్ళతో పాటు నజ్మ్ కవితలు, మస్నవీలు (దీర్ఘ కవితలు), ఖతాలు కూడా రాసాడు. అదమ్ దస్తూర్-ఎ-వఫా, చాక్ పైరహన్, ఝూట్-సచ్, నిసాబ్-ఎ-దిల్ మొదలుకొని ఒక డజను కవితా సంకలనాలు వెలువరించాడు. 10 మార్చి 1981లో అబ్దుల్ హమీద్ అదమ్ తన చివరి శ్వాస విడిచాడు.
చిన్న బహర్లలో (metre) మనసును వశం చేసుకునేలా రోమాంటిక్ గజళ్ళు రాయడంలో అదమ్ మంచి నైపుణ్యం కలవాడు. ఉర్దూ అర్థం చేసుకోగల ఏ యువతీయువకులైనా కూడా అదమ్ గజళ్ళను ఆస్వాదిస్తూ మైమరిచిపోతారు. అతను తన భావాలను, ఆలోచనలను సహజమైన వ్యూహాలతో వ్యక్తీకరిస్తాడు. ఈ గజల్ లో కవి తన యవ్వనంలోని ప్రేమానుభూతులను గుర్తుకు తెచ్చుకుంటాడు. మొదటి షేర్లో కవి ప్రియురాలి ముసినవ్వుల పలకరింపు తనని చెడగొట్టేలా ఉందని చమత్కారంగా గజల్ ని మొదలుపెడతాడు. తన ప్రేమను అంగీకరించని ప్రియురాలిని రెండవ షేర్లో విచిత్రంగా తనని చంపేయమని వేడుకుంటాడు. అప్పుడైనా తను ప్రశాంతంగా ఉండగలడని ఆశించి ప్రియురాలి చేతిలోనే మరణాన్ని కోరుకుంటాడు. చివర్లో ఇంకా యవ్వనాన్ని గుర్తుకు తెచ్చుకోవడం బాధాకరమని అంటాడు. కవి యవ్వనంలోని తన ప్రేమాయణంలో దుఃఖం తప్ప మరేమీ లేదని ఇందులో చెప్పకనే చెప్తాడు. గజళ్ళలో కవులు మద్యపానానికి పెద్దపీట వేస్తారు. దీని అర్థం దానిని వారు ప్రోత్సహిస్తున్నారని కాదు. ప్రాపంచిక సమస్యలతో ఎప్పుడూ సతమతమయ్యే కవి మనసుకు మద్యం తన్మయత్వాన్ని కలగించి ఉపశమనం చేకూరుస్తుందని సాహిత్య విమర్శకులు మద్యానికి కవికి ఉన్న సంబంధాన్ని వివరిస్తారు. పలుచోట్ల గాలిబ్ వంటి దార్శనికత గల కవులు ఆ తన్మయత్వాన్ని పారమార్థికమైనదిగా ప్రస్తావించారు.
- ఇనుగుర్తి లక్ష్మణాచారి, 9441002256