Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిరంతరం కవిత్వాన్ని గుండెచప్పుడుగా చేసుకున్న కవి మెట్టా నాగేశ్వరరావు. గత పదేండ్లుగా కవిత్వం రాస్తున్న ఆయన పశ్చిమగోదావరిలోని బయ్యనగూడెంలో పుట్టాడు. తనలో 'పొద్దు కవిత్వంలా పొడుస్తుందనీ,కవిత్వం ఉదయించని రోజు ఉపవాసం వున్నట్టుగా భావిస్తానని' చెప్పే నాగేశ్వరరావు మెట్టామాణిక్యాలు, నాగన్ నుడుల సవ్వడి, మనిషోక పద్యం పుస్తకాలను వెలువరించాడు. 'మనిషోక పద్యం' వచనకవితాసంపుటి ఆయనకు పేరును తెచ్చిపెట్టిన పుస్తకం. సామాజిక స్పృహతోనూ,తాత్వికచేతనంతోనూ శ్రామిక జీవితాలను కవిత్వీకరిస్తున్న నాగేశ్వరరావుకు పల్లాకష్ణ జాతీయ అవార్డు (పొద్దుటూరు), జనరంజక కవి ప్రతిభా పురస్కారం(గుంటూరు), రొట్టమాకు రేవు అవార్డు(ఖమ్మం), పెన్నా సాహిత్య పురస్కారం(నెల్లూరు) వంటి రాష్ట్రస్థాయి అవార్డులూ వచ్చాయి. తెలుగు విశ్వవిద్యాలయంలో ఎం.ఎ తెలుగు చేసి, దర్శిలో బీఈడీ చేసి, 2012 డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఉపాధ్యాయుడయ్యాడు. ప్రస్తుతం గోపాలపురం జిల్లాపరిషత్ హైస్కూల్ లో పనిచేస్తున్నాడు. ప్రాజెక్టుఫెలోగా తెలుగు యూనివర్శిటీలో కొన్నాళ్లు కొలువు జేశాడు. 'ఎన్ .గోపి రచనలుుపరిశీలన' అనే అంశంపై ప్రస్తుతం పిహెచ్.డినీ చేస్తున్నాడు ఆయన. ' పీడించే చీకటిక్షణాల్ని తరిమేసీ/ కవిత్వదీపంతో లోకాన్ని వెలిగించడానికే ' కవి కవిత్వం రాసేదని భావించే మెట్టా నాగేశ్వరరావుతో ఈ వారం నర్రా 'అభిముఖం' ....
- మీరు తొలుతనే రుబాయీ ప్రక్రియకు చెందిన కవిత్వాన్ని రాయటానికి గల కారణం?
నేను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రాజెక్టుఫెలోగా పనిజేశాను. ఆ ప్రాజెక్టు కోర్డినేటర్ గా ప్రముఖకవి ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారున్నారు. ఆయనపుడు రుబాయీలు రాసేవారు. అవి నన్నెంతో ఆకర్షించాయి. ఆయన ప్రేరణతో వెయ్యి రుబాయీలు రాసాను. తొలుత రదీఫ్ కాఫియాలు కొన్ని సడలింపులున్నా, తరువాత గానయోగ్యమైన రుబాయీలు ''మెట్టా'' అనే తఖల్లుస్ (కవినామ ముద్ర)తో వెలువరించాను. వేమన ఆటవెలది పద్యాల్లాంటి నడక రుబాయీలో కనిపించింది. అందుకే మొట్టమొదట రుబాయీ సజన నా కవితారంగ్రేట్రం అయ్యింది.
- 'మెట్టా మాణిక్యాలు' రుబాయి పుస్తకం మీరు ఊహించినంత పేరు తెచ్చిందా?
మెట్టామాణిక్యాలు రుబాయీల్ని అద్దేపల్లి మోహనరావు గారు రుబాయీగంధి కవితలు అన్నారు. కారణం రదీఫులు అన్నింటికీ అమరాయి. ఖాఫియాల విషయంలో జాగురుకత తీసుకోలేదు. వాటి సొగసు ఉర్దూకవిత్వ అభినివేశనం లేకపోబట్టి అలా జరిగిందంతే. అయినా మహాకవి సినారె ''ఈ సంపుటిలో అధికసంఖ్య రుబాయీల్లో గణనీయ పంక్తులున్నాయి'' అని ప్రశంసించారు. డా. పెన్నాశివరామకష్ణ గారు ''తెలుగుగజళ్లుు రుబాయీలు '' విమర్శగ్రంథంలో మెట్టామాణిక్యాలు సంపుటి గురించి రెండుమూడు పేజీల విశ్లేషణను పాజిటివ్ గా చేశారు. తెలుగురుబాయీ కవుల సరసన నన్ను నిలిపిన స్థాయిలో నా పద్యాలున్నాయి.
- మీ నాన్న తత్వం మీ కవిత్వంలో ఎట్లా ప్రవహిస్తుంది?
మా నాన్నతత్వం శ్రమతత్వం. ప్రేమతత్వం. మనిషిని ప్రేమించినట్టే, పశువుల్ని ప్రేమించేవాడు. పేదరికంలో పుట్టి, ఊపిరున్నంత వరకు దాంతో పోరాటం చేశాడు. కూలీ చేశాడు. చాకిరేవు వుతికాడు. సేద్యం చేశాడు. ఆయనంటేనే శ్రమజీవన సర్వస్వం. నాన్న శ్రమతనమే నా కవితాపాదాల్లోకి సహజంగా ప్రవేశించింది. నాన్న వెనుక నేనెన్నో చరణాలు వేశాను. అవన్నీ కవితాచరణాలయ్యాయి. నాన్న లేని నేను నిండుసున్నా. నాన్న వల్లే జీవితంలోనైనా,కవిత్వంలోనైనా నిండుగున్నా.
- ఆధునిక సాహిత్యంలో రెక్కలు ప్రక్రియా కవిత్వాన్ని పట్టించుకునే వాళ్ళు అసలున్నారా?
తెలుగులో హైకూలు పుట్టాక లఘుప్రక్రియలెన్నో వెల్లడయ్యాయి. గోపిగారి చేతిలో నాల్గు బుల్లిపాదాల నానీలు రూపుదిద్దాయి. వాటి వెనుకగా ఆరు చిన్నపాదాలు రెక్కలు వచ్చాయి. అయితే నానీలు మూడువందలకు పైగా సంపుటాలు వచ్చాయి. రెక్కలు పలు సంపుటాలు వచ్చాయి. సుగంబాబు గారు చిక్కని తాత్వికతను మథించారు. ఆ పిదప ఒకరిద్దరు రాసినా రెక్కలు విస్తతంగా వెలువడలేదు. సాహిత్యంలో గుర్తించదగ్గ ప్రక్రియగా రెక్కలు చెప్పవచ్చు. రెక్కలు నానీలంత ఉద్యమస్థాయిలో వెలువడ్డ ప్రక్రియ కాలేకపోయింది. విస్తతం కాలేదు.
- మినీ కవితా ప్రక్రియల వల్ల సాహిత్యానికి ఒరిగిందేమిటి?
మినీకవిత్వరూపాలు ప్రాచీన కవిత్వంలోని గాథారూపాలనుంచీ వుంది. కావ్యమంటే అశ్వాసాల కొద్దీ వుండక్కర్లేదు. విశ్వనాథుడు రసాత్మకమైన ఒక వాక్యమైనా కావ్యమే అన్నాడు గదా. ఏ రూపంలో కవితొచ్చినా అది కవిత్వమైతే చాలు. మినీకవితను రావిరంగారావు లాంటి కవులు బోయీలుగా మోసారు. ఎనభయ్యవ దశకంలో కొసమెరుపులతో అలరించాయి. అలిశెట్టి ప్రభాకర్ లాంటి కవులు మినీ కవితను ఎంత పదునుగా రాసారు మనకు విదితమే. మినీకవితల వల్ల సమయం లేని పాఠకులు కవిత్వానికి దూరం కాలేదు. వాళ్లింకా చదువుతున్నారంటే మినీరూపాల కవిత్వం ఓ దోహదకారి అంటాను.
- నికార్సయిన వచన కవితా రూపం ఉండగా లఘు కవితా ప్రక్రియల అవసరం ఏమిటి?
ఇప్పటి కవితావాహికల్లోని ట్రెండ్ వచనకవితనే. వచనకవితలు నిడివుండటం వలన పాఠకులు స్కిప్ చేసే అవకాశం వుంటుంది. సెల్ విప్లవం వచ్చాక పుస్తకాలెవరూ చదవడం లేదు. కనుక మారు తోన్న ఈ కాలంలో లఘు రూపాల్లో కవిత్వం రాస్తే పాఠకుల ఆదరణ .
వుంటుంది. వచన కవితకు లేని చదువరులు ఒక్కో సారి లఘురూపాలకు ఉంటారు.
- ఈ మధ్యన కొందరు తమకు గుర్తింపు వస్తుందనే భ్రమలో కొత్త ప్రక్రియలను సష్టిస్తున్నట్లు అనిపిస్తుంది? మీరేమంటారు?
ఈ మధ్య లఘు ప్రక్రియలు తామరతంపరలా వస్తున్నాయి. అవి స్వతంత్రతలోంచి పుట్టడం లేదు. అనుకరణలోంచీ,కీర్తి కాముకతలోంచి, ఇతర కారణాల్లోంచీ పుడుతున్నాయి. పాఠకులు లేక, వాటిమీద చర్చించేవారు లేక గిడుతున్నాయి. నానీలను బట్టి నానోలు, రుబాయీలను బట్టి మణిపూసలు వచ్చాయి. అనేక సంపుటాలు సష్టికర్తల ప్రమేయంతో ఆవిష్కతం అవుతున్నాయి. వచన కవితంటేనే స్వేచ్ఛాయుత వచనం. లఘురూపాలకు నియమాలు తొడగడం కొంత కత్రిమమే.
- 'చాకిరేవు' మీ కవిత్వంలో ఎట్లా భాగమైంది?
మా కులవృత్తి చాకిరేవు. నాన్నతో చాకిరేవు కెళ్లి బట్టలుదికేవాణ్ణి. మురికెంతో దేహం నిండా జల్లుకు న్నాను. యెండనీ, వాననీ, చలినీ తట్టుకుంటూ హంసరెక్కల్లా బట్టలు శుభ్రం చేసిన నేపథ్యం నాకుంది. వృత్తి నైపుణ్యాన్నే కాదు,
వృత్తి కడగండ్లను ప్రత్యక్షంగా ఎరిగిన వాణ్ణి. అందుకే సమగ్ర చాకిరేవు జీవితాన్ని నిశితంగా రాసే పనికి పూనుకున్నాను. 'అంటుకట్ట' అనే పేరిట త్వరలో చాకిరేవు కవితల సంపుటి రాబోతున్నది. నా చాకిరేవు కవితల్ని అదిలాబాద్ రేడియో స్టేషన్ లో ప్రఖ్యాతకవి సీతారాంగారు విశ్లేషణాత్మ కంగా చదివారు. చాకిరేవు చేసిన చిల్లరతో కొన్ని అక్షరాలు దిద్దాను గనకే ఆ జీవితంపై కవిత్వం రాసి ఋణం తీర్చుకుం టున్నాను.
- నోస్టాల్జియా కవిత్వంలో సమస్యలను చిత్రించే అవకాశం ఎలా ఉంది?
నోస్టాల్జియా అంటే బాల్య స్మరణ. నేడు కోల్పోయి నదీ, బాల్యంలో వరంలా వున్నదీ తలపోస్తూ రాసేదీ. నోస్టాల్జియా రాయడ మంటే వర్తమాన విషాదంలోంచి ఉప శమనంగా గతంలోకి వెళ్లిపోవడమే. నోస్టాల్జియా రాయడమంటే వర్తమాన సమస్యలపై నిరసన కూడా ఉంటుంది.
- వృత్తి జీవితాలను ప్రతిబింబించే కవితలు రాయడంలో మీ ఉద్దేశ్యం?
వృత్తి కవితలే రాజసం వున్న కవితలనీ నా అభిప్రాయం. '' వాని రెక్కల కష్టంబు లేనినాడు సస్యరమ పండి పులకింప సంశయించు'' అని గబ్బిలంలో జాషువా శ్రమజీవుడి గొప్పను పద్యపల్లకిలో వూరేగించాడు. నేను కూడా శ్రమజీవిత నేపథ్యంలోంచి వచ్చాను గనక వాళ్లు హక్కుగా నా కవిత్వంలోకి ప్రవేశించారన్నాను. పైగా నేనున్నది పల్లెలోనే. చుట్టుపక్కల వాళ్లు, స్నేహితులు ఎందరో శ్రమ జీవులసాంగత్యం వుంది. శ్రమజీవులే ఈ దేశసంపదకు వారసులు.వృత్తి జీవితాన్ని రాయడం కవి నిజాయితీలో భాగం.
- పశ్చిమ గోదావరి జిల్లా సాహిత్య పూర్వాపరాలు ఏమైనా చెప్పగలరా?
పశ్చిమగోదావరి జిల్లాలో మహామహులు సాహిత్యాన్ని సజించారు. బుచ్చిబాబు చివరకు మిగిలేది, గాలివాన కథ, అడవి బాపిరాజు సాహిత్యం, చిలకమర్తి, కొవ్వలి సోదరుల వెయ్యినవలలు పశ్చిమను సాహిత్యంలో సుస్థిరం చేశాయి. తరువాత రసరాజు, బివివి ప్రసాద్ , కొప్పర్తిగారు శక్తివంతమైన, లోతైన సాహిత్యాన్ని అందించారు. అప్పటితో పోలిస్తే, ఇపుడు కొంచెం సాహిత్యం తగ్గింది. కానీ నాణ్యమైన సాహిత్యమూ వస్తున్నది. మనిషోక పద్యం,బహుశా లాంటి కవిత్వం, ఆల్టర్ ఇగో లాంటి కథల సంపుటి వంటివి పశ్చిమ సాహిత్య అస్థిత్వాన్ని నిలుపుతున్నాయి.
- మీ ఇతర రచనల గురించి చెప్పండి
నేను కవిత్వంలో రుబాయీలు, రెక్కలు, వచనకవిత రాసాను. ఇటీవల ''పులసలు'' పేరిట నానీలు పుస్తకం ముద్రణవైపు అడుగులు వేస్తున్నది. అనేక సమీక్షలు రాసాను. శ్రమ జీవితాలపై రాసిన కవితల్ని వైవిధ్యంగా తీసుకుని ''బతుకు పద్యం'' పేరిట విశ్లేషణ వ్యాసాలను రాయడం జరిగింది. వందలకొలది వచనకవితల్ని సరళమైన శైలిలో రచించాను.
- నర్రా ప్రవీణ్ రెడ్డి, ఉస్మానియా విశ్వవిద్యాలయం.