Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆమె ఒక అద్భుతం.. తల్లిగా, చెల్లిగా, భార్యగా.. ఆమె ప్రతి పాత్ర ఒక అనిర్వచనీయం. మహిళగా ఇంటి బాధ్యతనే కాదు.. ఉద్యోగిగా వత్తి బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తుంది. ప్రతిరంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్న 'ఆమె'.. క్రీడారంగంలోనూ దూసుకుపోతోంది. గత 2 దశాబ్దాల నుంచి ఆటల్లో మహిళలు సత్తా చాటుతున్నారు. వివక్షతలను ఎదిరించి, అడ్డంకులను అధిగమించి క్రీడల్లో మెరుస్తున్నారు. మిథాలీ, మేరీకోమ్, అశ్వనీ నాచప్ప, సింధు,ఛానుల బాటలో నడుస్తూ.. ఎందరో 'యంగ్ ప్లేయర్స్' వివిధ క్రీడల్లో రాణిస్తున్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రముఖ క్రీడామణిరత్నం, జాతీయ ఫూట్ బాల్ టీంలో చోటు సాధించిన మన ఇందురూ యువతి
గూగులోత్ సౌమ్యపై ప్రత్యేక కథనం..!
గ్రౌండ్లోకి దిగితే చిచ్చరపిడుగే.. కృషి, పట్టుదలతో ఫుట్‌బాల్ క్రీడలో రాణిస్తూ పందొమ్మిదేళ్లకే భారత సీనియర్ మహిళల జట్టులో చోటు దక్కించుకున్న పిన్న వయస్కురాలు గుగులోత్ సౌమ్య.. ఇది ఒక రికార్డు అయితే... 30 ఏండ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల నుంచి భారత సీనియర్ మహిళల జట్టుకు ఎంపికైన ఏకైక క్రీడాకారిణి సౌమ్య కావడం మరో రికార్డు. ఆమె స్వస్థలం నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కిసాన్‌నగర్ తండా. నిజామాబాద్ కేర్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. తండ్రి గుగులోత్ గోపి ప్రభుత్వ ఉపాధ్యాయుడు, తల్లి ధనలక్ష్మి గహిణి, ఆమెకు ఇద్దరు అక్కలు, ఒక తమ్ముడు.
అండర్-14 నుంచి..
నేపాల్‌లో జరిగిన అండర్ 14 ఫుట్‌బాల్ పోటీల్లో భారత జట్టు తరఫున తొలిసారిగా ఆడిన సౌమ్య.. ఆపై చైనాలో అండర్ 16, మయన్మార్‌లో అండర్ 19 పోటీల్లో ఆడి ప్రతిభ చాటింది. దక్షిణాఫ్రికాలో 2019లో జరిగిన అండర్ 17 పోటీల్లో భారత జట్టు కెప్టెన్‌గా వ్యవహరించింది. భారత సీనియర్ మహిళల జట్టులో చోటు కోసం 11 నెలలు ప్రాక్టీస్ చేసింది. లాక్డౌన్లో క్రీడా ప్రాంగణాలన్నీ మూసివేసినా.. ప్రత్యేక అనుమతితో నిజామాబాద్ కలెక్టరేట్ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసింది. ఆమె శ్రమ వదా కాలేదు.
సౌమ్య తండ్రి గోపి సెకండరీ గ్రేడ్ టీచర్. ఆమె తల్లి ధనలక్ష్మి చదువుకోలేదు. వాళ్లకు సౌమ్యకంటే ముందు ఇద్దరమ్మాయిలున్నారు. సౌమ్య తర్వాత ఒక అబ్బాయి. మొత్తం నలుగురు పిల్లలు. ఆ అమ్మానాన్నల కల... పిల్లలందర్నీ చదివించి తీరాలని. అందుకోసం వాళ్లు పడిన శ్రమ చిన్నదేమీ కాదు.
సౌమ్య తండ్రి తనకు పోస్టింగ్ ఉన్న చోట ఉద్యోగానికి వెళ్లాలి. సొంతూర్లో ఉన్న పొలం పనులు చూసుకోవాలి. వాటి చుట్టూ జీవితాన్ని అల్లుకుంటే పిల్లలను చదివించడం కుదరని పని. అందుకే ధైర్యం చేసి ఓ నిర్ణయానికి వచ్చారా వారు. ధనలక్ష్మి నిజామాబాద్‌లో ఓ చిన్న ఇంటిని అద్దెకు తీసుకుని నలుగురు పిల్లలను స్కూలుకు పంపించింది. గోపి తన ఉద్యోగం, సొంతూర్లో పనులు చూసుకుంటూ వారానికోసారి నిజామాబాద్‌కు వచ్చి భార్యాపిల్లలను చూసుకునేవాడు. అమ్మానాన్నల కష్టం, అమరుస్తున్న సౌకర్యాలను అర్థం చేసుకున్నారు పిల్లలు. చక్కగా చదువుకుంటున్నారు.
సౌమ్య ఆరో తరగతి వరకు నిజామాబాద్ జిల్లా నవీపేటలోని జిల్లా పరిషత్ స్కూల్లో చదివింది. సెవెన్త్ క్లాస్‌కి నిజామాబాద్‌లోని రాఘవ స్కూల్లో చేరింది. జూన్‌లో చేరింది. జూలైలో ఇంటర్ స్కూల్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ టోర్నమెంట్‌కు సెలక్షన్ జరగాలి. వరుసగా వర్షాలు. స్టూడెంట్స్ సెలక్షన్స్‌కి కూడా తెరిపినివ్వడం లేదు. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ నాగరాజుకు టెన్షన్ పెరిగిపోతోంది. పాత స్టూడెంట్స్ కొందరుంటారు, మరికొందరు కొత్త వారిని సెలెక్ట్ చేస్తే బావుంటుంది, వాతావరణం సహకరించడం లేదు. తోటి టీచర్లతో పిచ్చాపాటి కబుర్లలో మనసులో మాట బయటకొచ్చింది. అయితే..అప్పుడు జరిగిందో మిరకిల్. ఓ టీచర్ కొత్తగా చేరిన ఓ అమ్మాయి పీఈటీ క్లాసుల్లేనప్పుడు సైతం గ్రౌండ్లో పరుగెడుతూ కనబడుతుందని తెలపడమే ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. తెలంగాణకు కలికితూరాయిని చేసింది. ఆమె పరుగులో ఒడుపు కోచ్ నాగరాజు గ్రహించారు. వాళ్లు ఊహించినట్లే ఆమె ఆ ఏడాది జరిగిన వంద మీటర్లు, రెండు వందలు, నాలుగు వందల మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకాలందుకుంది. కోచింగ్ ఇస్తే మంచి క్రీడాకారిణి అవుతుందని గుర్తించిన కోచ్ నాగరాజు.. స్కూల్లో అన్ని రకాల ఆటలనూ ప్రాక్టీస్ చేయిస్తున్నప్పుడు సౌమ్య ఫుట్‌బాల్ కిక్ చాలా మెళుకువగా ఇస్తోందని గమనించారాయన. సౌమ్య ఫుట్‌బాల్ క్రీడాకారిణి కావడానికి అది తొలి ఘట్టం.తల్లిదండ్రుల కల ఆమెను క్రీడాకారిణిని చేసింది. అయితే వాళ్లు కలగన్నది ఆమె క్రీడాకారిణి కావాలని కాదు. ఆమె క్రీడాకారిణి అవుతుందని వాళ్లు కలలో కూడా అనుకోలేదు. వాళ్లుండే తండాలో ఆడపిల్లల చదువే గగనం. అలాంటి చోట చదువులోనే కాదు.. దేశమే గర్వించ దగ్గ క్రీడాకారిణి అందించింది. అయితే... అసలైన ట్విస్ట్‌లు కూడా అక్కడే మొదల య్యాయి.
'ససేమిరా' అన్న తల్లి
'మీ అమ్మాయి బాగా ఆడుతోంది. రొటీన్‌గా స్కూల్లో అందరితో కలిపి ఓ గంటసేపు ఆడించడం కాదు, ఆమెకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తాను' అని సౌమ్య తల్లి ధనలక్ష్మి దష్టికి తీసుకువచ్చారు కోచ్ నాగరాజు. ఆయన మాట పూర్తయ్యేలోపే ఆమె కుదరదని కరాఖండిగా చెప్పేసింది. తండా వాతావరణంలో పెరిగిన ఆమె ఆందోళన సమంజసమే. నలుగురిలో ముగ్గురు ఆడపిల్లలు. పిల్లల్ని చదివించుకోవడానికి సొంత ఊరు కాదని, భర్త ఉద్యోగం చేసే ఊరు కూడా కాదని నిజామాబాద్‌కి వచ్చింది. అక్కడికే ఆమె సాహసమే చేసింది. ఆమె ఇప్పటి దాకా సాకింది ఒక ఎత్తయితే, ఇక ముందు ఆడపిల్లల సంరక్షణ ఒక ఎత్తు. వయసొచ్చిన పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. తమ దారిన తాము నడిచి పోతున్న ఆడపిల్లలకు.. తమ దారిలో ఎన్ని ప్రమాదాలు పొంచి ఉంటాయో తెలియదు. తల్లిగా తనకు తెలుసు. అందుకే ఆమె అంత కచ్చితంగా వ్యతిరేకించింది. పైగా ఏ పొరపాటు జరిగినా... తండాలో ఉన్న అందరిలా గోప్యంగా బతుకు వెళ్లదీయకుండా చదువులంటూ పట్టణం పోయారంటూ నలుగురూ అనే మాటల ఈటల ఆమెకు అప్పుడే గుచ్చుకుంటాయని ఆమె భయం. సౌమ్య ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేయడానికి సౌమ్య తల్లి ఏ మాత్రం సుముఖంగా లేదని నిర్ధారణ అయిన తర్వాత సౌమ్య తండ్రి నిజామాబాద్‌కి వచ్చే వరకు ఎదురు చూశారు. ధనలక్ష్మి చెప్పినంత ఖండితంగా చెప్పలేదు కానీ గోపి కూడా దాదాపుగా అదే మాట చెప్పారు. ఆ మాటతో నాగరాజుకి ఆశ వదులుకోక తప్పలేదు. అయితే... తన ఆశ స్టేడియంలోకి వస్తుందని అతడు ఊహించలేదు.
తెగువే మేరుపు
సౌమ్య కళ్ల ముందే అంతా జరుగుతోంది. కోచ్ ఇంటికి వచ్చి తల్లిని, తండ్రిని అడగడం చూసింది. తల్లి ఒప్పుకోకపోయినా తండ్రి ఒప్పుకుంటాడేమోనని ఆశపడింది.
అమ్మానాన్నలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడమూ విన్నది. ఫుట్‌బాల్ కోచింగ్‌కి అన్ని దారులూ మూసుకుపోతున్నట్లు అర్థమైంది. ఓ రోజు ఉదయం స్కూలుకి రెడీ అవుతోంది. ఆమె ఇంటి ముందు నుంచే పొరుగున ఉంటున్న ముగ్గురు అక్కచెల్లెళ్లు స్నేహ, నమ్రత, మేఘన వెళ్తున్నారు. వాళ్లు వెళ్తున్నది స్పోర్ట్స్ స్టేడియంకేనని, ఫుట్‌బాల్ ప్రాక్టీస్కేనని సౌమ్యకు తెలుసు. వాళ్లను రోజూ చూస్తూనే ఉంటుంది. ఆ రోజిటిలా చూస్తూ ఉండలేకపోయింది.. అంతే కాస్తా తెగువ ప్రదర్శించింది. స్కూలు బ్యాగ్ ఇంట్లోనే వదిలేసి, వాళ్లమ్మ అరుపులు ఆమెను ఆపలేకపోయాయి. కాళ్లు స్టేడియానికి పరుగుతీశాయి.. కోచ్ ముందు నిలబడి 'నేను ప్రాక్టీస్ చేస్తా'నని దైర్యంగా చెప్పింది.
చదువుల తల్లి .. క్రీడల్లో మేటి
మైదానాన్ని ఎంత ప్రేమించిందో తరగతి గదిని అంతే గౌరవించింది. చదువును ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదు. అ సౌమ్య తల్లిదండ్రులు ఫుట్‌బాల్ ప్రాక్టీస్‌కి ఎంతకీ ఒప్పుకోకపోవడంతో ఆ అమ్మాయి ఫీజు మాఫీ చేయమని స్కూల్ ప్రిన్సిపల్‌ను కోచ్ రిక్వెస్ట్ చేశారు. ప్రిన్సిపల్ ఒప్పుకున్నారు నైన్త్, టెన్త్ క్లాసులకు ఫీజు రద్దు చేశారు. ఆయన ప్రయత్నం కొంత ఫలించింది. నేషనల్స్‌కి సెలెక్ట్ అయిన తర్వాత కానీ ఆమె తల్లి పూర్తి అంగీకారం లభించింది. అప్పటి వరకు అయిష్టంగానే పంపారు. సౌమ్య టోర్నమెంట్స్‌కి వెళ్తూనే టెన్త్ క్లాస్‌లో 7.3 జీపీఏ, ఇంటర్లో 902 మార్కులు తెచ్చుకుంది. ఇప్పుడు బీఎస్సీ ఫస్టియర్. కేర్ అకాడమీ కూడా ఆమెకు ప్రోత్సహిస్తోంది. ఫీజు మాఫీ చేయడమే కాకుండా స్పోర్ట్స్ ఎక్స్పెండిచర్ కోసం ఏటా పాతికవేలిస్తోంది. వచ్చే నెలలో పంజాబ్‌లో టోర్నమెంట్ ఉంది. ఇప్పటికే ఒరిస్సా రైజింగ్ స్టార్, కోలాపూర్ ఎఫ్‌సి క్లబ్‌లు ఆమెకు ఆఫర్ ఇచ్చాయి.
దేశానికి తొలి మెడల్
అండర్ ఫోర్టీన్తో మొదలైన సౌమ్య ఫుట్‌బాల్ కెరీర్ అండర్ సిక్స్టీన్లను దాటి అండర్ నైన్టీన్కి చేరింది. కోల్‌కతా టోర్నమెంట్లో మంచి స్కోర్ చేసింది. ముంబయిలో జరిగిన ఉమెన్ ఇండియన్ లీగ్ టోర్నమెంట్‌తోపాటు దేశంలో అనేక టోర్నమెంట్లు ఆడింది. సౌతా ఫ్రికాలోని జోహన్నాస్బెర్గ్లో జరిగిన బ్రిక్స్ అండర్ 17లో ఆడింది. బ్రెజిల్, రష్యా, చైనాలతో పోటీ పడింది. అండర్ ఎయిటీన్ సాఫ్ (సౌత్ ఏషియన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్) కప్ టోర్నమెంట్లో ఆడింది. ఆ పోటీలో మనదేశానికి కాంస్య పతకం వచ్చిది. భారత మహిళల ఫుట్‌బాల్ టీమ్ గెలుచుకున్న తొలి ఇంటర్నేషనల్ మెడల్ అది.
ప్రకతి పరీక్షనూ నెగ్గింది
సౌమ్య ఇష్టంతో, తల్లిదండ్రుల అయిష్టంతో మొదలైన ఫుట్‌బాల్ ప్రాక్టీస్‌కు అన్నీ అనుకూలంగా ఏమీ కలిసి రాలేదు. ప్రకతి కూడా తనవంతు పరీక్ష పెట్టింది. అది 2015. నేపాల్‌లో అండర్ ఫోర్టీన్ టోర్నమెంట్‌కి వెళ్లింది సౌమ్య. ఖాట్మండులోని దశరథ స్టేడియంలో ఆడాలి. ఆటకు అంతా సిద్ధమవుతున్నారు. ఒక్కసారిగా పెళపెళమంటూ పెద్ద శబ్దం. 'ఏమై ఉంటుందీ' అని అందరూ దిక్కులు చూశారు. కాళ్ల కింద భూమి కదులుతోంది. స్టేడియం ఉయ్యాలలా ఊగుతోంది. అది భూకంపం అని తెలిసింది. ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ 'భూకంపం ఎలా ఉంటుందో నేపాల్కెళ్లి చూసొచ్చాను' అని నవ్వుతూ అంది సౌమ్య. ''భూకంపం కారణంగా ఆ టోర్నమెంట్ ఆగిపోయింది. మా టీమ్‌లో ఎవరికీ ఏమీ కాలేదు. నిజామాబాద్‌కి వచ్చిన తర్వాత తెలిసిన వాళ్లంతా వచ్చి, మేము క్షేమంగా తిరిగి వచ్చినందుకు సంతోషించారు'' అన్నది. భూకంపం కారణంగా సౌమ్య అప్పుడు ఆడలేకపోయింది. ఇప్పుడు మళ్లీ కాలం పరీక్ష పెట్టిందామెకు. పుస్తకాలా, ఫుట్‌బాలా తేల్చుకోమంటోంది. ఆమె తండ్రి గోపికి కూతురు పరీక్షలు రాస్తే బావుణ్ననే ఉంది.
సౌమ్య పెద్దక్క స్వప్న బీటెక్ చేసి సివిల్స్‌కి ప్రిపేరవుతోంది. రెండో అక్క స్వర్ణ బీఎస్సీ నర్సింగ్ చేసి పారామెడికల్ కోచింగ్ తీసుకుంటోంది. సౌమ్యను ఐపీఎస్‌గా చూడాలని ఆ తండ్రి కల. సౌమ్యకు మాత్రం ఉమెన్ ఫుట్‌బాల్ టీమ్‌లో సీనియర్ లెవెల్లో దేశం తరఫున ఆడాలని ఉంది. క్రిస్టియానో రోనాల్డ్ ఆమెకు ఇష్టమైన ఫుట్‌బాల్ క్రీడాకారుడు. ఆమె కెరీర్ కల క్రీడల చుట్టూ తిరుగుతోంది. మహిళల క్రికెట్ అనగానే మిథాలీరాజ్ గుర్తుకు వచ్చినట్లే భవిష్యత్తు తరానికి మహిళల ఫుట్‌బాల్ అంటే గుగులోత్ సౌమ్య గుర్తుకు రావాలని ఆశిద్దాం.
అంచెలంచెలుగా ఎదుగుతూ..
నాలుగేళ్ల కిందట చైనాలో జరిగిన అండర్- 16 పోటీల్లో అత్యధిక గోల్స్‌తో టాపర్‌గా నిలిచింది. గతేడాది డిసెంబరులో జరిగిన తెలంగాణ ఉమెన్స్ లీగ్‌లోనూ టాపర్. ఐపీఎల్ క్రికెట్ మాదిరిగానే ఫుట్‌బాల్ ఆటకు జరిగే ఇండియన్ ఉమెన్స్ లీగ్ పోటీలు ఈ ఏడాది జనవరిలో బెంగళూరు వేదికగా జరిగాయి. సౌమ్య ముంబయిలోని ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్లబ్ క్యాంక్రి జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించింది. ఇందులో తన జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడి సెమీస్ వరకు వెళ్లింది. సౌమ్య ఏడు గోల్స్ కొట్టడంతో టోర్నమెంట్లో ద్వితీయ స్థానంలో నిలిచింది.
అక్కా పెండ్లికీ రాలేదు
శిక్షణ శిబిరంలో ఉన్న సౌమ్యను అక్క పెండ్లికి సైతం రాలేదు. రామ్మని అడిగిన తండ్రి మాటకు స్పందిస్తూ.. ''పెద్దక్క పెండ్లి చూడాలని నాకూ ఉంది డాడీ. కానీ ఇంతకాలం కన్న కలలు నిజం చేసుకొనే అవకాశం ఇప్పుడు వచ్చింది. నన్ను నేను నిరూపించుకోవాలంటే ఈ శిబిరంలో పాల్గొనక తప్పదు. ఇంతటి అరుదైన అవకాశం మళ్లీ రాదని అనుకుంటున్నా. అక్క, బావతో నేను ఫోన్లో మాట్లాడతా. పెళ్లిని వీడియో కాల్ ద్వారా చూస్తాను'' అని చెప్పింది. ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు నా కూతురు పట్టుదలతో ప్రయత్నిస్తున్నందుకు ఆ తండ్రి కండ్లు ఆనందంతో చెమర్చాయి.
భారత ప్రాబబుల్స్‌లో స్థానం
ఆమె ప్రతిభను గుర్తించి అధికారులు భారత ప్రాబబుల్స్ జట్టులో స్థానం కల్పించారు. ఇందులో 30 మంది క్రీడాకారిణులుండగా అందరిలో సౌమ్యనే చిన్నవయస్కు రాలు. 2022లో ఆసియా కప్ ఫుట్‌బాట్ టోర్నమెంట్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. పటిష్ఠమైన జట్టును బరిలోకి దింపేందుకు భారత ఫుట్‌బాల్ లో సౌమ్య తన ప్రతిభను ప్రదర్శించనుంది.