Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మూలం
జె-హాల్-మిస్కీ మకున్ తఘాఫుల్ దురారు నైనా బనాయే బతియా
కి తాబ్-ఎ-హిజ్రా నదారమ్ ఐ జాఉ న లేహూ కాహే లగాయే ఛతియా
శబా-ఎ-హిజ్రా దరాజ్ ఛూ జుల్ఫ్ ఒ రోజ్-ఎ-వస్లత్ ఛూ ఉమ్ర్-ఎ-కోతహ్
సఖీ పియా కో జో మై న దేఖూ తో కైసే కాటూ అంధేరీ రతియా
యకాయక్ అజ్ దిల్ దో చశ్మ్ జాదూ బ-సద్-ఫరేబ్ బ-బుర్ద్ తస్కీ
కిసే పడీ హై జో జా సునావే పియారే పీ కో హమారీ బతియా
ఛూ శమ్-ఎ-సోజా ఛూ జర్రా హైరా జ మెహర్-ఎ-ఆఉ-మహ్ బగశ్తమ్ ఆఖిర్
న నీంద్ నైనా న అంగ్ చైనా న ఆప్ ఆవే న భేజే పతియా
బ-హక్క్-ఎ-ఆఉ మహ్ కి రోజ్-ఎ-మహశర్ బ-దాద్ మారా ఫరేబ్ 'ఖుస్రో'
సపీత్ మన్ కే దురారు రాఖూ జో జాయే పాఊ పియా కీ ఖతియా
అనువాదం
నేనున్న దుస్థితిని మరువకు, కన్నులతోనైనా కాస్త మాట్లాడుతూ ఉండు ఎడబాటును ఓర్వలేను ప్రియా నువ్ నన్నెందుకు ఎదకు హత్తుకోవట్లేదు
విరహరాతిరి కురుల వలే పొడవుగా తాను కలిసేరోజు జీవితంలా చిన్నగా
ప్రియుని చూడకుండా ఓ సఖీ! ఈ చీకటి రాతిరులను గడిపేయడమెలాగా
రెండు మాయా కన్నులు వంద వంచనలతో నా గుండెనెంతో బాధించాయి
ఇప్పుడు ఈ వ్యథలన్నింటినీ నా ప్రియుని వద్దకు వెళ్ళి ఎవరు చెప్పుతారు
మినుకు మినుకమనే దీపంలా మండుతూ విస్మయంలో నే పడిపోయాను
కంటికి నిద్దుర తనువుకు శాంతీ లేనే లేవు, నువ్వు రావు నీ లేఖలూ రావు
తీర్పునిచ్చే రోజున, 'ఖుస్రో', మాయలతో నన్ను ఆటపట్టించి వెళ్ళిన తాను
మళ్ళీ దొరికితే నా ఎదను అణచుకుని నేను తనని కూడా ఆటపట్టిస్తాను.
తాము జీవించిన కాలంలోని పరిస్థితులు ఎంతో అస్థిరంగా, వ్యతిరేకంగా ఉన్నా కూడా, ఎందరో మహానుభావులు వారికున్న మేధస్సును, విజ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు అందించి, శతాబ్దాల వైవిధ్యమైన భారతీయ సంస్కతీ సంప్రదాయాలకు మూలస్థంబాలై నిలబడ్డారు. అలాంటి మహావ్యక్తుల్లో, ఉర్దూలో గజల్ ప్రక్రియకు పునాది వేసిన అమీర్ ఖుస్రో ప్రముఖుడు.
13వ శతాబ్దంలో జన్మించిన ఖుస్రో పూర్తి పేరు అబుల్ హసన్ యమీనుద్దీన్ ''అమీర్ ఖుస్రో దెహల్వీ''. అసాధారణ విద్వత్తు, బహుముఖ ప్రజ్ఞా పరిపూర్ణత వంటి అరుదైన లక్షణాలు ఖుస్రో సొంతం. ప్రస్తుత ఉత్తర ప్రదేశ్ లోని పటియాలిలో జన్మించిన ఇతను, కవిగా, సాహితీవేత్తగా, సైనికుడిగా, రాజ దర్బారులలో సభ్యుడిగా, శాస్త్రీయ హిందుస్తానీ సంగీత విద్వాంసుడిగా, సూఫీ సంతుగా వివిధ పార్శ్వాలలో తనని తాను ఆవిష్కరించుకున్నాడు. చెంఘీజ్ ఖాన్ దండయాత్ర సమయంలో తన తండ్రి భారత్ కి వచ్చి ఇక్కడే స్థిరపడ్డాడు. 8వ యేటనే తండ్రిని కోల్పోయిన ఖుస్రో, ఢిల్లీలోని తన అమ్మమ్మ వాళ్ళింట్లో పెరిగాడు. ఖుస్రో బ్రజ్, అవధీ భాషల్లో కూడా సాహిత్య ప్రవేశం కలదు. 14వ శతాబ్దం వరకు సాగిన అపభ్రంశ యుగంలో కూడా నూతన భాషా ప్రయోగాలు చేశాడు. తనదైన భావవ్యక్తీకరణతో నవ్యోపమానోపయాలు సష్టించి తన భాష సార్వత్రిక ఆమోదం పొందేట్టు దానికి సరికొత్త సొబగులు అద్దాడు. సామాన్య ప్రజల భాషకు, యాసకు పట్టం కట్టి, జానపద సాహిత్యాన్ని సుసంపన్నం చేసాడు. గజల్, మస్నవీ, ఖతా, పహేలీ, ఖవ్వాలీ వంటి వివిధ కవితా ప్రక్రియల్లో నేర్పు సాధించాడు. ఇలా వివిధ గద్య పద్య రచనల్లో వైవిధ్యమైన సాహిత్య సజన చేసిన ఖుస్రోని, ఉర్దూ సాహిత్య పితామహుడిగా పరిగణిస్తారు. శబ్దమర్మాన్ని పట్టుకున్న వారెవరైనా సంగీతాన్ని సాహిత్యాన్ని వేరుగా చూడరు. సినారె ప్రకారం చెప్పాలంటే- ''సంగీత సాహిత్య సమలంకతే, స్వరరాగ పదయోగ సమభూషితే''. ఖుస్రో జీవితంలో సంగీతం సాహిత్యం రెండు పార్శ్వాలు. పైగా వాటిల్లో దేనికదే సాటి. భారతీయ శాస్త్రీయ సంగీతానికి ప్రతిరూపమైన హిందుస్తానీ సంగీతానికి ఖుస్రో ఆద్యుడు. అసలు హిందుస్తానీ సంగీత స్వభావాన్ని ఇతర సంగీతాలతో వేరు చేసే తబలా, సితార్ సంగీత వాయిద్యాలను సష్టించిందే అమీర్ ఖుస్రో. సూఫీ తత్త్వాన్ని ప్రవచించేందుకు ఖుస్రో ఫార్సీ, అరబ్బీ, తుర్కీ, హిందుస్తానీ సంగీత సంప్రదాయాలను కలిపి ఖవ్వాలీ అనే నూతన సంగీత ప్రక్రియకు జన్మనిచ్చాడు. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధమైన సంగీత ప్రక్రియల్లో ఖవ్వాలీ ఒకటి. రాజాస్థానాలలో ఉన్నత పదవులు నిర్వహించినా కూడా, ఖుస్రో తన ఆధ్యాత్మిక గురువు హజ్రత్ నిజాముద్దీన్ ఔలియా చరణాల దగ్గరే తన ఆనందాన్ని వెతికేవాడు. ఇతన్ని ఉత్తర భారతదేశంలో ప్రముఖ సంతు మహాత్ముడిగా పరిగణిస్తారు. ఏదేమైనా భారతీయ సంగీత సాహిత్య సంప్రదాయాలకు ఖుస్రో చేసిన కషి చారిత్రాత్మకం, చిరస్మరణీయం. భారత్, ఇరాన్ రెండు దేశాలలో ఫార్సీ మహాకవిగా సమాన గౌరవం గల ఖుస్రో, భారతీయ భాష అయిన 'హిందవీ' పట్ల తనకున్న అనురాగాన్ని ఇలా ఉల్లేఖిస్తాడు- ''వాస్తవానికి నేనొక భారతీయ చిలుకను, ఏమైనా అడిగేది ఉంటే హిందుయీలో అడగండి. అందులోనే నేను తీయగా పలుకుతాను''. ఖుస్రో రచనల్లో దేశభక్తి, స్వేచ్ఛ, సమైక్యత, జానపద జీవితం మొ.. విషయాలు ప్రధాన నేపథ్యాలుగా ఉండి సామాన్య మానవ జీవనాన్ని ప్రతిబింబిస్తాయని విమర్శకులు అంటారు.
గజల్ ఫార్సీ సాహిత్యంలోని ఒక కవితా ప్రక్రియ. కానీ ఇది ఫార్సీ కంటే ఉర్దూలోనే ఎక్కువగా ప్రసిద్ధి చెందింది. ఆ స్థాయి ఉర్దూ గజల్ కి అంతా సులువుగా ఏం లభించలేదు. కొన్ని శతాబ్దాల వరకు ఉర్దూ భాషతో పాటు ఉర్దూ గజల్ కూడా ఎన్నో ప్రయోగాలకు గురైంది. ఈ కాలమ్ లో తీసుకున్న గజల్, 13-14 శతాబ్దాల మధ్యకాలంలో రాయబడింది. ఈ గజల్ హిందుస్తానీ సంగీతంలో, ఉర్దూ సాహిత్యంలో ఎంతో విలువైనది. ప్రసిద్ధమైంది. భాషా పరిశోధకులు దీనినే మొట్టమొదటి ఉర్దూ గజల్ గా పరిగణిస్తారు. ఖుస్రో ఇందులో రెండు భాషలను ప్రయోగించాడు. ప్రతీ షేర్ మొదటి పాదంలో ఫార్సీ భాషను, రెండవ పాదంలో బ్రజ్ భాషను ఉపయోగించాడు. ఈ గజల్ సూఫీ తత్త్వానికి సంబంధించింది. సూఫీ తత్త్వంలో భగవంతునికీ భక్తునికీ మధ్య ఉండే మార్మిక ప్రేమానుబంధానికి ఒక భౌతిక రూపం ఇస్తారు. ప్రియుడి కోసం ఒక ప్రియురాలు అనుభవించే విరహవేదనయే దీని నేపథ్యం. మొదటి షేర్ లో ప్రియురాలు తన బాధను ఉపేక్షించొద్దని కనీసం కనులతో అయినా మాట్లాడమని ప్రియున్ని వేడుకుంటుంది. ఎడబాటును ఓర్వలేని తాను, తనని ఎందుకు హత్తుకోవట్లేదని ప్రియున్ని ప్రశ్నిస్తుంది. రెండవ షేర్లో వేదనతో గడిచే రాత్రి కాలం పోడవైందని, వాళ్ళిద్దరు కలిసే రోజు జీవితం లాగా చిన్నదిగా ఉందని చెప్తుంది. వాళ్ళిద్దరి బంధంలో ఆనందం కంటే ఎక్కువగా వేదనయే ఉందని ఈ షేర్ తో అర్థమవుతుంది. మూడవ షేర్లో ప్రియుడి చూపుల మాయజాలం తనని ఎంతో బాధించిందని, తన బాధలను ప్రియుడి దగ్గరకి వెళ్లి చెప్పే అవసరం ఎవరికుందని విస్తుపోతుంది. నాల్గవ షేర్లో తన పరిస్థితి మినుకు మినుకమనే దీపంలా గజిబిజిగా ఉందని చెప్తూ కంటికి నిద్దుర, తనువుకు శాంతి లేవని వాపోతుంది. తాను గానీ తన నుండి ఒక్క ఉత్తరం కూడా రాదని నిరాశ చెందుతుంది. చివరి షేర్లో, భగవంతుడు తీర్పునిచ్చే రోజున, తనని ఆటపట్టించి వెళ్ళిన ప్రియుడు మళ్ళీ దొరికితే, తన మనసును అణిచి అయినా సరే ప్రియున్ని ఆటపట్టిస్తానని అంటుంది.
- ఇనుగుర్తి లక్ష్మణాచారి, 9441002256