Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బతకటమే కాదు జీవితమంటే బతికించడం కూడా. ఆకలితో పస్తులున్నవాడికే ఆకలి విలువ తెలుస్తోంది. కష్టపడి చదివినప్పుడే ఆ చదువు విలువ తెలుస్తోంది. చదువు అంటే సర్టిఫికెట్లు కాదు 'నేర్చుకోవాల్సింది జ్ఞానం' అని అర్థం చేసుకున్నాడు. పదిహేడేళ్ల వయసుకే కుటుంబ బాధ్యతలు భుజనా వేసుకొని చదువునీ, జీవితాన్ని గెలిచి చూపించాడు. 'విజ్ఞానంతోనే వికసించు జగత్తు పసిపిల్లల చదువే దానికి విత్తు' అని బలంగా నమ్మి.. ఆ పిల్లలకోసం ఇంటినే లైబ్రరీగా మార్చి అక్షర జాన్ఞాన్ని అందిస్తున్నాడు. అతడే ''పేదరికం పై యుద్దానికి చదువే ఆయుధం'' అని ప్రకటించిన నర్సంపేట యువకుడు కాసుల రవికుమార్. అతని లైఫ్ జర్నీ ఈవారం జోష్..
ఒడిదుడుకుల జీవితం
చిన్నప్పటి నుంచీ ఆర్థిక ఇబ్బందులు చుట్టూ అలుముకున్న కుటుంబం. నాన్న ఆటో నడిపేవాడు. అమ్మ బీడీలు చుట్టేది. తమ్ముడు, చెల్లె. ఒకే కుటుంబంలో ముగ్గురినీ చదివించడమంటే మాటలా? అతడు మూడో తరగతిలో ఉన్నప్పటికే నాన్న ఆర్థిక ఇబ్బందులతో ఆటో కూడా అమ్మేయాల్సి రావటంతో ఇంకా కష్టాల ఊబిలో పడిపోయంది కుటుంబం. మూడో తరగతిలో ఉన్నప్పుడు స్కూల్ ఫీజు కట్టలేదని నన్ను స్కూల్లోంచి పంపించేటప్పుడు ''చదువులో ఫస్ట్ ఉంటే ఇలా పంపేయరు'' అన్న టీచర్ మాటలే ప్రేరణ అయ్యాయి. అతడిలో కసిని పెంచాయి. అప్పట్నించి ఎప్పుడూ చదువుని పక్కకు పెట్టలేదు. ప్రతీ సంవత్సరం స్కూల్ ఫస్టే. అలా తనతో పాటు చెల్లెకు కూడా ఫీజుల గోల లేకుండా చదువుకున్నారు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అన్నట్టు 'చదువుని చదువుతోనే సాధించాడు'. టెన్త్ తర్వాత పాలిటెక్నిక్ రాసి 'ట్రిపుల్ ఇ' లో చేరాలి. చేతిలో పైసా లేదు.. కానీ మినిమం ఫీజైనా కట్టాలి. కానీ, పరిస్థితి వేరు. చివరికి 'చేరకూడదు' అని నిర్ణయానికి వచ్చాడు . కానీ అమ్మ ఒప్పుకోలేదు. ఇంట్లో ఉన్న ఒక పాత సైకిల్, ఇంకొన్ని సామాన్లు అమ్మి మరి కాలేజికి పంపింది. అయినా ఇబ్బందులు తప్పలేదు. చేతిలో పైసా లేదు. పుస్తకాలు కొనుక్కోవటానికి కూడా డబ్బులుండేవి కాదు. పొద్దున్నే పేపర్ వెయ్యటం, ఆ తర్వాత కాలేజ్ టైమింగ్స్‌ని బట్టి ఎస్టీడీ బూత్‌లో పని చేసేవాడు. అలా వచ్చిన డబ్బుల్లో తన ఖర్చులకు పోను మిగిలిన డబ్బులు అమ్మకి పంపేవాడు. అతనికి డిప్లొమాలో ఎదురైన మరో అతిపెద్ద సమస్య ఇంగ్లీష్. అప్పటివరకూ చదువంతా తెలుగు మీడియం లోనే కావడం.. ఇప్పుడు చదవాల్సిదంతా ఇంగ్లీష్ లోనే కావడంతో చాలా ఇబ్బంది పడ్డాడు. సాయంత్రాలు ఇంగ్లీష్ డిక్షనరీ పట్టుకొని కుస్తీ పట్టేవాడు. ఒక పక్క ఆకలి, మరో పక్క ఇంటి పరిస్థితులు. వీటన్నిటినీ పోగొట్టాలంటే చదువులో ముందుండి తీరాల్సిందే. అలా డిప్లొమా పూర్తి చేశాడు.
'లీడ్' అలా మొదలైంది
డిప్లొమా తర్వాత ఈ-సెట్లో మంచి ర్యాంక్ వచ్చింది. కానీ మళ్లీ డబ్బే సమస్య. ఏం చేయాలో తెలియదు. చదువు కల కాకూడదని తప్పించాడు. పాలిటెక్నిక్ ఎగ్జామ్స్ రాసిన తర్వాతి రోజు నుంచే ఓ ప్రయివేట్ స్కూల్లో టీచర్ గా జాయిన్ అయ్యాడు. దీంతో ఇంజినీరింగ్ చేయాలన్న ఆశకు స్వస్తీ పలికాడు. కానీ చదువుకోవాలన్న ఆలోచన కుదురుగా ఉండనీయలేదు. అందుకే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీఏ ఇంగ్లీష్ లిటరేచర్ ఫీజు కట్టాడు. ఇంగ్లీష్ అంతు చూడాలన్న తపనతోనే డిగ్రీ పూర్తి చేశాడు. అప్పటికి 21 ఏండ్లు. రూరల్ ఏరియాల్లో ఉండే స్టూడెంట్స్ కి ఇంగ్లీష్ ఎంత పెద్ద సమస్య అనేది నాకు తెలుసు. అందుకే సమ్మర్ లో ఫ్రీగా ఇంగ్లీష్ క్లాసులు చెప్పడం ప్రారంభించాడు. అలా వాళ్లకి చెబుతూనే తను కూడా నేర్చుకున్నాడు. ఆ ఇంగ్లీష్ క్లాసుల ప్రోగ్రామ్‌కి తను పెట్టుకున్న పేరు లీడ్ (ూజుAణ). ఆ తర్వాత ఎంఏ ఇంగ్లీష్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు. అప్పుడు కూడా ఆ టీచింగ్ నడుస్తూనే ఉంది. ఆ తర్వాత ఎడ్‌సెట్‌లో స్టేట్ సెకండ్ ర్యాంక్ తెచ్చుకున్నా. వెదురు తడకల కింద ఇంగ్లీష్ క్లాసులు చెప్పుకుంటున్న నేను స్టేట్ ర్యాంక్ అంటే ఏవరూ నమ్మలేదు. అదే టైంలో అప్పటి సీఐ 'బోనాల కిషన్' నన్ను పిలిచి లీడ్ ప్రోగ్రాం బావుందని సమ్మర్ క్యాంప్ ప్లాన్ చేశారు. అందులో 200 మంది స్టూడెంట్స్ వచ్చారు. అది మేము ఊహించిన దానికంటే ఎక్కువ. 2010లో గ్లోబల్ ఇంగ్లీష్ లెర్నింగ్ అనే బుక్ రాశాను. ఇప్పుడదీ నాలుగో ముద్రణ అమయింది. ఆ పుస్తకాన్ని, చిన్న పాకెట్ డిక్షనరీతో కలిపి సీఐ 'బోనాల కిషన్' సహకారంతో విద్యార్థులకు అందిచాడు. లీడ్ నిరంతర ప్రయాణానికి 'నేను ప్రయివేట్ స్కూల్లో చేసినా, గవర్నమెంట్ టీచర్ని అయినా నా ప్రతీ నెలజీతంలో 10% లీడ్ కోసం ఖర్చు పెడతాను' అని నిర్ణయించుకున్నాడు. తనతో పాటు స్కూల్ లో పనిచేసే కొలిగ్ ''శోభ'' ను ఇష్టపడ్దాడు. ఒక్కరికి ఒక్కరు పరస్పర అంగీకారంతో ఆదర్శ వివాహం చేసుకున్నారు. నా భార్య సహకారంతో అప్పట్నుంచి ఇంగ్లీష్ క్లాసులకి వచ్చే ప్రతీ స్టూడెంట్‌కీ నా గ్లోబల్ ఇంగ్లిష్ లెర్నింగ్ బుక్ ఫ్రీగా అందించడం... బయట ఆ బుక్ అమ్మకం ద్వారా వచ్చిన ప్రతీ పైసా 'లీడ్' కోసమే ఖర్చు చేశాడు.. చేస్తున్నాడు.. తర్వాత లైబ్రరీ ఒకటి పెట్టాలనే ఆలోచన వచ్చింది. అప్పటికే చిన్నప్పుడు ఏస్కూల్లో అయితే ఫీజు కట్టలేదని పంపినారో అదే స్కూల్‌కి ప్రిన్సిపల్ అయ్యాడు. అప్పుడు మొదలైన ఆలోచనకు గవర్నమెంట్ జాబ్ వచ్చాక నా భార్య సహకారంతో ''లీడ్ లైబ్రరీ'' గా మారింది. ఇప్పుడు లీడ్ లైబ్రరీతో మొబైల్ లైబ్రరీ ఆలోచన ఉంది. అది కాకుండా చుట్టు పక్కల తండాల్లో ఉండే నా స్టూడెంట్స్‌తో చైన్ లైబ్రరీస్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా ఉంది. అంటే ప్రతీ తండాలోనూ కొన్ని బుక్స్ ఉంచుతారు. వాటి బాధ్యత అక్కడ ఉండే ఒక స్టూడెంట్ చూసుకుంటాడు. రోజూ వచ్చేవాళ్లకి బుక్స్ ఇస్తాడు. అవి చదవటం అయిపోతే మళ్లీ పక్క ఊళ్లో ఉన్న లైబ్రరీ నుంచి బుక్స్ మార్చుకుంటారు. ఇలా చైన్ లైబ్రరీలు నడపాలనే ప్రయత్నాల్లో ఉన్నాడు. అందుకోసం ఎవరు సాయం చేస్తామన్నా బుక్స్, పిల్లలు కూర్చునే చైర్స్ లాంటి ఫర్నిచర్ తప్ప ఏదీ తీసుకోవటం లేదు. అతని దగ్గర చదువుకున్న చాలామంది పిల్లల్లో ఇప్పుడు ఇంజినీరింగ్, మెడిసిన్ చేస్తున్న వాళ్లు ఉన్నారు.
చదువే ఆయుధం నేను ఏ స్కూల్లో పని చేస్తే ఆ స్కూల్లో ఒక లైబ్రరీ ఏర్పాటు చేయడం. ఏదో ఒక రకంగా పిల్లలని చదువుకి దగ్గర చేయాలనే ఆలోచడమే అతని వ్యాపకం. అయితే అతని తరువాత కూడా ఆ స్కూల్ లైబ్రరీ నడవాలని అతని కోరిక. ఒక వేళ అద్దె ఇల్లయినా తర్వాత సమస్యలు రావచ్చు అందుకే కొంత లేట్ అయినా నా ఇంట్లోనే లైబ్రరీ ఉండాలి అనుకున్నాడు. అలా తన సొంత ఇంటినే లైబ్రరీ కోసం కావాల్సిన విధంగా కట్టించాడు. ''భూమిక'' సత్యవతి సహకారంతో తన ఇంట్లో గ్రంథాలయాన్ని ప్రారంభించాడు.
విద్యార్థుల చెంతకే విజ్ఞాన భాండాగారం
కోవిడ్ దెబ్బకు వ్యవస్థలన్నీ కుదేలయ్యాయి. విద్యారంగం పరిస్థితి మరి దారుణం. పిల్లలు విద్యా సంవత్సరం కోల్పోకుండా ప్రభుత్వం ఆన్ లైన్ బోధన అందిస్తున్నప్పటికీ అది అందని ద్రాక్షే. పేద, మధ్య తరగతి, నిరుపేద విద్యార్థులు ఆన్ లైన్ చదువులకు దూరమయ్యారు. స్మార్ట్ ఫోన్లు అందరికీ అందుబాటులో లేకపోవడం ఒక సమస్య. విద్యుత్తు లేకపోవడం సరిగ్గా మరో సమస్య. అన్నీ ఉన్నా పల్లెల్లో మెబైల్ సిగల్స్ లేకపోవడం అతి పెద్ద సమస్య. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది పిల్లలు ఇంటిపట్టునే ఉండి చదువుంటున్నారు. మరోవైపు విజ్ఞానాన్ని పంచేందుకు గ్రంథాలయాలు తెరుచుకోవడం లేదు. ఈ క్రమంలో గ్రంథాలయాలేని గ్రామీణ ప్రాంత విద్యార్థులు, నిరుద్యోగ యువత కోసం కాసుల రవికుమార్ లీడ్ సంస్థ ఆధ్వర్యంలో విమాత్నంగా సంచార (కారు) గ్రంథాలయాన్ని సొంత ఖర్చులతో నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులకు ఉపయోపడే వివిధ రకాల పుస్తకాలను కారులో ఉంచుకొని గ్రామాల్లో తిరుగుతున్నారు. పుస్తకాలు అవసరమైన వారికి కొన్ని రోజుల పాటు ఉచితంగా అందిస్తున్నారు. యువకులు, విద్యార్థుల్లో పుస్తకాలు చదివే అలవాటును పెంపొందించడమే లక్ష్యమని రవికుమార్ భావించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని -మారుమూల గ్రామాలు, ఆదివాసీ విద్యార్థులకు ఈ గ్రంథాలయ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చాడు. భూమిక ఉమెన్స్ కలెక్టివ్ సంస్థ ప్రారంభించిన అబ్బూరి ఛాయాదేవి సంచార గ్రంథాలయం స్ఫూర్తితో దీన్ని నడుపుతున్నట్టు రవికుమార్ తెలిపారు.
మాస్టర్ టీన్స్
''రేపటి ఉత్తమ పౌరుల కోసం...'' అనే నినాదంతో రూపొందించిన 'మాస్టర్ టీన్స్ అవార్డు -2021 విద్యార్ధులకు పోటీలు నిర్వహించి వారికి బహుమతులు అందించడం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దలు సైతం ఆశ్చర్యపోయేలా, పిల్లలు వారి అభిప్రాయాలను చాలా చక్కగా వ్యక్తపరిచారు.
ప్రకతి ప్రేమికుడు
పర్యావరణ దినోత్సవం సందర్భంగా వ్యాస రచన పోటీలు, అవగాహన సదస్సులు నిర్వహించడం, తెలంగాణ సాహితి, లీడ్ సంయుక్త ఆధ్వర్యంలో కవితల పోటీలు నిర్వహించడం, సాహిత్య, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు.
కరోనా కాలంలో చేయూత
లీడ్ విజ్ఞానం అందించే పనికే పరిమితం అవ్వలేదు. కష్టాల్లో ఉన్న వారికి చేదోడుగా నిలిచే ప్రయత్నం కూడా చేసింది.చేస్తుంది. ' తిండి కలిగితే కండ కలదోరు/ కండ కలవాడేను మనిషోరు' అని గురజాడ అన్నట్టు కరోనా కాలంలొ తిండి లేక అవస్థలు పడ్డ అనేక మందికి లీడ్ ఆపన్నహస్తం అందించి వారి ఆకలి తీర్చింది.
జాతీయ నాయకుల జయంతులు,వర్ధంతుల సందర్భంగా హస్పటల్స్ లో రోగులకు పండ్లు పంపిణి చేయడం వంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు.
- అనంతోజు మోహన్ కష్ణ