Authorization
Sun April 27, 2025 10:33:14 pm
నడుమును వంచె పుస్తకాల సంచులు
బరువును పాతాళంలోకి విసురుతుంటే
తడుముకోని మస్తకపు సమాధానంతో
ఆకాశానికి ఎదిగే అవకాశమొకటి కావాలిప్పుడు..!
సామాజిక మాధ్యమాల జాతర శిరస్సును వంచి
రంగు తెరకు నేత్రాభిషేకం చేయిస్తుంటే
దూరదష్టి నిండిన కళ్లద్దాలు పెట్టుకుని చూసే
మసక బారని విజ్ఞాన కాంతోకటి కావాలిప్పుడు..!
బాల్యపు ఆటపాటలు వీడియోగేమ్ అరుగుపైకెక్కి
వికత రూప వికటాట్టహాసం చేయిస్తుంటే
శిథిలమౌతున్న కండబలానికి తర్ఫీదునిచ్చే
ఒలంపిక్ విన్యాసమేదో కావాలిప్పుడు.. !
గోరంత బాధ కొండంత ప్రాణానికి
ఆత్మహత్య పందిరిని అలవోకగా వేస్తుంటే
అలిగిన మనసుకు నలగని దుప్పటి కప్పే
ఆత్మ స్థైర్యపు పాఠమేదో కావాలిప్పుడు !
విలువల సంస్కతిని తలనెత్తుకునే జలధారలు
అజ్ఞాన తాపానికి ఆవిరి రూపమెత్తుతుంటే
గౌరవ సమీరాన్ని అలుముకున్న
సత్ప్రవర్తనల వర్షపు జల్లొకటి కావాలిప్పుడు !
ఔను..మరి
రేపటి పౌరుల జీవనరేఖను గీసే
మార్పుల కలమేదో కావాలిప్పుడు !
పసిమనసులు పసిడి వనమై విరబూసే
వసంతకాలం మనసారా రావాలిప్పుడు !!
(నవంబర్ 14..బాలల దినోత్సవం సందర్బంగా)
-గుండేటి రమణ 9949377287