Authorization
Thu April 24, 2025 12:52:41 pm
గాలి నెమలీక మెత్తగా తాకుతోంది
ఎక్కడో ఆకుగజ్జెల గలగలలు
చుక్కల కంకి బరువుతో
పచ్చని ఆకాశంలా మాగాణి
నడుం వంచి గట్టు మీద నీడని మేస్తున్న తాటిచెట్టు
ఆరిన పొయ్యిలో బొగ్గు ముక్కలా దారమ్మటి బర్రె కునుకు
జతని వీడిన తహతహతో
పంపు సెట్టు మీద తల బాదుకుంటున్న కోడెతాచు ఎండ
పొలం మధ్యలో దిష్టి బొమ్మకి కాకికి తరాల నాటి చెలిమి
పంట చుట్టూ దారం చుట్టినట్టు
కొంగల బారు
పిడచగట్టిన నాలికలా పంట కాలువ
గట్టు తొర్రలో ఇరుక్కున్న ఎలక నత్త
కాపుకొచ్చిన వరి పంట గూళ్ళు నిండిన చెట్టులా
కళకళ లాడుతోంది ఇప్పుడు
- గూండ్ల వెంకట నారాయణ, 7032553063