Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టిక్ టిక్ శబ్దం చేస్తూ
లోకాన్ని ముందుకు నడిపే
ముల్లులాంటి వాక్యాన్ని
తీపి తీపి రుచులను పంచుతూ
కష్టసుఖాలను సకినాలుగా చుట్టే
పండగలాంటి వాక్యాన్ని
ఇష్టంగా కొరుక్కుతింటూ
చివరిదాకా
ఆస్వాదించేటట్టు చేసే
చక్కని బతుకులాంటి వాక్యాన్ని
ఆకాశం నిండుగా
కాంతిని వెదజల్లుతూ
రాలిపడని
చుక్కలలాంటి వాక్యాన్ని
పెద్దచేప
చిన్నచేపను
మింగడం కోసమని
గాలానికి కుచ్చిన
ఎర్రలాంటి వాక్యాన్ని
అలాంటి
ఇలాంటి
ఒక వాక్యాన్ని
ఇప్పటికిప్పుడు విసురుతున్నా
నలుగురికి గొడుగుపట్టే
కవిత్వపుచెట్టయి
మొలవకపోతుందా
నలుగురిలోకి పురివిప్పే
ఆలోచనగా మారి
తనని తాను
తిరగరాసుకొకుండా ఉంటుందా
- తండ హరీష్ గౌడ్, 8978439551