Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేలంతా గంగాజలమై
విస్తుపోయి చూస్తుంటే
చిరిగిన ఆచ్ఛాదనలను
పెనవేసుకున్న పైరు
అన్నపూర్ణమ్మ సాక్షిగా
అభిషేకం చేసుకుంటుంది
నిద్రెరుగని రాత్రులకు
నిత్యం కాపలా కాస్తూ
మట్టి గర్భాన మొలిచిన
మణి మాణిక్యాలను ఏరుకోవాలని
తొలిపొద్దుకు మునుపే తొంగి చూస్తాయి
కోటి ఆశలతో రైతు నేత్రాలు
విచ్చుకున్న చినుకుల ఖడ్గం
బ్రతుకు చిత్రాన్ని విచ్చిన్నం చేస్తుంటే
నోటికాడి బువ్వ
నూతిలోకి జారుతోంది
కాలం చితిమంటలు కాచుకుంటూ
సరదా తీర్చుకుంటుంది
గాలి వాటం బ్రతుకులను వెంటేసుకుని
రైతు బ్రతుకు ఇప్పుడు
అన్నమో రామచంద్రా అంటుంది
ఆర్తనాదం చేస్తూ
ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తూ..
- మచ్చ రాజమౌళి, 9059637442