Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మూలం:-
క్యా కహూ తుమ్ సే మై కీ క్యా హై ఇష్క్
జాన్ కా రోగ్ హై, బలా హై ఇష్క్
ఇష్క్ హీ ఇష్క్ హై జహా దేఖో
సారే ఆలమ్ మే భర్ రహా హై ఇష్క్
ఇష్క్ హై తర్జ్ ఒ తౌర్ ఇష్క్ కే తఈ
కహీ బందా, కహీ ఖుదా హై ఇష్క్
ఇష్క్ మాశూక్ ఇష్క్ ఆశిక్ హై
యాని అప్నా హీ ముబ్తాలా హై ఇష్క్
గర్ పరస్తిశ్ ఖుదా కీ సాబిత్ కీ
కిసూ సూరత్ మే హో భలా హై ఇష్క్
హై హమారే భీ తౌర్ కా ఆశిక్
జిస్ కిసీ కో కహీ హుఆ హై ఇష్క్
'మీర్'-జీ జర్ద్ హోతే జాతే హో
క్యా కహీ తుమ్ నే భీ కియా హై ఇష్క్
అనువాదం:-
నీకు ప్రేమను గురించి నేను ఏమని చెప్పాలి
మనసుకు సోకే రోగం, గుండెను కూల్చే విపత్తు ప్రేమంటే
ప్రేమంటే ప్రేమయే ఉన్నది ఎక్కడ చూసినా
ప్రపంచమంతా ప్రేమతో నిండుకుంటూ ఉంది
ప్రేమకున్న స్వభావం ప్రేమించడం మాత్రమే
మనిషిరూపంలో ఒకచోట, దైవరూపంలో మరో చోట
ప్రేమించేవారూ ప్రేమించబడేవారూ ఇరువురూ ప్రేమరూపులే
అంటే మనకి మనం అనుభవించే వేదనే ప్రేమ
ఆ పరమాత్ముని పూజ నువ్వు చేయగలిగితే
అందరి ముఖాలలో కనబడే మంచితనమే ప్రేమంటే
నా తీరును కూడా ప్రేమించే ప్రేమికులున్నారు
వారికి కూడా ఏదో చోట ప్రేమ కలిగి ఉంటుంది
మీర్ గారు! మీరు వాడిపోతునట్టు ఉన్నారు
మీరు కూడా ఒకనాడు ప్రేమించారా ఏంటి?
మీర్ సమకాలికులలో సౌదా, మీర్ సోజ్, మీర్ దర్ద్ వంటి గొప్ప కవులున్నా కూడా, ప్రజలందరి గుండెల్లో మీర్ శాయరీ సంపాదించుకున్న స్థానం ఎంతో సుస్థిరమైనది, శాశ్వతమైనది. ఎందుకంటే మీర్ వ్యక్తిత్వం అలాగే తాను ఎంచుకున్న వ్యక్తీకరణ శైలి రెండూ ఎంతో గొప్పవి. మీర్ ఢిల్లీలోని జామా మస్జిద్ మెట్లపై కూర్చుని, అటువైపుగా వచ్చి వెళ్ళే ఫకీర్లకు, సామాన్య ప్రజలకు తన కవిత్వం వినిపించేవాడు. తన కవిత్వాన్ని అందరూ ఎందుకు ఇష్టపడతారు అని అన్నప్పుడు మీర్ ఇలా జవాబిస్తాడు- ''నా షేర్లను అందరూ ప్రత్యేకంగా ఇష్టపడుతున్నారు, కానీ నా సంభాషణ మాత్రం సామాన్య ప్రజలతోనే ఉంటుంది''.
''రేఖ్తాలో (ఉర్దూ పాత పేరు) నువ్వొక్కడివే కవిరాజువి కాదు గాలిబ్, నీ కంటే ముందు మీర్ అనేవాడు ఒకడున్నాడని అంటారు'' అని మహాకవి గాలిబ్, మీర్ గురించి తన గజల్లో ఇలా చెప్తాడు. ఆగ్రాలోని ఒక సూఫీ ఫకీరు కుటుంబంలో జన్మించిన మీర్ తఖీ మీర్, 18వ శతాబ్దానికి చెందినవాడు. మీర్ అప్పుడే ప్రగతి చెందుతున్న గజల్ కి చక్కని రూపాన్నిచ్చాడు. ఇతని తరువాత తరాలలో మహాకవులుగా ఒక వెలుగు వెలిగిన మీర్జా గాలిబ్, ఫిరాక్ గోరఖ్పూరీ వంటి కవులు, వారి రచనల్లో మీర్ కవిత్వ ప్రభావాన్ని గురించి ఎంతో గొప్పగా వెల్లిబుచ్చారు. ఫైజ్-ఎ-మీర్, జిక్ర్-ఎ-మీర్, నుకత్-ఉస్-షోరా, కుల్లియత్-ఎ-మీర్, కుల్లియత్-ఎ-ఫార్సీ మొదలైనవి మీర్ రచనలు. మీర్ రచనల్లో ప్రేమ, శృంగారం, విషాదం, తత్త్వం మొదలైన భావాలు ప్రధానంగా కనిపిస్తాయి. మీర్ సమకాలికులలో సౌదా, మీర్ సోజ్, మీర్ దర్ద్ వంటి గొప్ప కవులున్నా కూడా, ప్రజలందరి గుండెల్లో మీర్ శాయరీ సంపాదించుకున్న స్థానం ఎంతో సుస్థిరమైనది, శాశ్వతమైనది. ఎందుకంటే మీర్ వ్యక్తిత్వం అలాగే తాను ఎంచుకున్న వ్యక్తీకరణ శైలి రెండూ ఎంతో గొప్పవి. మీర్ ఢిల్లీలోని జామా మస్జిద్ మెట్లపై కూర్చుని, అటువైపుగా వచ్చి వెళ్ళే ఫకీర్లకు, సామాన్య ప్రజలకు తన కవిత్వం వినిపించేవాడు. తన కవిత్వాన్ని అందరూ ఎందుకు ఇష్టపడతారు అని అన్నప్పుడు మీర్ ఇలా జవాబిస్తాడు- ''నా షేర్లను అందరూ ప్రత్యేకంగా ఇష్టపడుతున్నారు, కానీ నా సంభాషణ మాత్రం సామాన్య ప్రజలతోనే ఉంటుంది''.
చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన మీర్, ఎన్నో విషాదాలను అనుభూతి చెందాడు. ఆ అనుభూతులనే గజళ్ళుగా తీర్చిదిద్దాడు. అందుకే మీర్ ఇలా అంటాడు-''నన్ను కవి అని పిలవకండి. నేను కేవలం నా వేదననంతా కలిపి దీవాన్లు సంకలనం చేసాను''. అయితే ఎంత వేదన చెందినా కానీ, మీర్ లో ప్రేమ మాత్రమే ఉండేది. మీర్ కవిత్వం చదివితే తన ప్రతి వేదనలో ఏదో ఒక విశ్వాసం ఉంటుందని తెలుస్తుంది. ఈ ఎపిసోడ్లో తీసుకున్న గజల్ లో మీర్, ప్రేమ గురించి తనదైన శైలిలో తేటతెల్లం చేసాడు. మొదటి షేర్లోనే ప్రేమ యొక్క అంతిమ స్వభావాన్ని అన్నింటికంటే ముందే చెప్పి హెచ్చరిస్తాడు. తరువాతి షేర్లలో ప్రేమ యొక్క ఉన్నతమైన గుణగణాలను గురించి చెప్పి, చివరి షేర్లో, నువ్వు కూడా ఎపుడైనా ప్రేమలో పడ్డావా అని తనని తానే వ్యంగ్యంగా పలకరించుకుంటాడు.
- ఇనుగుర్తి లక్ష్మణాచారి, 94410 02256