Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్నెన్ని దారులు గుండా
నా అడుగుల తీగలు సాగాయో?
తుదకు నీ పాశానికే
చిక్కుకుంటాయని నాకు తెలుసు.
తుది మరణమే అని తెలిసినా
బతకటం మర్చిపోలేదు!
నీ ఉనికి సత్యమే అయినా
నాకు గుర్తుకే రాలేదు!
ధమన, సిరల్లో రక్తం నెమ్మదించినా
సిరా సత్తువ చల్లబడలేదు.
చివరి ప్రయాణంలో
నను మోయడానికి
అక్షరాలు నిలువెత్తు నలుగురవుతాయి.
శవం కంపు పోగొట్టడానికి
ఏ ధూమం అక్కర్లేదు..
కొన్ని నా కవితా వాక్యాల్ని
గానం చెయ్యండి..
గతం అంతా పల్లేరు దారులే
పూలు చల్లి బాధ పెట్టొద్దు..
నా ముక్కులో దూది పెట్టినా
నోటికి మాత్రం గుడ్డ కట్టొద్దు..
నా ఆరో వేలిని నాతోనే ఉండనివ్వండి
శవమైనా నా కదే జీవం..
నా శవయాత్ర
కాలం కాన్వాసు పై
వెలగడానికి సిద్ధమౌతున్న
జ్వలించే చైతన్య చిత్రిక..
నా మృతదేహం మీద
కన్నీటి మృత్తిక కాదు
కాస్త కవిత్వం చల్లండి!
కవిత్వానికి మరణం లేదు
మరి కవికెక్కడిది!!
- పట్లూరి నర్సింహారెడ్డి
9849150476