Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పూర్ణిమ తమ్మిరెడ్డి తెలుగు కథా రచయిత, అనువాదకులు, పుస్తక సమీక్షకులు. ఇటీవల ప్రారంభమైన ఎలమి ప్రచురణల వ్యవస్థాపకుల్లో ఒకరు.''సియా హాషియే'' అనే మంటో అనువాద రచన వీరి తొలి పుస్తకం. పుస్తకాలకై ప్రారంభించిన ప్రత్యేక వెబ్సైట్ పుస్తకం.నెట్ (pustakam.net) నిర్వహణా బాధ్యతలను 2009-2021 వరకూ పంచుకున్నారు. గత ఏడాదికాలంగా బీబీసి తెలుగులో టెక్నాలజీ కాలమ్, మంటో కోసం ప్రత్యేకించి ఏ mantointelugu అనే డిజిటల్ ప్రాజెక్ట్ నిర్వహిస్తున్నారు.వృత్తిరిత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్. పుట్టి పెరిగింది హైదరాబాద్. ప్రస్తుత నివాసం బెంగళూరు.
''సియా హాషియే''ని గల్పికల పుస్తకంగా కాకుండా మంటో ఇతర రచనలు, ఆనాటి విమర్శ వ్యాసాలు, మీ విశ్లేషణ వ్యాసాలను కూడా చేర్చి రూపొందించారు. దాని వెనుక కారణాలేంటి?
1948లో మంటో ''సియా హాషియే''ను ప్రచురించినప్పుడు దానిలో గల్పికలు, ముందుమాట తప్ప మరేవీ లేవు. ఆపైన ఈ పుస్తకం వివిధ భాషల్లోకి అనువాదం అయినప్పుడు, అయితే గల్పికల పుస్తకంగానో, లేదా మరికొన్ని విభజన కథలతో కూడి కథా సంకలనంగానో వచ్చింది. తెలుగులో కూడా ''సియా హాషియే''కి అనువాదాలు వచ్చి ఉన్నాయి. కానీ, నేను గల్పికలు మాత్రమే కాకుండా ఒక అంశంపై వచ్చిన రచనలన్నీ చేర్చి, thematic collection గా తీసుకొచ్చాను. ఈ ఒక్క పుస్తకం ద్వారా తెలుగు పాఠకులకు మూడు వేర్వేరు అంశాలను పరిచయం చేయాలనుకున్నాను..
మంటో 1938 నుంచి 1955లో చనిపోయేవరకూ చూసిన మతవిద్వేషాలు, విభజననాటి మారణకాండలు అతణ్ణి మనిషిగా, పౌరునిగా ఎలా కలవరపరిచాయి? రచయితగా వాటిని రచనల్లోకి ఎలా తీసుకొచ్చాడు?
అశ్లీల/వివాస్పద రచయితని పేరున్న మంటో మతకల్లోలాల గురించి మానవత్వానికి పెద్దపీట వేస్తూ చేసిన రచనల గురించి ఆనాటి సాహిత్యకారులు ఎలా స్పందించారు? అప్పుడెప్పుడో జరిగిపోయిన విభజనపై మంటో రచనల ద్వారా మన ప్రస్తుతాన్ని, పరిస్థితులని అర్థం చేసుకోవచ్చా?
మంటో బతికున్న సమయంలో ''సియా హాషియే'' నిరాదరణకు గురైంది. ఆ తర్వాత ఎప్పటికో వచ్చిన లెస్లీ ఫ్లెమ్మింగ్ లాంటి మంటో స్కాలర్ల అభిప్రాయం: ''విభజన ప్రభావాన్ని పూర్తిగా అనుభవించకముందే రాశాడు కాబట్టి ఈ కథల్లో చతురత, వెటకారం ఉన్నాయి. ఆ తర్వాత రాసిన కథల్లో భాషతో గిమ్మిక్కులు చేయనవసరం లేకుండా ఎన్నో గొప్ప కథలు రాశాడు,'' అన్నదానితోనూ నాకు పేచీలు న్నాయి. చుట్టూ జరుగుతున్న మారణ హౌమాన్ని చూడలేక, చూపుతిప్పుకోలేక పడిన తీవ్రమైన మానసిక సంక్షోభంలో మంటో పెట్టిన గావుకేకలే ఈ గల్పికలు. అవి మన చెవుల్లో గావుకేకలుగానే మిగిలిపోకుండా, వాటి వెనుకున్న మంటో సున్నిత మనసుని, నిశిత దృష్టిని పరిచయం చేయడం తప్పనిసరని నేను అనుకోవడం వల్ల పుస్తకం పరిధి పెరిగింది.
నేటి కాలంలో మతం పేరుతో మరలా విభజన ఏర్పడుతున్న వేళ, దేశ విభజన కాలానికి చెందిన మంటో రచనలు ఈనాటికి వర్తిస్తాయని పుస్తకంలో మీ వాదనని అనిపించింది. ఈ రచనకు ఉన్న అసలైన చారిత్రక ప్రాముఖ్యత ఏమిటి? అంతకు మించిన ప్రాముఖ్యతలు ఏమైనా ఉన్నాయా? ఆయన రచనలను అంత ప్రాముఖ్యంగా తీసుకోవాల్సిన అవసరం ఉందా ఇప్పుడు?
''ఆగస్టు 15, 1947 నాడు దేశవిభజన జరిగిందన్నది అబద్ధం. ఆరోజు దేశవిభజన మొదలైంది, నేటికీ నడుస్తోంది'' అని మరో ప్రముఖ ఉర్దూ రచయిత రాహీ మాసూమ్ రజా అన్నారట. నేటికాలంలో జరుగుతున్నది, ఎప్పటినుంచో జరుగుతూ వస్తోంది. దాని స్వరూపాలు మారుతున్నాయి అంతే!
దేశవిభజన అంశంపై మంటో రాసిన విశ్వప్రసిద్ధ కథలు ''టోబా టేక్ సింగ్'', ''ఠండా ఘోష్త్'' లాంటివి నేనీ పుస్తకంలో చేర్చనే లేదు. ఇందులో ఉన్న ప్రతి మంటో రచనా విభజనను ఒక చారిత్రక ఘటనగా కాకుండా, ఆ ఘటనకు ముందు, ఏన్నో దశాబ్దాలనుంచి జరుగుతున్న ఒక సామాజిక (దుష్)పరిణామంగా చూపెడు తుంది. నేలపై గీసిన సరిహద్దులకన్నా, ''నువ్వు నాకన్నా వేరే. నీ వల్ల నాకు ప్రమాదం'' అని మనసుల్లో పడిన ముద్రలను గుర్తుచేస్తుంది. సామాన్యుల రోజూవారీ జీవితంలో కులం/మతం/లింగం/వగైరాల పేరిట జరిగే ఈ ప్రతినిత్యపు వేర్పాటువాదం వల్లనే, విభజన సమయంలో దేశం అట్టుడికిపోయింది అన్న నిజాన్ని పదేపదే మన ముందుకు తెస్తుంది.
ఈ ప్రతినిత్యపు వేర్పాటు (everydayness of partition) ఈనాటి మన జనజీవితంలో భాగం, అవునా కాదా? కట్టూబొట్టూ, తిండిలాంటి విషయాలు, మంటో రచనల్లో ఉన్నట్టుగా, మనకాలంలో జీవన్మరణ సమస్యలుగా మారుతున్నాయా, లేదా? మంటోని నానామాటలూ అన్నారు, కోర్టులకు ఈడ్చారు, అయినా బతకనిచ్చారు. ప్రస్తుతకాలంలో ఒక రచయిత రాజకీయ పరిణామాల గురించి ఇంత సూటిగా, ఘాటుగా రాస్తే ఆ మనిషి బతికి బట్టగలరా, లేరా?
వీటికి ''అవును'' సమాధానమైతే మంటో రచనలకి నేటికీ ప్రాముఖ్యత ఉన్నట్టు. లేదంటే లేనట్టు. సింపుల్. వీటికి ఎవరికి వారు సమాధానాలు ఇచ్చుకోవాలి, సామూహిక జవాబులు/అభిప్రాయాలు/వాదోపవాదాలు పనికిరావు. ''ప్రాముఖ్యత ఉందనే అనువదించాను. మంటోని చదవండి ప్లీజ్'' అని నేనైతే చెప్పను.
తెలుగులో ఆస్తిత్వవాదాల నేపథ్యంలో మంటోని పాఠకులు ఎలా స్వీకరించవచ్చు?
అస్తిత్వవాదాల నేపథ్య ప్రభావం తెలుగు పాఠకులపై ఎంతుంది, అసలు ఉందా అనేదే నాకు అవగాహన లేదండీ. అందుకని మీ ప్రశ్నకు జవాబు ఇవ్వలేను. ఒక్కటి మాత్రం చెప్పగలను: ఆబాలగోపాలాన్ని రంజింపజేసే రచయిత అయితే మంటో కాడు. మంటోని చదవడం కష్టం. అరాయించుకోవడం ఇంకా కష్టం. తెలుగు పాఠకులు మంటోని ఎలా స్వీకరిస్తారో నాకు తెలీదుగానీ, మరే రచయితా తిప్పలు పెట్టనంతగా మంటో మాత్రం తెలుగు పాఠకులని తిప్పలను పెడతాడు.
మీ అనువాదంలో తెలుగు ఎంత చదివింపజేసేదిగా ఉన్నా, ఉర్దూ ఉనికి కూడా స్పష్టంగా ఉంటుంది. తెలుగుతో పాటు ఉర్దూ పదాలను యథాతథంగా వాడ్డమే కాకుండా, మంటో కథల్లోని వాక్యనిర్మాణాన్ని మూలానికి వీలైనంత దగ్గరగా ఉంచటానికి ప్రయత్నించారని అనువాదుకురాలి మాటలో చెప్పారు. ఎందుకని అలాగా?
కన్నడ నుంచి ఇంగ్లీషులోకి అనువాదం చేసే ప్రొ. వనమాల విశ్వనాథ్ గారు ఈ విషయమై చెప్పిన మాట ఒకటుంది. అనువాదాల్లో అర్థం చేయించే/చేసుకునే బాధ్యత ఎవరిది? రచయితదా? పాఠకునిదా? అన్నదానికి రెండు పద్ధతులున్నాయట. మార్జాల న్యాయం: పిల్లి తన పిల్లల్ని పీక కర్చుకుని తీసుకెళ్ళినట్టు. అంటే, బాధ్యత మొత్తం తల్లిదే. పిల్ల ఏమీ చేయనవసరం లేదు. మర్కట న్యాయం: కోతి తన పిల్లని ఎత్తుకుని తీసుకెళ్ళినట్టు. పడిపోకుండా పట్టుకునే బాధ్యత తల్లిది ఎంతో పిల్లదీ అంతే.
తెలుగు సాహిత్య సర్కిళ్ళల్లో ''అనువాదం అనువాదంగానే లేదండీ! తెలుగులోనే రాశారా అన్నట్టుంది.'' అన్న మాట తరచుగా వినిపిస్తుంటుంది. ఇది మార్జాల న్యాయం. అలా కాకుండా అనువాదకుడు-పాఠకుడు ఇద్దరూ అర్థం చేసుకునే బాధ్యతను పంచుకోవచ్చు, కోతి-దాని పిల్లలాగా. నేనీ పద్ధతి ఎన్నుకోడానికి అనువాదకురాలిగా నాకు తెలుగు పాఠకులపై ఉన్న నమ్మకం. ఎప్పుడూ విననవి, తెలీనివి కొన్ని పదాలు/పదబంధాలు పరభాషలో ఉన్నా, అది పఠనవేగాన్ని తగ్గించినా, కొంత గందరగోళానికి గురిజేసినా ఓపిక పడుతూ అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తారన్న నమ్మకం.
''పాఠకులని ఎందుకు ఇన్ని తిప్పలు పెట్టడం? మీరే చెప్పేయరాదా?'' అంటే చెప్పేయచ్చు. కానీ, అనువాదం చదవడంలో ఉన్న మజా మిగలదు. 'ఖోళీ'ని 'గది'గా లేదా 'బా చిన్న గది'గా అనువదించచ్చు, కానీ బొంబాయి నగరం ఫ్లేవర్ వాటిల్లో రాదు! ఖోళీ అంటే ఏమిటో అప్పటికే తెలిసిన పాఠకులకు, అదో/ఇదో/ఏదో గది కాకుండా మనసులో అచ్చంగా ఖోళీయే మెదులుతుంది. తెలీని పాఠకులకు అదేమిటోనన్న కుతూహలం కలుగుతుంది. మనం ఎవరి ఇంటికైనా వెళ్ళినప్పుడు మనకి కొత్తగా, ఇబ్బందిగా ఉన్నా వాళ్ళ పద్ధతులకు అనుగుణంగా వ్యవహరించడం మర్యాద కదా? పైగా మన తెలుగులో ఒక సొగసు ఉంటుంది, ఒక లయ ఉంటుంది. పరభాషా పదాలు మధ్యలో పడ్డా ఆ సొగసు తగ్గకుండా వాక్యాన్ని నిర్మించగలిగితే చదవడానికి బాగుంటుంది. అలానే కర్త, కర్మ, క్రియలను ఏ క్రమంలోనైనా వాడే వెసులుబాటు మన భాష ఇస్తుంది. (మనకి ఒకే క్రమం అలవాటు అయిపోయినా, వేరేవీ తప్పు కావు, పైగా కొన్నిసార్లు ఆ క్రమంలోనే బాగుంటాయి.) నేనీ వెసులుబాటుని పూర్తిగా వాడుకుని మంటో వాక్య నిర్మాణానికి వీలైనంత దగ్గరగా తెలుగు వాక్యాలనీ ఉంచగలిగాను. అలా చేయడం వల్ల మంటో శైలి తెలుగువాళ్ళకి తెలిసే అవకాశం పెంచచ్చు. పైగా ''సియా హాషియే'' లాంటి గల్పికల్లో పదాలను అతి పొదుపుగా వాడి రాసినవి కాబట్టి, నేనూ అదే దారిలో నడవాల్సి వచ్చింది.
అనువాద రచనలకు కూడా పాఠక వర్గం ఉంటుందా?
తెలుగులో ఉన్న పాఠక వర్గాలేమిటో, అందులో అనువాదాలకు ప్రత్యేకించి పాఠక వర్గం ఉందో లేదో నాకు తెలీదు. అనువాద రచనలకు మాత్రం పాఠకలుంటారు. నేను జర్మనీ, ఇటాలియన్, రష్యన్, జపనీస్, చైనీస్, మెక్సికన్ స్పానిష్ వగైరా భాషల్లో విదేశీ సాహిత్యాన్ని, మన దేశీ సాహిత్యాన్ని చదువుకోగలిగానంటే అవి ఆంగ్లానువాదాల వల్లే. కన్నడ నేర్చుకున్నాక, తమిళ, మలయాళ, కొంకణి భాషల కన్నడ అనువాదాలు చదువుతున్నాను. అనువాదాలు లేకపోతే పాఠకురాలిగా నేను లేను.
మంటో గారి రచనా విధానంలోని ప్రత్యేక లక్షణాలు ఏమిటి?
దీని గురించి చెప్పాలంటే వ్యాసం నిడివైనా ఉండాలి. ఇలా రెండు ముక్కల్లో తేల్చలేం. ఇక్కడ చెప్పగలిగినవి చెప్తాను. మంటో ఉర్దూ భాష చాలా సరళంగా, నిరాడంబరంగా ఉంటుంది, చాలా వరకూ. కఠినమైన పదాలు అవసరం కొద్దీ వాడతాడంతే. కథల్లో అయితే వాక్యం కూడా చాలా సరళంగా ఉంటుంది. కానీ వ్యాసాల్లో (ముఖ్యంగా విపరీతమైన కోపంలో బాధలో రాసినవి) పదాల్లోనూ,వాక్యనిర్మాణాల్లో సంక్షిష్టత వచ్చి కూర్చుంటుంది-అయినా, అంతటి భావావేశంలోనూ గట్టిగా తర్కించ గలడు. అలతి పదాల్లో చాలా లోతులైన భావాలను, సున్నితమైన హాస్యాన్ని, పదునైన వ్యంగ్యాన్ని, బలమైన మెటఫర్లని తీసుకురాగలడు. నాకైతే మంటోని అనువదించడం ఇదే పెద్ద సవాలు: ఆయన పలకించినట్టు నేను కూడా తెలుగులో అలతిపదాలు వాడి అదే ప్రభావాన్ని (impact) పట్టుకురాగలుతున్నానా అనేది.
మంటో రేడియో నాటకాలు, సినిమాలకు కథలు మాటలు రాశాడు. ఆ ప్రభావం కథానిర్వహణలో స్పష్టంగా కనిపిస్తుంది. ఒక కెమరా కన్నునుంచి చూస్తున్నట్టే కథనం సాగుతుంది. మంటో మంటోగా కథలో పాత్ర అయినా కూడా అది ప్రేక్షకపాత్రలా మిగిలుతాడు కానీ, వ్యాఖ్యానాలు/ఉపన్యాసాలు చేయడు. ఉర్దూ సాహిత్యంలో కథ (short story) అనే ప్రక్రియ అప్పుడప్పుడే మొదలవుతున్న దశలో రాసిన రచయితని గుర్తుతెచ్చుకుంటే ఈ లక్షణాలన్నీ మరీ అబ్బురపరుస్తాయి.
ఇంకోటి మంటో తన వచనంలో భావోద్వేగాల రక్తస్రావం చేయించగలడు His text bleeds చాలా చిన్న టెక్నిక్స్‌తో. ఉదా: హతక్, సడక్ కె కినారె లాంటి కథలు, లేదా ''సియా హాషియే''లో ఉన్న జేబ్-ఎ-కఫన్ వ్యాసం. వ్యక్తిగా ఎంత నిజాయితీ ఉంటే, రచయితగా వ్యక్తీకరణపై ఎంత పట్టుంటే ఇంతిలా, ఒక ఏకధారలా రాయగలడో అనేది నా ఊహకు అందని విషయం. మంటోకి తన పాత్రలపైనే కాదు, తనమీద కూడా అంతే సహానుభూతి (సానుభూతి కాదు) ఉందని నాకనిపిస్తుంది. లేకపోతే, ప్రపంచం మొత్తం ఎదురునిలిచినా, తనకోసం తను అంతలా నిలబడి ఉండగలిగేవాడు కాదు. అది అతని రచనల్లో స్పష్టంగా కనిపించింది నాకైతే.
మామూలుగా ఎన్నుకున్న రచయితల ప్రముఖ రచనలను అనువదిస్తుంటారు కదా! కానీ మీరెందుకని మంటోని తెలుగులోకి సమగ్రంగా తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు?
మంటో విరివిగా, ఎక్కువగా రాసిన రచయితల్లో (prolific writers) ఒకడు. కథలే ఒక 600 రాశాడని అంచనా! అతని రచనలన్నీ పూర్తిగా తీసుకురావడం (మరో వృత్తిలో ఉన్న) నాబోటివారికైతే అసాధ్యం. నాకు అందుబాటులోకి వచ్చిన అన్ని మంటో రచనలే కాకుండా మంటో, విభజన, అభ్యుదయవాదం లాంటి అంశాలపై వచ్చిన పుస్తకాలు, అకడమిక్ పేపర్లు చదువుతూ వచ్చాను, గత పదేళ్ళుగా. నేను చదివినవాటిని ఏర్చి కూర్చి కనీసం వేయి పేజీల మంటో రచనలైనా తెలుగువారికి అందించాలన్నది నా ప్రయత్నం. ఆ ప్రాజెక్టులో ''సియా హాషియే'' తొలి పుస్తకం.
మంటోని సమగ్రంగా తీసుకొచ్చే అవకాశం నాకెటూ లేదు కాబట్టి, నేను నా పరిధిని ఇలా నిర్ణయించుకున్నాను: అ) మంటోకి ఉన్న పేరు/లేబుల్స్‌కు లోబడకుండా, ప్రముఖం/అప్రముఖం అని కాకుండా ఆయనని రచయితగా, మనిషిగా పట్టితెచ్చిచ్చే రచనలు (కథలని మాత్రమే కాదు, అన్ని రకాల రచనలు) ఏర్చికూర్చి చేయాలి.
- కేవలం అనువాదాలతో ఆపకుండా ఆయననాటి సామాజిక/రాజకీయ/సాహిత్య పరిస్థితులను తెలుగువారికి పరిచయం చేయాలి.
- ''మంటో ఇప్పటికీ అవసరం'' అన్న మాటతో వదిలేయకుండా ఎందుకు అవసరమో పాఠకులే నిర్ణయించుకోగలిగేలా పుస్తకాలని రూపొందించాలి. (అందుకే సియా హాషియే గల్పికలు/కథల పుస్తకంగా రాలేదు)
- ఇంగ్లీషు/ఉర్దూ రానవసరం లేకుండా తెలుగు విద్యార్థులకి,సాహిత్యాన్ని అధ్యయనం చేసేవాళ్ళకి, నాటకకర్తలకు మంటోపై నేను చేస్తున్న పని అక్కరకు వచ్చే విధంగా ఉండాలి.
ఇవే కాకుండా, మంటోపై ప్రస్తుతం (ముఖ్యంగా ఇంగ్లీషులో) ఆసక్తికరమైన చర్చలు నడుస్తున్నాయి. 110 సం. తర్వాత, మంటో ఆడవాళ్ళని అభ్యంతరకరంగా చిత్రీకరించాడని, మతవిద్వేషాలకు ప్రాముఖ్యతనిచ్చినవాడు కులవివిక్షను పూర్తిగా విస్మరించాడని విమర్శలు వినిపిస్తున్నాయి. (మంటోని ఆకాశానికి ఎత్తేయడం కాకుండా ఈ కోణాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం నా ఉద్దేశ్యంలో!)
కళాకారులకు/సృజనాత్మక పనిజేసేవారిపై మంటో రచనలు బలమైన ప్రభావాన్ని చూపించగలవు. అతని రచనల ఆధారంగా నాటకాలు, సినిమాలు, నృత్యరూపకాలుబొమ్మల పుస్తకాలు విరివిగా వస్తున్నాయి. ఇవ్వన్నీ కూడా తెలుగువారికి పరిచయం చేయాలి. ఇలాంటవన్నీ పుస్తకాలుగా తీసుకురాలేం. అందుకని mantointelugu అనే డిజిటల్ ప్రాజెక్ట్ ద్వారా అందించాలనే ప్రయత్నం చేస్తున్నాను. అలానే మంటోని ప్రింట్ పుస్తకాలకే పరిమితం చేయకుండా, వివిధ మాధ్యమాల్లో తీసుకురావాలని ప్రయత్నం. నేను చేసిన పాతిక కథలు స్టోరీటెల్ (storytel) పై ఈ ఏడాదిలోపు ఆడియో పుస్తకాలుగా వెలువడ బోతున్నాయి.
తెలుగులో పుస్తకాలు అమ్ముడు పోవడంలేదనే గగ్గోలు వినిపిస్తున్న రోజుల్లో మీరు ఎలమి ప్రచురణలని ప్రారంభించాలను కోవడం, ఇది చదువుకున్న మూరు?ల చర్యలాగా లేదా?
నాకు సాహిత్యమంటే ఎంత ఇష్టమో, ఆటలన్నా (ఆడింది లేదు చూడ్డం మాత్రమే) అంతకన్నా ఇష్టం. 80,90 దశకాల్లో అంతర్జాతీయ ఆటపోటీల్లో (క్రికెట్ కాకుండా) భారత ఆటగాళ్ళు మొదటి మూడు రౌండ్లలోనే ఓడిపోయి ఇంటిదారిన పట్టేవారు. అలాంటి నేపథ్యంలో గట్టి పోటీ ఉండే ఆల్ ఇంగ్లండ్ బాడ్మింటన్ ఛాంపియన్ షిప్ గెలవడమే కాక, రిటైర్ అయ్యాక హైదరాబాదులో అకాడమీ మొదలెట్టడానికి ఇల్లు తాకట్టుపెట్టినప్పుడు గోపిచంద్ గారిని కూడా ''మీకు పిచ్చా?'' అన్నట్టే చూశారని చదివాను పత్రికల్లో. ఇవ్వాళ భారత్?కు ఒలంపిక్ స్థాయిలో పతకాలు వస్తుంటే, ఆయనది చాలా కీలకమైన పాత్రని అంటున్నారు. మాది మూర్ఖత్వమో, సాహసమో ఒక ఐదారేండ్లల్లో తేలిపోతుంది.
అనుకూలతను, అవకాశాలను బట్టి చేసేది వ్యాపారం. ఎలమిలో కూడా పెట్టుబడులు, లాభనష్టాలు ఉంటాయి కానీ, ఇది వ్యాపారం మాత్రమే కాదు. ''తెలుగు రచయితకు తన మేధోశ్రమకు తగిన పారితోషకం ఇస్తూ, తెలుగు పాఠకులకు సరసమైన ధరల్లో నాణ్యతగల పుస్తకాలను వారికి చేర్చగలమా?'' అన్న ప్రశ్నకు జవాబు వెతుక్కునే ప్రయత్నం. ఈ ప్రయత్నంలో మేము గెలిస్తే హీరోలం, ఓడితే జీరోలం. మాకవి ముఖ్యం కాదు. ఆటను ఆడ్డం, రూల్స్ ప్రకారం ఆడ్డం, మధ్యలో విడిచిపెట్టకుండా ఆడ్డం మాకు ముఖ్యం. మా ఓటమి మా తర్వాతివారి విజయాలకు పునాదులుగా మారితే అంతకన్నానా?
ఎలమికి ఉన్న దృష్టి, దాని లక్ష్యాలు ఏమిటి?
తెలుగులో రాసేవాళ్ళు, చదివేవాళ్ళు తక్కువైపోతున్నారన్న ఒక అభిప్రాయం ఉంది. ఎలమి మాత్రం తెలుగులో రాసేవాళ్ళు, చదివేవాళ్ళు పుష్కలంగా ఉన్నారన్న నమ్మకంతో మొదలెట్టిన ప్రయత్నం. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోని అక్షరాస్యులని తీసుకున్నా, అందులో కేవలం 0.1శాతం మందికి తెలుగు పుస్తకాలపట్ల ఆసక్తి ఉన్నా మనం ఇరవైవేల కాపీలు అమ్మగలగాలి. కానీ వేయి కాపీల అమ్మకం కూడా గగనమైపోతోంది. ఈ సమస్యను ఎలా అధిగమించాలన్నది ప్రధాన లక్ష్యం. లిటరరీ, నాన్-లిటరరీ అన్న కేటగిరీలలో చిక్కుకోకుండా, కొత్త వ్యక్తీకరణలకు, కొత్త అంశాలకు చోటు కలిపిస్తూ తెలుగులో పుస్తకాలు తీసుకురావాలన్నది మరోటి.
- గూండ్ల వెంకట నారాయణ