Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యుగాలుగా నువ్వు నడసివచ్చిన దారుల్లో నాలుగు నిప్పుకణికల్ని నాటాల్సింది
అలిసి ఆగిన పాదాలకు నీ పోరాటసెగతగిలి కొత్త ఉత్సాహమొచ్చేది
కారిన కన్నీటిని చెట్ల మొదళ్లలో ఒంపాల్సింది
మేఘాలదాకా ఎగబాకి మా దేహాలపై ధైర్యపు వర్షాన్ని కురిపించేవి
చచ్చిన తమ్ముళ్ల పుఱ్ఱెల్ని నాలుగురోడ్ల కూడలిలో నిలబెట్టాల్సింది
దారితప్పిన మా తరానికి ఉద్యమదారిని చూపేవి
రాలిన చెమటచుక్కలతో ఊరి మధ్యలో మంటపెట్టాల్సింది
స్వార్ధంతో పిడసకట్టిన జాతి దహనమయ్యి కొత్త జాతి పుట్టేది
చిమ్మిన రక్తాన్ని తోవకు తోరణాల్లా కట్టాల్సింది
ఆశయజెండాల్ని గుండెలపై మోసే భాగ్యం మాకు కలిగేది
విరిగిపడ్డ దేహాన్ని చుక్కని చేసి ఆకాశానికి అతికించాల్సింది
తలెత్తి చూసినప్పుడు మా మోముల్లో గర్వం అరుణతారై మెరిసేది
- గౌతమ్ లింగా, దక్షిణాఫ్రికా