Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రంగు రిబ్బన్లు కట్టుకొని
బడికి మేం పోతుంటే
సింగిడిని దించిన రంగవల్లులంటూ
ప్రేమ దీవేనార్తినిచ్చేటోళ్లు !!
అవ్వయ్యల గల్లా పెట్టెలో
రెండు పైసలు చేర్చేందుకు
పంట శేన్లను ముద్దాడితే
పత్తి పువ్వుల్లెక్క సక్కగున్నరనెటోళ్లు !!
బీరకాయ ఆనక్కాయ పాదులను
చిట్టి చేతులతో తీస్తుంటే
ఏం ఇగురం గల్లోళ్ళు అబ్బ
పందిరిపై పారే తీగలనెటోళ్లు !!
మా స్నేహం మడుగులోని
కమలం పువ్వు స్వచ్ఛతంతా
లేత చింతచిగురు పులుపంతా
శినిగిన కమ్మనతుకుబెట్టే తుమ్మబంకంత !!
మా ఇద్దరివి మట్టికోటలే అయినా
కావల్సినంత ప్రేమ చమురుంది
అది దూగుట్ల స్నేహపు దీపాన్ని
నిరంతరం వెలిగిస్తూనే ఉండేది !!
బుగ్గమీద సిగ్గులొలికే ఈడు వచ్చింది
ఈడైనా వానితో లగ్గం కుదిరింది
ఇంకో కడపకు పసుపు పెట్టనికి పోతుంటే
మా అయ్యవ్వ లెక్కనే మీద పడి సాగనంపింది
దూరంగా వున్నా మాటలతో
మనసునలికింది!!
తన మాటల్లో బాధను గుర్తించలేదనుకుంది
ఏమైందని అడిగేలోపే కాటికి చేరింది
కట్టుకున్నోని కర్కశత్వానికి
అత్తమామల మాటల ఫిరంగులకు
తనువు ఛిద్రమైంది
నేడు నా రచనకు అక్షరంగా కదులుతూ
కన్నీరుపెట్టిస్తోంది
ఆ జ్ఞాపకాలన్ని కళ్ళలో
రైలుగా పరుగుపెడుతుంటే
నా మనసేమో రైలు పట్టాల్లా
నలిగిపోతోంది,
చిత్తడై నీ స్నేహం కావాలని
రోధిస్తోంది !!
- మహేష్ వేల్పుల, 9951879504