Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అప్పటి దాకా అమ్మ పెట్టిన గోరుముద్దలు తిని వాలిపోతాను
నిద్రను మోసే మంచం మీదకి.
పిలుస్తాను 'అవా! ఓ కథ చెప్పూ'
పని వల్ల
పొద్దున్నుంచి ఉపవాసముండాల్సొచ్చిన అమ్మ, గాజుల
సవ్వడి వినబడకుండా నీరసంగా
వచ్చి నా పక్కన కూర్చుంటుంది
ఎవరూ చెప్పకుండానే
నా తలని తన ఒళ్ళోకి లాక్కుంటుంది
తల నిమిరి బుగ్గపై ఒక ముద్దు పెడుతుంది.
''పేరు మర్చిపోయిన ఒక ఈగ కథనీ,
ఒకటి రెండు వెంట్రుకలు ఉన్న
ఇద్దరు రాణుల కథలని'' చెబుతుంది.
ఆమె కళ్ళలోకి చూస్తూ
''ఇవేనా ఎప్పుడూ? కొత్త కథేమైనా చెప్పూ' అంటాను.
ఒక నవ్వు నవ్వి
మురిసి
'సరే విను' అని జోకొడుతూ
తన చీర కొంగు నాపై విసురుతూ
ఓ కొత్త కథ మొదలెడుతుంది.
ఉంది
నా ఎడం భుజంపై రూపాయి బిళ్ళ ఆకారంలో,
బలంగా తయారు కాని
మెత్తని చర్మం
ఎవరో కాల్చితే కమిలినట్టు
అచ్చం చంద్రుడికుండే గుర్తులతో.
వేళ్ళతో దాన్ని వొత్తుతూ నిమురుతూ
కిటికీలోంచి
చిమ్మచీకటి మధ్య కనబడే చందమామని
చూపుడు వేలితో చూపిస్తూ
''ఇదిగో ఈ రూపాయి బిళ్ళంత
మచ్చుంది చూశావూ! అది నీకు పుట్టుకతోనే వచ్చింది.
అదేంటో తెలుసా నీకు!
అదిగదిగో! అక్కడా ఆకాశంలో
కనబడుతోంది చూడు! చందమామ.
దాని తాలూకా గుర్తు ఇది. అంటే నువ్వు
చంద్రుడి స్నేహితుడివనమాట
నిన్ను రోజూ చూసి పోవడానికి, నీతో
దాగుడుమూతలు ఆడుకోవడానికి
ఆకాశంలో రాత్రులు ప్రత్యక్షమౌతున్నాడు అతను.
నీలాగే పగలు బడికెళతాడు.
అందుకే వస్తాడు చీకటి వేళల్లో
నువ్వు ఎటు వెళ్ళినా నీ వెనుకే వస్తుంటాడు
నీ దిక్కే చూస్తుంటాడు
నీకుంకో విషయం చెప్పనా!
నువ్వు ఈ గుర్తుని పట్టుకుని
చందమామని తలుచుకుని
ఏది కోరుకుంటే అది మాకిచ్చి నీకిమ్మంటాడు.
ఇప్పుడు అల్లరెక్కువ చేస్తూ
ఎందుకో మరి
అతణ్ణి ఏడిపించావంట.
నీతో పచ్చేలి అని నీతో ఎప్పుడూ మాట్లాడనని
ఏడుస్తున్నాడు.
ఆ కన్నీళ్ళే వెన్నెలలా రాలుతున్నాయి
అసలే నువ్వు చచ్చే అల్లరోడివి
నువ్వు అల్లరి మానేస్తే
తెస్తాడంట నీకు బోలెడు బొమ్మలు.
చందమామకి బొటనవేలు చూపించి
పిలువు వస్తాడు' అని కథనిక్కడ ఆపుతుంది.
నేను కథలోని చందమామని
నా పక్కన ఊహించుకుని రూపాయి
బిళ్ళంత మచ్చను నిమురుకుంటూ
కిటికీ ఆవల చూస్తాను
చీకటిపై పల్చటి వెన్నెల
మిణుకు మిణుకు మంటూ కిటికీలో పట్టినన్ని తారలు.
సన్నగా వినబడే పక్షుల పాట.
ఇటు తిరిగితే,
నిద్రాణమౌబోతున్న పసిపాపలా అమ్మ ముఖం.
- లిఖిత్ కుమార్ గోదా