Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అప్పుడే
ఇంత పెద్దగైయ్యిందా అని అనిపిస్తుంటది
తొలిసారె పోసుకొని
దర్వాజకు నూనె రాసి, బొట్లు పెడుతున్న చెల్లెల్ని చూస్తే
'అయిదు అయిదు ఖర్జూరపండ్ల'
ఈ మంగళారతి పాట
చెల్లెలు ఎప్పుడు నేర్చుకుందో
నాకు తెల్వనే తెల్వదు
తొలి సారె అంటే మాటలా
అత్తకొయ్యాలి, ఆడబిడ్డకొయ్యలి
తల్లి నల్గురికి బట్టలు పెట్టాలి -అని
ఒక్క అక్షరం ముక్క కూడా చదువని అమ్మలు
ఒడిబియ్యమప్పుడు
ఎన్నెన్నో సదువులు సదువుతరు
నిజం మాట్లాడుకుంటే
ఉన్నోడు ఎన్నైనా పెడుతాడు కాని
లేనోడి పనే
కుడితిల పడ్డ ఎలుక తీరు
ఎన్ని పండుగలు వస్తలేవు
ఎన్నో పండుగలు పోతలేవు
ఆడబిడ్డకు పెడుతనే పోతావా అని
పసుపుబియ్యం కలిపిన చేతులు మాట్లాడుకుంటాయి
ఏ ఆడబిడ్డకైనా
తల్లిగారింటి మీద అధికారముందని
గుర్తుచేసేది ఒడి బియ్యమే
వేలకు వేలు ఇస్తేనే
బియ్యం పోసుకున్నట్టు కాదు.
ఏ ఆడబిడ్డైనా ఏం కోరుకుంటది ?
అయిదు కుడకలు, అయిదు పోకల నడుమ
అమ్మగారింటి ప్రేమలు
అయిదు దోసిళ్ళు, అయిదు పిడికిళ్ళ బియ్యంతో పాటు
అన్నదమ్ముల దీవెనలు
ఒడిబియ్యం వొండుకొని
నలుగురిని పిల్చుకొని పెట్టుకుంటున్నప్పుడు
అక్కల ముఖంలోని వెలుగు
ఏ సూర్యకాంతితో పోల్చనూ?
ఆస్తి కాడ కొట్లాడని
అన్నం కాడ కొట్లాడని అక్కలంతా
అయిదేండ్ల కొక్కసారి కొట్లాడేది
బియ్యం పడిపోతవనే
ఏ గుట్టకు పట్టిస్తే
ఆ గుట్టకు పోయే ఆడబిడ్డ
నోరు తెరిచి అడిగేది
ఒక్క ఒడిబియ్యాన్నే కదా!
- తగుళ్ళ గోపాల్,
9505056316