Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'పర్సనాలిటీ డెవలప్మెంట్' అన్నది తరచూ వాడే పదమే. కానీ దీని అర్థం కొందరికే తెలుసు. కొంతమంది ఉద్యోగాలు సంపాదించటం కోసం పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ కోర్సులు చేయాలని కోరుకుంటారు. నిజానికి పర్సనాలిటీ డెవలప్మెంట్కి అసలు అర్థం తెలుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికీ ఉంది.
వ్యక్తిత్వ వికాసం గురించి చదవటం, వినటం చాలానే చేస్తూ ఉంటాం. కానీ దాన్ని పెంపొందించుకొనే ప్రయత్నం చాలా తక్కువ మంది చేస్తారు. పర్సనాలిటీ డెవలప్మెంట్పై వ్యాసాలు ఏవైనా చదివినప్పుడు 'అవును.. ఇలా చేస్తే మనకు చాలా మంచి జరుగుతుంది కదా! ఇంకేం రేపట్నుంచి ఈ పనిలో ఉంటాను' అని అనుకుంటాం. కానీ నిజానికి మనం చేసేది అది కాదు.
మొదటి తప్పు ఏమిటంటే రేపట్నుంచి చేద్దామనుకోవటం. నిద్ర లేవగానే ఆ రోజు మామూలుగా చేయాల్సిన పనుల గురించి ఆలోచిస్తామే కానీ నిన్న చదివినది గుర్తుకుండదు. మళ్లీ వారం పది రోజులకు గుర్తుకొస్తుంది. అప్పుడు కూడా ఇలానే జరుగుతుంది. ఈ వారం పది రోజుల్లో గుర్తుకు వచ్చినా వాయిదా వేస్తాం. ఇలా చేయడం వల్ల మన మీద మనకు నమ్మకం తగ్గిపోతుంది. మరోసారి ఈ నమ్మకాన్ని వెనక్కు తెచ్చుకోవటం చాలా కష్టం, ఈలోగా చాలా సమయం, అవకాశాలనూ కోల్పోతాం. అనుకున్నది సాధించాలి.. హాయిగా బతకాలి అన్న జీవిత కాలం చూస్తూ చూస్తూ చేజారి పోతుంది. అందుకే.. ఇంత వరకూ పోగొట్టుకున్నది చాలు. ఇకనైనా చిన్న చిన్న గెలుపుల్లోని ఆనందాలను రుచి చూడటానికి నడుం బిగిద్దాం. ఇవే సుఖమైన జీవితానికి పునాదులు.
- ఈ రోజు చేయాల్సిన ప్రతి పనినీ ఒక చీటీలో రాసుకోవాలి. ఒక్కదాన్ని కూడా వదలకుండా చేసేయాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ వాయిదా వేయొద్దు. ఏ ఒక్కటి కూడా. అలాంటివి ఏవైనా ఉంటే మీ చీటీలో రాయకండి. పట్టుదల ఉంటే ఈ పరిస్థితి రాదు.
- కలలు కనాలి, కలల పట్టీని తయారు చేసుకోవాలి. దీన్ని తయారు చేసే సమయంలో హద్దులను గురించి ఆలోచించొద్దు. డబ్బూ సమయం మనకు కావాల్సినంత ఉన్నాయనుకోవాలి. ఒక్కో కలని ఎలా నిజం చేసుకోవాలన్న ప్రక్రియను నిర్ణయించుకోవాలి. ఆ కలల్ని, వాటికి పట్టే సమయాన్నిబట్టి వర్గీకరించుకోవాలి. ఈ కలల్ని సాధించటానికి నమ్మకాన్ని కోల్పోవద్దు. చిన్న చిన్న కలల్ని నిజం చేసుకొంటూ వస్తే ఈ నమ్మకం దాంతటదే వస్తుంది. ఈ ప్రక్రియను ఎప్పుడూ ఆపకండి. దీన్ని పాటించటానికి డబ్బు, వయసు ఆటంకాలు ఏ మాత్రమూ కావు.
- ఏదైనా పని పూర్తి చేయాలంటే వాయిదా వేయకుండా తొలి అడుగు గమ్యం వైపు వేస్తే చాలు. సగం దూరం చేరినట్టే. గమ్యం చేరేస్తానన్న నమ్మకం వస్తుంది, . చివరకు చేరుతాం కూడా.
(జాలరి సౌజన్యంతో)