Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విజయం పొందిన వారిని చూసి జేజేలు పలికితే సరిపోదు. వారి బాటలో నడవాలి. ఆ దారిలో ఒక్కో అడుగూ ఒక పాఠం లాంటిది. ఒక్కో మలుపూ ఒక్కో సూత్రం. వేర్వేరు రంగాల్లో, వేర్వేరు ఉద్యోగాల్లో, స్థితిగతుల్లో ఉన్న యువతీయువకులందరూ ఈ విజేతల నుంచి నేర్చుకోవాల్సింది ఒక్కటే. అది.. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలనే తపన. ప్రేరణ, పట్టుదల, సకారాత్మక ఆలోచన విధానం, వైఫల్యాలకు నిరాశపడకపోవడం, కొంచెం సాధించగానే సంతృప్తి పడక పోవడం... ఇలా ఎన్నో చక్కని లక్షణాలు విజేతల వెనుక చోదక శక్తిగా ఉంటాయి. వీటిలో అన్ని, లేదా కొన్ని కొందరిలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. వారిని ముందుకు నడుపుతాయి. మనం గమనించాల్సింది ఆ లక్షణాలనే.
- సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయమనుకుంటే పొరపాటు. ఉన్నదాంతో సమాధానపడిపోతే కాలం గడిచిపోతుంది. పైకి లోపమేదీ ఉండకపోవచ్చు. కానీ విజయంలోని మజా దూరమవుతుంది. ఎవరైనా ఉత్తమ స్థితికేసి దృష్టి సారిస్తేనే అద్భుత ఫలితాలు అందుకుంటారు.
- వాహనం నడవాలంటే ఇంధనం కావాలి. మనిషి ఎదగాలంటే ప్రేరణ కావాలి. విజయ పథంవైపు నడిపించే లక్షణాల్లో ఉత్తమమైన ఆశయం కూడా ఒకటి. అదే చోదక శక్తిగా మారి మార్గాన్ని నిర్దేశిస్తుంది. దాన్ని మనసులో ముద్రించుకున్నవారు మాత్రమే విజయాల దిశగా అడుగులు వేస్తారు.
- అనుకున్న పనిని పూర్తి చేసే వరకూ నిద్రపోని మనస్తత్వం విజేతల సొంతం. దీని కోసం ఇష్టాలను వదులుకుంటారు. కష్టాలకు ఎదురెళ్తారు. ఇందులో పేదా గొప్ప తారతమ్యాలుండవు. స్థాయి, హోదాలు కానరావు. ఐఏఎస్ కూతురుకైనా, వాచ్మన్ కొడుకుకైనా అందరిదీ ఒకే పంథా ఉంటుంది.
- జీవితంలో ఎదగాలనుకునే వారికి ఒక లక్ష్యం చాలదు. ఒక దాని తర్వాత మరో లక్ష్యం పెట్టుకుంటూ ముందుకు సాగుతారు. అదే వారికి విజయ సోపానమై ఉన్నత స్థితికి చేరుస్తుంది.
- సమాజంలో పరస్పర సహకారం లేనిదే ఏదీ సాధ్యం కాదు. ఇది గ్రహించిన వారు ఇతరుల నుంచి సూచనలు అందుకుంటూ తమని తాము తీర్చిదిద్దుకుంటారు. ఇతరుల నుంచి ప్రోత్సాహం పొందాలంటే వారిలోని గొప్పదనాన్ని గ్రహించాలి. మనసు తలుపులు తెరిస్తే నలుదిశలా సహకారమే.
- ఉన్నత స్థానంలో నిలిచినవాళ్లను చూసి ఆశ్చర్యపోవడం సామాన్యుల వంతు. ఆ స్ఫూర్తిని పుణికి పుచ్చుకొని వారి సరసన చేరడం విజేతల లక్షణం. ఆ స్ఫూర్తే సంకల్పంగా మారుతుంది.
- మొదట ఏం సాధించాలనుకుంటున్నామో నిర్ణయించుకోవాలి. తర్వాత దానికి అనుగుణంగా ప్రణాళిక వేసుకోవాలి. లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాక అనుక్షణం దాన్ని గుర్తు తెచ్చుకోవాలి. ప్రణాళికను అమల్లో పెట్టాలి.
- మనసు విభిన్న ఆలోచనల పుట్ట. ప్రతికూల ఆలోచనలను అది ఎప్పుడూ ముందుకు తెస్తుంటుంది. వాటిని దూరం చేసుకుంటేనే విజయం. పల్లెటూరి వాడిననో, ఇంగ్లిషు రాదనో, కష్టపడినా ఫలితం ఉండదనో లాంటి ఆలోచనలకు లొంగకూడదు.