Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆవేశమనేది అగ్ని లాంటింది. ఇది ఆవేశపడే వారినే కాదు ఒక్కొక్కసారి తోటివారిని కూడా దహించి వేస్తోంది. వేగంగా మారుతున్న ఈనాటి సామాజిక పరిస్థితులలో ప్రతి రోజు ఈ ఆవేశాలకు చాలా మంది ఆవేశానికి గురవుతున్నారు. అనేక కుటుంబాలు, యువకులు, విద్యార్థులు, వ్యాపార వ్యవహారాలలో వున్నవారు ఒకరేమిటి అన్ని రంగాలలో వారిని ఈ భావోద్రేకాలు ఆవరించి దాని ఫలితంగా అసహనాలు పెరుగుతూ అవే ఆవేశాలకు ఆజ్యంగా మారి అనేకానేక జీవితాలు నేల కూ లుస్తున్నాయి.
ఆవేశమనేది ప్రమాదకారిగా మన జీవితానికి ప్రతిబంధకంగా ఉంటుందో తెలిసి కూడా నియంత్రణ అనేది ఒక్కొక్కసారి మన చేయిజారి పోవటం విచారకరం. ఈ ఆవేశమనేది సామాజిక,సాంఘిక , ఆర్థిక మానసిక అంశాల ప్రభావంతో మానవ జీవితాలపై ప్రఘాఢమైన ప్రభావాలు చూపటంతో పాటు, ఈ ఆవేశమనేది అదుపు చేసుకోలేని స్థాయిలో ఎదిగి తమతో పాటు కొన్ని సందర్భాలలో ఇతర జీవితాలను సైతం భారీ మూల్యాలు చెల్లించుకునే పరిస్థితులను ఉత్పన్నం చేస్తోంది.
ఈనాటి ఈ సామాజిక వాతావరణంలో సహజంగా ఎదురయ్యే చిన్న చిన్న అపజయాలను సైతం తట్టుకోలేని విధంగా మానసిక స్థితులు ఉద్రిక్తలు చెందుతున్నాయి. అనవసర పోటీతత్వాలు, తృప్తి లేని జీవితాలకు అలవాటు పడుతూ ఏ చిన్న అవాంతరమైనా తట్టుకోలేని సున్నితత్వాన్ని మానవ మనస్సులు మార్పులు చెందుతున్నాయి.ఈనాటి ఈ ఆవేశ పరిస్థితులకు కారణాలుగా భావోద్రేకాలు సంబంధించిన, నైతిక విలువలకు సంబంధించిన అవగాహన పాఠశాల స్థాయిల నుండే విద్యార్థులలో లేకపోవటం బాధాకరం.
తానూ జీవితంలో పొందవలసినవి పొందలేనేమోననే, తానూ ఎదగవలసిన స్థాయికి ఎదగలేనేమోననే, తనకు దక్కనివి తన అని అనుకునే వారికి దక్కుతాయేమోననే అసూయా భావనలు, ఈర్ష్యా ద్వేషాలుగా అంతర్లీనంగా రూపాంతరం చెంది ఆవేశ రూపంలో మనిషి పై కరాళ న త్యం చేస్తున్నాయి! విలువైన జీవితంలోని ఆటుపోట్లను అర్ధం చేసుకుంటూ జీవితాన్ని సమర్ధవంతంగా, ధైర్యంగా కొనసాగించాలి కానీ పనికిరాని ఆవేశంతో జీవితాన్ని నాశనం చేసుకోవటం తెలివి తక్కువ పనే. చిన్న విషయాలకే భావోద్రేకాలకు లోనై ఇతరుల పట్ల క్రూరంగా ప్రవర్తించే వాళ్ళ జీవితాలు కేవలం వారితోనే ముగిసిపోదు కన్న వాళ్ళు, కట్టుకున్న వాళ్ళు కూడా సభ్య సమాజంలో దోషులుగా నిలబడవలసి వస్తుందనేది వాస్తవం. సామాజిక పరిస్థితులు, నివసించే ప్రదేశాలకు అనుగుణం గా మన స్థాయికి తగ్గ విచక్షణ తో ప్రవరించటమనేది ఎల్లప్పుడూ శ్రేయస్కరం మనేది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయం.
ఆవేశంతో తీసుకునే ఏ నిర్ణయమైనా అనర్ధాలకు దారి తీస్తుంది! పరీక్షల్లో అనుకున్న రాంక్ రాలేదు, అనుకున్న ఉద్యోగపు ఇంటర్వ్యూలో ఎన్నిక కాలేదు, చేస్తున్న వ్యాపారం లాభసాటిగా లేదు, ఉద్యోగంలో అనుకున్న స్థాయిల్లో ప్రమోషన్స్ రావటం లేదు, ఆటల్లో నా కంటే ముందుగా ఎపుడూ నా ప్రత్యర్ధే ఉంటాడు, నా పిల్లల కంటే ఎదురింటి పిల్లలే బాగా చదువుతారు, నాతొ చదివినవారు నా కంటే వున్నత స్థానాల్లో వున్నారు, నేనింకా స్కూటర్ దశలోనే వున్నా కానీ నా జూనియర్ కారు లెవెల్ కు ఎదిగాడు ఇలా ఒకటి కాదు మానవ జీవితంలో అసహనానికి గురిచేసి మనలో ఆవేశ తత్వాలను పెంచటానికి కొన్ని వేల కారణాలుండవచ్చు.అధిక భాగం వీటిలో మనం చేయగలిగినవే మరి దానికి మనపై మన పరిశీలన, సహనం,సాధనా ఉన్నాయా ఆలోచించండి!
అమరనాథ్ జగర్లపూడి, కౌన్సెలింగ్ సైకాలజిస్ట్,
9849545257