Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆవేశంతో తీసుకునే ఏ నిర్ణయమైనా అనర్ధాలకు దారి తీస్తుంది! పరీక్షల్లో అనుకున్న రాంక్ రాలేదు, అనుకున్న ఉద్యోగపు ఇంటర్వ్యూలో ఎంపిక కాలేదు, ఉద్యోగంలో అనుకున్న స్థాయిల్లో ప్రమోషన్స్ రావటం లేదు, ఇలా ఒకటి కాదు మానవ జీవితంలో అసహనానికి గురిచేసి మనలో ఆవేశ తత్వాలను పెంచటానికి కొన్ని వేల కారణాలుండవచ్చు.అధిక భాగం వీటిలో మనం చేయగలిగినవే మరి దానికి మనపై మన పరిశీలన, సహనం,సాధనా ఉన్నాయా ఆలోచించండి!
ఆవేశ నియంత్రణ ఇలా !
మాటకు మాట ఎప్పటికీ సరైన సమాధానం కాదు. ఎదైనా ఒక విషయం విన్నప్పుడు మన విచక్షణ భావోద్రేకాలకు దారి తీయని విధంగా ఉండాలి!
ఎదైనా సంఘటన పట్ల మనం స్పందించే తీరులో మన చర్య ఇతరులలో అవగాహన పెంచే విధంగా ఉండాలి తప్ప ఆవేశం అహింసలకు దగ్గరగా ఉండకూడదు.
ఆవేశానికి గురయ్యే ప్రతి సందర్భంలో మన భావోద్రేకాలను మౌనంగా నియంత్రించుకోవడం చాలా శ్రేయస్కరం!
భావావేశాన్ని అదుపు చేసే సందర్భంలో మన ఆలోచలనలను వేరే వైపు దారి మళ్ళించుకొనే అవకాశాలను పరిశీలించాలి.
ఆవేశాలకు గురయ్యే ప్రతి సందర్భంలో జరగబోయే పరిణామాలలో మన గురించి మన కుటుంబ సభ్యుల గురించి ఒక్కసారి ఆలోచించటం చాలా అవసరం.
ఆవేశంలో జరిగే ఏ అనర్ధాలలోనైనా సమాజంలో మనం తలవంచు కొనే, ఎదుర్కొన బోయే నగుబాటును బలంగా గుర్తుంచుకోవాలి.
ఆవేశాలకు అడ్డుకట్ట వేయటానికి ఏం చేద్దాం!
విజయానికి కారణాలెన్నో అపజయానికి కారణాలన్నీ ఉంటాయి ఆత్మపరిశీలన ద్వారా తప్పొప్పులను సమీక్షించుకుంటే విజయం మన వెనకే నిలబడుతుంది ఇటువంటి సమయాలలో ఆవేశాలు కాదు ఆలోచనే ముఖ్యం!
ఎట్టి పరిస్థితులలో కూడా ఊహల్లో మేడలు కట్టవద్దు, ఊహలకు వాస్తవాలకు చాలా తేడా ఉండవచ్చు దేశ పటంలో చూపినట్లుగా దేశ సరిహద్దులుండవనేది గుర్తుంచుకోవాలి.
చేయగలనా? లేదా? అనే ఊగిసలాటతో పనిని ప్రారంభం చేయవద్దు ఇటువంటి అనుమానాలతో చేసే పనిలో సహజంగానే తప్పులు దొర్లే అవకాశముంటుంది ఇక్కడ అసహనం దానికి తోడుగా ఆవేశం జత చేయటం కాదు చేసే పని పట్ల మన అవగాహనే మనల్ని ముందుకు నడిపిస్తుందనేది బలంగా నమ్మండి!
ఏదైనా విషయంలో సమస్యలు ఎదురైనప్పుడు కంగారుతో కుంగకుండా పనికి సంబంధించి అవగాహన ఉన్న అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవటం చాలా అవసరమైన విషయం. దీనివలన కొలిక్కిరాని అనేక సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి.
మన అని అనుకునే వారితో మనం చేస్తున్న పనికి సంబంధించిన భావాలు పంచటం ద్వారా ఒక్కోసారి క్లిష్టమైన సమస్యలకు కూడా పరిష్కారాలు దొరుకుతాయి.
సాంకేతిక పరిజ్ఞానాన్ని(సెల్ ఫోన్స్ ,ఇంటెర్నేట్స్) అవసరమైన మేరకే వాడాలి. మితిమీరిన వాడకం మెదడు లోని న్యూరోట్రాన్స మీటర్స్ సమతూల్యతలు దెబ్బతీసి మానసిక దౌర్బల్యానికి తీయిస్తుంది. ఎందుకంటె మనిషి శారీరక, మానసిక ఆరోగ్యాల సమతూల్యతలకు మెదడు పాత్ర కీలకమైనది.
మనతో ఉన్నవారి విజయాలను చూసి మనం అలా సాంధించగలమా! అనే కంగారు ,భయాలకు లోను కావద్దు ఆ విజయాల వెనక వున్న క షిని ఆదర్శంగా తీసుకొని తిరిగి మన ఆలోచనలకు పదును పెట్టి ప్రయత్నాలు కొనసాగించాలి
ఎప్పుడైనా అపజయం ఎదురైనప్పుడు ఆమ్మో ఇంకేముంది అంతా అయిపోయిందనే కుంగుబాటు అవసరం లేదు మనం తిరిగి సాధించే విజయానికి మరో తలుపు తెరిచే ఉంటుందని తెలిసికోండి.
- సమాజంలో పేరు గాంచిన వ్యక్తులు,సంఘటనలు అధ్యయనం చేయటం ద్వారా లేదా ఇతరుల ద్వారా వినటం ద్వారా వారి జీవితాలలో విజయాలకు పునాదులు ఓర్పు, సహనమనేది మరవద్దు.
- ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో తమకు తాముగా రోజువారీ చేసే పనుల పట్ల పరిశీలన ఎంతైనా అవసరం. ఎటువంటి ఒత్తిడి లేకుండా తమకు తాము నిజాయితీగా పరీశీలుంచుకుంటే ఎప్పుడు, ఎక్కడ,ఎలా స్పందించాలనే అవగాహన పెరుగుతుంది. ఇది ఆవేశాన్ని అదుపులో ఉంచటానికి సహాయ పడుతుంది.
ఆవేశమనేది అదుపు తప్పిన ఒక మానసిక ఉద్వేగం!చేయబోయే పని పట్ల అవగాహన దాని వలన వచ్చే మంచి చెడుల విచక్షణే కొంతలో కొంత మానసిక ఆవేశాలకు అడ్డుకట్ట వేస్తుంది! దీనికి బాల్యం నుండే కుటుంబాల నుండి అవగాహన ప్రారంభం కావాలి. ఏం జరిగిన ఫరవాలేదు నేను చేసేది ఎటువంటి పర్యవసానాలకు దారి తీసిన సరే అని ఆలోచించే మనుషుల మనస్సులు వేసుకోవాల్సిన ఒకే ఒక ప్రశ్న మానవ జన్మకు మన మిచ్చే నిర్వచనం ఇదేనా అని? అందుకే ఆవేశాన్ని మన విచక్షణతో కూడిన ఆలోచనతో అడ్డుకట్ట వేద్దాం! ఆనంద జీవితాన్ని స్వాగతిద్దాం!
అమరనాథ్ జగర్లపూడి, కౌన్సెలింగ్ సైకాలజిస్ట్,
9849545257