Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమెరికాలోని శాన్కార్లోస్ నివాసి ''భవిష్యత్ రైతన్న'' ను మనకు పరిచయం చేస్తున్నాడు. ఈ భావితరం రైతు పేరు ''యాంగస్''. బరువు దాదాపు 455 కిలోలు. ఇంతటి మహాకాయం కాబట్టి కదలికలు కాస్త నెమ్మదిగానే ఉంటాయిగా. అయితేనేం ఈ రైతు బలం ఎంతటిదంటే ఏకంగా 363 కిలోల కూరగాయల కొయ్య తొట్టెను అవలీలగా ఒక చోట నుంచి మరొక చోటకు మోసుకెళ్లగలడు. మానవమాత్రులు ఇంత బరువుండటం, మోయడం సాధ్యమేనా అని సందేహిస్తున్నారు కదూ? మీ అనుమానం నిజమే... యాంగస్ ఒక రోబో! ఈ భారీ రైతు రోబోతో పాటు ఇతర చిన్న రోబోలతో వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న యువకుడు అలెగ్జాండర్.
ఎంతో కృషి చేసి
''మూన్‌షాట్'' లేబొరేటరీ రోబోటిక్స్ విభాగంలో ఇంజనీరుగా అలెగ్జాండర్ పనిచేశాడు. అక్కడ అతని బాధ్యత డ్రోన్ల రూపకల్పన. అక్కడే పని చేస్తున్న జోన్ బిన్నీతో అతడికి స్నేహం కుదిరింది. వారిద్దరూ ఎంతో కృషి చేసి ఐరన్ ఆక్స్ సంస్థకు ఊపిరిపోశారు. ఈ సంస్థకు అలెగ్జాండర్ సీఈవో, బిన్నీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్. కేవలం 33 ఏండ్ల వయసులోనే వీరిద్దరూ కలిసి రోబోలతో వ్యవసాయం కోసం దాదాపు 60 లక్షల డాలర్ల మేర నిధులు సేకరించారు. తర్వాత అంకుర సంస్థను ఏర్పాటు చేసి రెండేండ్లపాటు కిందామీదా పడ్డారు. చివరకు ''మూన్‌షాట్'' లేబొరేటరీ సాధించలేని ఘనతను సొంతం చేసుకున్నారు. ''ఇప్పుడు మా రోబోలు సాగుచేసిన కూరగాయలు సరఫరాకు సిద్ధంగా ఉన్నాయి. ఈ కూరగాయలతో చేసిన సలాడ్ మీరెన్నడూ ఎరుగనంత రుచిగా ఉంటుంది'' అని ఊరిస్తున్నాడు అలెగ్జాండర్.
గ్రీన్ హౌజ్ వ్యవసాయ క్షేత్రాలు
కాలిఫోర్నియాలోని శాన్ కార్లోస్ పట్టణ శివారులో ''ఐరన్ ఆక్స్'' కంపెనీ 8 వేల చదరపు అడుగుల గిడ్డంకి ప్రాంగణంలో రోబో వ్యవసాయ క్షేత్రాన్ని తీర్చిదిద్ది పంటల సాగు చేపట్టారు. ఈ కూరగాయల అమ్మకానికి శాన్ ఫ్రాన్సిస్కో తీరప్రాంత రెస్టారెంట్లతో అలెగ్జాండర్ సంప్రదింపులు సాగిస్తున్నాడు. అలెగ్జాండర్ మాట్లాడుతూ 'వచ్చే ఏడాదికల్లా మా రోబో పండించిన కూరగాయలు సూపర్ మార్కెట్లకు చేరతాయి. నీటి అవసరం ఎక్కువగా లేకుండా సహజ సూర్యకాంతిపై ఆధారపడే గ్రీన్ హౌజ్‌లలో వ్యవసాయ క్షేత్రాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. అత్యంత ఖర్చుతో కూడుకున్న హైపవర్ విద్యుద్దీప కాంతి ఆధారిత ఇన్డోర్ సాగుకన్నా ఇది ప్రకృతికి దగ్గరగా ఉంటుంది. ప్రారంభంలో కాస్త నష్టమొచ్చినా తమ దిగుబడిని-మార్కెట్ ధరకన్నా తక్కువకే విక్రయిస్తూ పోటీలో నెగ్గుకొస్తాం. అలాగే ఐదేండ్లలో అమెరికాలోని అన్ని మెట్రో ప్రాంతాల్లో ఐరన్ ఆక్స్ రోబో వ్యవసాయ క్షేత్రాల ఏర్పాటు చేయడమే మా లక్ష్యం' అంటున్నాడు.
మట్టితో పనిలేదు
వ్యవసాయ రంగంలో పనికి అమెరికా కార్మిక శక్తి పెద్దగా మొగ్గు చూపడంలేదు. అందుకే రోబోలతో సాగు, అందునా మట్టిరహిత (హైడ్రోపోనిక్) పద్ధతిలో వ్యవసాయమే మెరుగని అలెగ్జాండర్ అంటున్నాడు. అంతేకాకుండా రోబో క్షేత్రాల్లో నీటి సంరక్షణకూ అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపాడు. తన ఇన్డోర్ రోబో క్షేత్రాల్లో భారీ బరువులెత్తే పనిని అన్ని దిశలకూ కదలగల చక్రాలతో నడిచే యాంగస్ చూసుకుంటుందని చెప్పాడు. పక్వానికి వచ్చిన పంట ఉత్పత్తులను మానవ కార్మిక శక్తితో సేకరించినా, భారీ మొత్తంలో వాటిని ఒక చోట నుంచి మరో చోటికి యాంగస్ సునాయాసంగా తరలిస్తుందన్నాడు. ఇంకా పేరు పెట్టని మరో రోబో చిన్న పాదులలో కాస్త ఎదిగిన మొక్కలను తన యాంత్రిక హస్తంతో సున్నితంగా తీసి, పెద్ద పాదుల్లోకి మారుస్తుందట. ఇలా వివిధ చిన్నచిన్న పనులు చేసే రోబోల యాంత్రిక హస్తాల కీళ్లకు రాపిడి సమస్య లేకుండా కూరగాయలకు హాని కలిగించని లక్షణంగల గ్రీస్ వాడతాడట. ఒక్కొక్క తెట్టెలోని సుమారు 250 మొక్కలను పెద్ద పాదుల్లోకి మార్చడం చాలా శ్రమతో కూడిన పనే అయినా ఆ చిన్న రోబో అలుపు లేకుండా చేసుకుపోతుంది. ఇప్పటికే పక్వానికి వచ్చిన పంటను గుర్తించి ఉత్పత్తిని సేకరించగల రోబో తయారీలో ఐరన్ ఆక్స్ నిమగమైన ఉందని అలెగ్జాండర్ చెబుతున్నాడు. ''రోబోల సాయంతో మానవాళి ఆకలి తీర్చగలిగితే ప్రపంచంపై ప్రభావం చూపగల ఘనకార్యం అంతకన్నా మరొకటి ఏముంటుంది?' అంటున్నాడతడు.