Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ కాలం యువతకు మస్కా బన్ లేదా బన్ మస్కాతో పరిచయం తక్కువేనేమో. 80లు, 90ల దాకా బన్ మస్కా అంటే క్రేజ్ ఉండేది. ఇప్పటికీ అక్కడక్కడా ఉన్న ఇరానీ కేఫ్‌లలో మస్కా బన్ దర్శనమిస్తుంటుంది.ఇరానీ కేఫ్‌లో ఒక మూలన ఓనర్ కూర్చొని ఉంటే... ఆయన టేబుల్ పై రకరకాల తినుబండారాలుంటాయి. వాటిలో మస్కా బన్ ఒకటి.
మస్కా అంటే వెన్న. బన్‌కు మస్కా కలిపి ఉండడం అన్నమాట. అయితే ఉట్టి మస్కా చప్పగా ఉంటుంది. కానీ ఇరానీ కేఫ్‌లలో దొరికే మస్కా బన్ ఉంటుందీ... మ్... ఆ రుచి ఆస్వాదిస్తే తప్ప అర్థం కాదు.
పంచదారను మెత్తటి పొడిగా చేసి మస్కాతో కలిపి, బన్ను మధ్యలోకి కోసి ఒక మందపాటి పొరలా మస్కాను పరిచి తిరిగి బన్ పొరతో కప్పి వేస్తారు. ఇప్పటి పిజ్జా, బర్గర్లు వచ్చి మస్కా బన్ను మరిచిపోతున్నారు కానీ, ఇన్ని రకాల ఆహార పదార్థాలు దొరకని కాలంలో హైదరాబాదీలు ఇష్టంగా తినే స్నాక్ ఐటమ్ ఈ రుచికరమైన మస్కా బన్.
ఒకప్పుడు పప్పాకు సాలరీ వస్తే... ఆ రోజు సాయంత్రం ఆ ఇంట్లోని పిల్లలకు మస్కా బన్ వస్తుందని సంబరపడి పోయేవారు. ఇరానీ చారు తాగి కవిత్వమో, రాజకీయాలో, లవ్ కహానీలో... ఏవి మాట్లాడుకోడానికైనా అడ్డాగా ఉండే ఇరానీ కేఫ్‌లో బ్యాచ్ లుగా కూర్చొని 'ఇక్బాల్ భారు... దో మే చార్. పెహ్లే మస్కా బన్ భేజో ' అనే ఆర్డర్లు నిత్యకృత్యంగా వినిపిస్తుండేవి. ఇక పూట గడవని వారైతే ఒక బన్ మస్కాతో ఒక పూట గడుపుకునేవారు. ఒక బన్ మస్కా ఒకరి కడుపు నింపేంత పెద్దదిగా ఉండేది.
ఇవండీ బన్ మస్కా కబుర్లు. ఆ పాత మధురాన్ని ఆస్వాదించాలంటే ఎక్కడైనా ఇరానీ చారు కేఫ్ కనిపిస్తే దూరిపోండి. వన్ బై టూ ఆఫర్ చేసుకోండి.
రక రకాల మనుషులు టేబుళ్ళ చుట్టూ కూర్చొని ముచ్చట్లతో గడుపుతుండడం, చారు సప్లై చేసే అబ్బాయిలు చేసే గ్లాసు చప్పుళ్ళు... సన్నగా వినిపించే పాటలు(ఇప్పుడక్కడ మాత్రమే)... ఓV్‌ా... మీ ప్రపంచంలో మీరు మునిగిపోండి. ఆడవాళ్ళు తక్కువగా వెళ్ళే ఈ కేఫ్లలోకి అప్పుడప్పుడు దూరి ఆ మజాను ఆస్వాదించండి. ఏ సబ్ వే లోనో, మరే సీసీడీలోనో అంతా కార్పొరేట్ స్టైల్లో డబ్బులు పోగొట్టుకుని మరీ బిగదీసుకుని ఫోజు కొట్టాలి. అదే ఇలాంటి కెఫేలలో మనం మనలా ఉండొచ్చు.
అచ్చంగా టైటానిక్ సినిమాలో క్లాస్ ప్రపంచం నుంచి మాస్ ప్రపంచంలోకి అడుగు పెట్టడంలాంటిదన్నమాట.