Authorization
Mon Jan 19, 2015 06:51 pm
క్రియేటివిటీ... ఒక్కరి సొత్తు కాదు. కాస్త శ్రద్ద పెడితే ఏమైనా సాధించవచ్చు అని రుజువు చేస్తున్నాడు రాఘవేంద్రగౌడ్. రెండేండ్ల కిందటి వరకు గొర్రెల కాపరిగా ఉన్న ఆ అబ్బాయి ఇప్పుడు గొప్ప మైక్రో ఆర్టిస్ట్. అద్భుతమైన ఫొటో ఎడిటర్. కాబోయే ఫిల్మిం మేకర్. నటుడు... ఇలా భిన్న కళల్లో తన సత్తా చాటుకుంటున్న అతను రామ్ తలైవాగా సోషల్ మీడియాలో ఎందరికో సుపరిచితుడు...
రాఘవేంద్రగౌడ్ది సొంత ఊరు వికారాబాద్ జిల్లాలోని ఇప్పాయపల్లి గ్రామం. తండ్రి ముసలయ్య గీత కార్మికుడు. తల్లి పోసమ్మ. వీరికి పది మంది సంతానం. ఎనిమిది మంది కొడుకులు. కొడుకుల్లో అందరికంటే చిన్నవాడు రాఘవేంద్ర. ఇతని తర్వాత ఇద్దరు ఆడపిల్లలు. అందరూ రామ్ అనిపిలుస్తుంటారు.
గొర్రెల కాపరిగా...
పెద్ద కుటుంబం కావడంతో తండ్రి ఎంతో కష్టపడి కుటుంబాన్ని నడిపేవాడు. అందుకే చిన్నప్పటి నుండి రామ్ గొర్రెల కాపరిగా రోజూ పొలం వెళ్ళేవాడు. దాంతో బడికి సరిగా పోయేవాడు కాదు. అయితే రామ్‌కు చిన్నప్పటి నుండి డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. ఒకటో తరగతిలో ఉన్నప్పుడు ఓ బొమ్మ గీసి తండ్రికి చూపించాడు. చాలా బాగా గీశావంటూ మెచ్చుకున్నాడు. ఇక అప్పటి నుండి తనకు నచ్చిన ప్రతి బొమ్మను గీస్తూ ఉండేవాడు రామ్. వయసు పెరిగే కొద్ది అతని ఆలోచనల్లో కూడా మార్పు వచ్చింది. అందరిలా కేవలం పేపర్‌పై బొమ్మలు వేయడం కన్నా ఏదైనా భిన్నంగా చేయాలనుకున్నాడు. రామ్ అన్న రాజుగౌడ్ కూడా ఆర్టిస్ట్ కావడంతో మరింత ప్రోత్సాహం లభించింది. గొర్రెలను తీసుకుని పొలం వెళ్ళినప్పుడు అక్కడ చెట్టు నీడన కూర్చుని ఆకులతో పిన్నీసు తీసుకుని తనకు నచ్చిన ఆకారాలను తయారు చేసేవాడు. అలాగే చాక్పీస్ను కూడా అందమైన ఆకారాలుగా మలిచేవాడు.
మైక్రో ఆర్టిస్ట్‌గా...
మెల్లమెల్లగా ఆకులతో, చాక్‌పీస్‌లతో, గోడలపైన, పెన్సిల్ ముక్కుతో, చెక్కపై రకరకాల బొమ్మలు వేసేవాడు. టాటూలు కూడా వేయడం మొదలుపెట్టాడు. అలా తనకు తెలియకుండానే మంచి మైక్రో ఆర్టిస్టుగా మారిపోయాడు. రామ్ వీటి కోసం ఎక్కడా ట్రైనింగ్ తీసుకోలేదు. మొత్తం సొంతగానే చేసేవాడు. అంతే కాదు ఫొటోగ్రఫీపై ఉన్న ఆసక్తితో అది కూడా సొంతగా నేర్చుకున్నాడు. అలాగే ప్రతి వినాయక చవితికి మట్టి వినాయకుడి బొమ్మలు తయారు చేసి పంచి పెడతాడు.
ఫొటో ఎడిటర్‌గా...
మూడేండ్ల కిందట రామ్ తండ్రి చనిపోయాడు. దాంతో కుటుంబ అవసరాల రీత్యా ప్రస్తుతం రామ్ ఓ ఆఫీస్‌లో వెడ్డింగ్ ఫొటో గ్రాఫర్‌గా ఉద్యోగం చేస్తూ ఎమ్మె తెలుగు చేస్తున్నాడు. వాస్తవానికి రామ్ డిగ్రీ వరకు సైన్స్ గ్రూప్ చదివాడు. కానీ తెలుగుపై ఉన్న ఆసక్తితో ఎమ్మెలో తెలుగు సబ్జెక్ట్ తీసుకున్నాడు. ఇన్ని గొప్ప ఆలోచనలు ఉన్న రామ్ 22 ఏండ్లకే అద్భుతమైన ఫొటో గ్రాఫర్‌గా పేరు తెచ్చుకుంటున్నాడు.
షార్ట్ఫిలిమ్స్ కోసం...
మైక్రో ఆర్టిస్టుగా పేరు తెచ్చుకుంటూ, చేస్తున్న ఉద్యోగానికే రామ్ పరిమితం కాదలచుకోలేదు. కొన్ని షార్ట్ ఫిల్మిమ్స్కి కూడా పని చేశాడు. విరించి అనే డైరెక్టర్ వద్ద 'ఇక్కడి చెట్ల గాలి', 'డర్టీ హ్యాండ్స్' అనే రెండు షార్ట్ ఫిలిమ్స్‌కి చేశాడు. ప్రస్తుతం 'ఫ్యూచర్ షాక్' అనేది ఎడిటింగ్‌లో ఉంది. అలాగే ఆయన తీయబోతున్న ఓ కొత్త మూవీలో నటిస్తున్నాడు.
మంచి సందేశాన్నిస్తూ...
ఎప్పటికైనా డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీలో గొప్ప పేరు తెచ్చుకోవాలని అతని కోరిక. అలాగే సమాజానికి మంచి సందేశాన్నిచ్చే షార్ట్ ఫిల్మ్ తీయాలనుకుంటున్నాడు. దాని కోసం ప్రత్యేకంగా 4,5 కథలను రాసిపెట్టుకున్నాడు. తనకు సహకరించే ప్రొడ్యూసర్ల కోసం వెదుకుతున్నాడు.
రజనీకాంత్‌కు వీరాభిమాని
''ఓ ప్రోగ్రామ్‌లో రజనీకాంత్‌ని కలిశాను. ఆర్ట్ వేసి ఇద్దామనుకున్నాను. కానీ ఆయన వస్తున్నట్టు అప్పటికప్పుడే తెలియడంతో హడావుడిగా వెళ్ళాను. దాంతో నాతో పాటు ఆర్ట్‌ని తీసుకెళ్ళలేకపోయాను. ఆయన కోసం మూడు గంటలు వెయిట్ చేశాను. ఆయన కారు చూసి పరిగెత్తుకుంటూ కార్ దగ్గరకు వెళితే ఆయన పలకరించి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది'' అంటున్నాడు రామ్.
తల్లి పొంగిపోయేది
కొడుకు ఇలా భిన్నమైన కళలను ఎంచుకుని దినదినాభివృద్ది చెందుతుంటే కన్నవారికి ఎవరికైనా ఆనందంగానే ఉంటుంది. రామ్ తల్లి పోసమ్మ కూడా అంతే. కొడుకును చూసి పొంగిపోతుంది. 'మీ నాన్న ఉంటే నిన్ను చూసి ఎంత సంతోషించేవాడో' అంటూ కన్నీరు పెట్టుకుంటుంది.
నిద్రలేని రాత్రులు ఎన్నో
ఇటు చదువు, అటు ఉద్యోగం... ఇంకా మైక్రో ఆర్టిస్ట్‌గా ఎన్నో చేయాలని కోరిక. ఉద్యోగం ఉంది కదా అని చదువు మానేస్తే మళ్ళీ పూర్తి చేయడం కష్టం. పైగా డబ్బు సంపాదనలో పడితే చదువుపై అంత శ్రద్ధపెట్టలేం. ఇది రామ్ అభిప్రాయం. అందుకే ఎన్ని ఇబ్బందులు వచ్చినా చదువును మాత్రం మధ్యలో ఆపదలచుకోలేదు. దీని కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు. రాత్రంతా ఫొటో షూట్ చేసి ఉదయం పరీక్షలకు హాజరైన రోజులు ఎన్నో ఉన్నాయి. మరో రెండు నెలల్లో అతని పీజీ పూర్తికాబోతున్నది.
వారి మాటలు పట్టించుకోడు
'నీకు ఇవన్నీ అవసరమా. చక్కగా చదువుకుని జాబ్ చూసుకోవచ్చు కదా' అంటూ కొందరు రామ్‌ను హేళనగా మాట్లాడేవారు. కొందరు మాత్రం తనలోని నైపుణ్యాన్ని చూసి మెచ్చుకునేవారు. ప్రోత్సహించేవారు. ఎగతాళి చేసిన వారి మాటలను పట్టించుకోకుండా తనలోని నైపుణ్యానికి మరింత పదును పెట్టి మరెన్నో విజయాలు సాధించాలనేది అతని ఆశయం. మరి మనం కూడా రామ్‌కు ఆల్ ది బెస్ట్ చెబుదామా...
భిన్నంగా చేయాలనే
ఏదో ఒకదానికి మాత్రమే పరిమితం కాకూడదనే ఇన్ని రకాలు ప్రయత్నించాను. ప్రతి దాంట్లో 50 నుండి వంద రకాల బొమ్మలు చేశాను. ఒక్క చాక్పీస్తోనే 200 రకాలు చేశాను. జాగ్రత్త చేయకపోవడంతో కొన్ని విరిగిపోయాయి. ఇప్పుడు చాలా బాధగా ఉంటుంది. చిన్నప్పటి నుండి రజనీకాంత్ అంటే చాలా ఇష్టం. ఆయన బొమ్మలు చాలా వేశాను. ఆయన వీడియోలు ఎడిటింగ్ చేసి ఫేస్బుక్లో పోస్ట్ చేస్తుంటాను. ఆయనపై ఉన్న అభిమానంతోనే నా పేరు పక్కన రామ్ తలైవా అని పెట్టుకున్నాను. ఇప్పుడు అన్ని చోట్ల అదే పేరు ఉంటుంది.
మార్పు వస్తుందనే ఆశతో
పసిపిల్లలపై జరుగుత్నున దాడులను చూస్తే చాలా బాధగా ఉంటుంది. వాటికి వ్యతిరేకంగానే ఓ కథ రాసుకున్నాను. దీనిపైనే ఆర్ట్ కూడా వేశాను. ఆ కథను షార్ట్ ఫిలింగా తీసుకురావాలి. సినిమాలు సమాజాన్ని ఎంతో ప్రభావితం చేస్తున్నాయి. నేను తీసిన సినిమా వల్ల కొంత మందిలోనైనా మార్పు వస్తుందేమో అని చిన్న ఆశ.
- సలీమ