Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఆ గడ్డమేంట్రా బాబూ... ముందు తీసేసి రా...' అంటూ అమ్మలు తమ టీనేజీ దాటిన కొడుకులను విసుక్కుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయినా వారు వినరు. ఇంకా మరింత స్టైలిష్ గా కనిపించాలంటే ఇంకా రెండు ఇంచులైనా పెంచాలి అని చెప్తుంటారు. అవును. ఇప్పుడు గడ్డం ఎంత బాగా పెంచగలిగితే అంతటి ట్రెండ్ ను ఫాలో అవుతున్నట్లు లెక్క. గమనించండి... మన చుట్టూ ఉన్న యువకులను. ఎక్కడ చూసినా గుబురు గడ్డం... మీసాలతోనే కనిపిస్తుంటారు. ఒకవేళ 'ఎందుకలా గడ్డం పెంచావ్...' అని అడిగామే అనుకోండి. 'ఇదీ లేటెస్ట్ ట్రెండ్..' అంటూ మరోసారి తమ చుబుకాన్ని నిమురుకుంటూ సమాధానం చెప్తారు.
ప్రతి దశకంలోనూ యూత్‌ను ఎట్రాక్ట్ చేసే అంశాలేవో ఫ్యాషన గా మారడం మనం చూస్తూనే ఉంటాం. ఒకప్పుడు బెల్ బాటమ్, ఆ తరువాత బ్యాగీ, నిన్న మొన్నటి దాకా పెన్సిల్ కట్, టైట్ జీన్స్ లాంటి ఎన్నో ఫ్యాషన్లను యూత్ ధరించే దుస్తుల్లో చూశాం. ఇప్పుడు వృద్ధులను అడిగితే తాము ఎక్కువగా ఎన్టీఆర్, ఏఎన్నార్ సినిమాల్లో ధరించిన బెల్ బాటమ్, పెద్ద పెద్ద కాలర్లు ఉన్న చొక్కాలను, పెద్ద పూలు ఉన్న రంగు రంగుల చొక్కాలను ధరించామని చెబుతారు. అలాగే కాస్త మధ్య వయస్కుల వారికి చిరంజీవి రోల్ మోడల్. చిరంజీవి, నాగార్జున తదితరులు ధరించిన బ్యాగీ దుస్తులంటే ఇప్పటికీ మక్కువ పడే వాళ్ళను చూస్తూనే ఉన్నాం. ఇక ఎవరైనా కాస్త గడ్డం ఎక్కువ పెంచగానే 'ఎంట్రా దేవదాసులా మారిపోయావా' ఏంటి అని ఫ్రెండ్స్ ఆటపట్టించేవారు.
గడ్డంతో ఆకర్షిస్తున్నారు
ఈ మధ్యకాలంలో చాలామంది గడ్డం పెంచేస్తున్నారు. ఇప్పటి యూత్ గడ్డం పెంచడానికి చాలా కారణాలే ఉన్నాయి. కొన్నేళ్ళుగా మన యంగ్ హీరోలు మీసాలు, గడ్డాలతో సినిమాల్లో దర్శనమిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో' సినిమాలో పెంచిన గడ్డం, హేర్ స్టైల్ యూత్‌కు బాగా నచ్చేసింది. ఎన్టీఆర్ తోపాటు ఆ సినిమా దర్శకుడు సుకుమార్ కూడా అదే స్టైల్ తో కనిపించడం యూత్‌కు మరో ఆలోచన లేకుండా గడ్డం ట్రెండ్‌ను ఫాలో అయ్యేలా చేసింది. 'రంగ స్థలం'లో అయితే రామ్ చరణ్ నిండుగా పెంచిన గడ్డంతో, మాస్ లుక్‌తో యూత్‌ను మాయలో పడేసాడు. అర్జున్ రెడ్డి సినిమాలో విజరు దేవర కొండ గడ్డం లుక్ యూత్‌కు ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఇప్పటికీ చాలామంది అర్జున్ రెడ్డి లుక్ నే ఎక్కువగా కోరుకుంటున్నారని హేర్ స్టైలిస్ట్‌లు చెబుతున్నారు. చిరు తన నూట యాభయ్యో సినిమాలోనూ ట్రిమ్ చేసిన గడ్డం స్టైల్ లో కనిపించి యూత్‌కు సవాల్ విసిరారు. ఇప్పుడు షూటింగ్ దశలో ఉన్న సైరా సినిమాలో తన రూపానికి గడ్డం కచ్చితంగా ఎస్సెట్టే. బాహుబలిగా అవతరించి సాహోతో మన ముందుకు రాబోతున్న ప్రభాస్ గడ్డం లుక్ ను ఎవరైనా మరిచిపోగలరా? పవన్ కళ్యాణ్ అయితే షూటింగ్లో అవసరమైతే తప్ప గడ్డం తీయరని రాజకీయ ప్రచారంలో కనిపిస్తున్న ఆయన లుక్‌ను బట్టి అర్ధం చేసుకోవచ్చు. వీళ్ళే కాదు అల్లు అర్జున్, రానా, వెంకటేశ్, దర్శకుడు శేఖర్ కమ్ముల... ఇలా ఎవరిని చూసినా గడ్డంతో ఆకర్షిస్తున్నారు. ఎప్పుడూ గడ్డం లేకుండా కనిపించే సూపర్ స్టార్ మహేష్ బాబు తన రాబోయే సినిమా 'మహర్షి'లో చిరు గడ్డంతో కనిపిస్తున్నాడు. ఇక గడ్డం పెంచుకోని అబ్బాయిలు కూడా మహేష్‌బాబు దెబ్బకు గడ్డాలు పెంచేస్తారేమో.
బాలీవుడ్ లోనూ...
బాలీవుడ్ తారలు గడ్డం, మీసాలను ఎక్కువగా పెంచకుండానే అభిమానుల మనసులు గెలుచుకుంటుంటారు. సినీ రంగంలో అమితాబ్ శకం ముగిసినట్లే అని అందరూ భావించిన తరుణంలో ఆయన ఫ్రెంచ్ గడ్డం లుక్ తో సరికొత్తగా అవతరించి అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు. నిండైన గడ్డంతో దశాబ్ద కాలంగా ఆకర్శిస్తూనే ఉన్నారు. అమితాబ్ అంటే ఎవర్ గ్రీన్ అనేలా ప్రేక్షకుల మదిలో నిలవడానికి గడ్డం కూడా ఒక కారణమే అంటే నమ్ముతారా? ఇప్పుడు యువతను బాగా ఆకర్షిస్తున్న హీరోలు రణవీర్ సింగ్ ఎప్పుడు చూసినా ఫుల్లీ గడ్డంతో ఆకర్షించేస్తున్నాడు మరి. రణబీర్ కూడా కొన్ని సినిమాల్లో గడ్డంతో దర్శనమిస్తున్నాడు. వీరికేమాత్రం తీసిపోమంటూ నడి వయసులోనూ కోట్ల రూపాయలు వసూలు చేసే సినిమా హీరోలైన సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారూఖ్‌లు కూడా అప్పుడప్పుడు గడ్డాలు పెంచి యువతను ఆకర్షిస్తూనే ఉన్నారు.
ఎన్నెన్నో రకాలుంటాయి
మన దగ్గర అయితే గడ్డం పెంచడానికి యువ హీరోలు రోల్ మోడల్ గా ఉంటున్నారు. కానీ, దేశ విదేశాల్లోనూ ఇదే ట్రెండ్ నడుస్తుండడం కాస్త ఆశ్చర్యానికి గురిచేయకమానదు. బాల్బో స్టైల్, బంధోల్జ్, సర్కిల్ బియర్డ్, ఫుల్ బియర్డ్, గ్యారిబాల్డీ, ఇంపీరియల్, షార్ట్ స్టబ్ ల్, మీడియం స్టబ్ ల్, లాంగ్ స్టబ్ ల్, వాన్ దైక్, చిన్ స్ట్రాప్ బియర్డ్, సైడ్ బర్న్స్ లాంటి ఇంకా ఎన్నెన్నో స్టైల్స్ యువత అనుసరిస్తున్నారు.
టీనేజర్లలోనూ తాపత్రయం
తమకు గడ్డం రావడం మొదలయ్యాక ఎటువంటి స్టైల్స్ ను అనుసరించాలో టీనేజర్లు ముందుగానే ప్రణాళిలు సిద్ధం చేసుకుంటున్నారు. వీరి తొందరకు మరింత ఊతమిస్తున్నట్లు ఇంటర్నెట్లోనూ రకరకాల సమాచారం అందుబాటులోకి తెస్తున్నారు. గడ్డం త్వరగా పెరగాలంటే ఫలానా నూనెలు వాడమంటూ, ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎన్ని గంటల నిద్ర అవసరమవుతుందనే గందరగోళపు సమాచారం లభిస్తోంది. దీనితో టీనేజర్లు వాటిని అనుసరిస్తూ తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నారు.
ఎందుకు పెంచుతున్నారు?
ఆఫీస్‌లకు వెళ్ళడానికి ఇప్పుడు రూల్స్ పెట్టాల్సి వచ్చింది. లేకపోతే మాసిపోయిన గడ్డం, జులపాల తలతో కనిపిస్తే ఆఫీస్ వాతావరణం బావుండదన్న ఉద్దేశంతో కొన్ని సంస్థలు తమ ఉద్యోగులను నీట్‌గా షేవ్ చేసుకుని రావాలని ఆదేశాలు జారీ చేస్తున్నాయి. ఈ నిబంధనలకు ఉల్లంఘించి తమ కార్యాలయాలను వెళ్ళాలని ప్రయత్నిస్తే సెక్యూరిటీ వారిని లోపలికి ప్రవేశించకుండా అడ్డుకుంటున్నాయి. కాలేజీల్లో అయితే యూత్‌కు నచ్చిందే ప్రపంచం కదా... వారు రోజుకో కొత్త గెటప్‌లో కనిపించినా ఆశ్చర్యపోనవసరం లేదు. వారికి పాఠాలు చెప్పే లెక్చరర్లు కూడా తమ గడ్డం లుక్ తోనే వారికి దర్శనమిస్తుంటారు. ఇంతకీ ఎందుకు పెంచుతున్నారీ గడ్డాన్ని అని వారిని అడిగితే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అని చెప్పడంతోపాటు అబ్బా... ఎవరు షేవ్ చేసుకుంటారు చెప్పండి. దానికి అంత టైం వేస్ట్ చేయడం ఇష్టం లేదని చెబుతూ బద్దకంగా మొబైల్స్‌లో తల దూర్చుతుండడం విశేషం.