Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గడ్డి పరకపై వాలిన మంచు ముత్యాలు
రాతిరి నీ గుస గుసలకు రాలిన చెమట చుక్కలై...!
నింగిని పరచుకున్న కుంకుమ వర్ణం
నీ ముని పంటికి కందిన చివురు చెంపలై...!
సన్నని తెమ్మెరలకు
మధురంగా కదులుతున్న జాజి పొదలు
ముడి విప్పిన నా కేశాల్లో
చిక్కుకున్న నీ ఊపిరి సెగలుగా...!
పిచ్చుకమ్మల కువ కువలు
ఇరు హృదయ స్పందనల
రసైక యుగళ గీతంలా...!
ముంగిట్లో విచ్చుకున్న
మరు మల్లెల పరిమళాలు
హత్తుకు పోయిన నీ మేని గంధాలుగా...!
కలవర పెడుతున్నాయి
కరిగి పోయిన రేయికి
తీపి గురుతులై నిలిచి ఉన్న
ఈ తొలి కిరణపు కవ్వింతలు...!!