Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పవిత్రమైన ప్రపంచమంతా
తనను ప్రేమిస్తుంటే
చుక్కలన్నింటిని వొదిలేసి
చందమామ నేలకొచ్చినట్టు
తను, నా తోటలోకొచ్చి నిలిచింది
ఆ వెన్నెలగాలి
నా గుండె సరిహద్దుల్లోకి ప్రవేశిస్తుంటే
నరనరమూ సన్నగా వణికి
లీలగా కదిలే సెగలపలుకులను
పెదవులపై పలికిస్తోంది.
ఇన్నాళ్ళు నా నిద్రాసంద్రంలో
సడిచేసిన కలల అలలు
ఇప్పుడిక సంగీతమై వీస్తోంటే
ఆశల పల్లవిని అల్లుకొన్న తుదిలేని
పాటల సందడేదో వీనులలో చెలరేగుతోంది
ప్రేమాగ్ని శిఖల కోసం దీపప్పురుగై
పరితపిస్తున్న నా సాహసం
మంటలు రేపే ఆమె చూపులను
ముద్దాడడానికి తెగిస్తోంది.
- డా|| బి. బాలకృష్ణ,
9948997983