Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫోన్లో అతిగా మాట్లాడుతున్నారా? అయితే.. జాగ్రత్త మీ తలలో కొమ్ములు మొలిచే ప్రమాదం ఉంది. నమ్మబుద్ధి కావడం లేదా? అయితే మీరు ఈ పరిశోధన గురించి చదవాల్సిందే. ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు ఓ వ్యక్తి తలలోని పుర్రెకు కొమ్ములు మొలవడాన్ని గుర్తించారు. ఇందుకు అతడు ఫోన్ అతిగా మాట్లాడటమే కారణమని తెలుసుకున్నారు.
తల వెనుక కింది భాగంలో...
''ఫోన్ మాట్లాడేప్పుడు మనకు తెలియకుండానే వెనక్కి లేదా పక్కకు వాలిపోయి మాట్లాడతాం. దీనివల్ల బరువంతా తలపై పడి స్నాయువుల్లో ఎముక మొలుస్తుంది. ఇది సుమారు పక్షి ముక్కుంత ఉంటుంది'' అని చిరోప్రాక్టర్ డెవిడ్ సహాహర్ 'వాషింగ్టన్ పోస్ట్' పత్రికకు తెలిపారు. దీని పొడవు 10 మిల్లీమీటర్లు మాత్రమే ఉంటుందని, తల వెనుక కింది భాగంలో ఈ కొమ్ములు మొలుస్తాయని ఆయన అన్నారు. సహాహర్ అతని సహచరులు ఈ పరిశోధనలపై రెండు పరిశోధనలను రచించారు. ప్రస్తుతం దీనిపై ఆన్లైన్లో చర్చలు బాగా జరుగుతున్నాయి.
అతిగా వాడడం వల్ల
స్మార్ట్ఫోన్, టాబ్లెట్లను అతిగా వాడటం వల్ల ఈ సమస్య ఏర్పడుతుందని, నిరంతరం ఒకే భంగిమకు అలవాటుపడే వారిలో కొమ్ములు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వారు చెబుతున్నారు. చిన్నతనం నుంచి ఫొన్ మాట్లాడే అలవాటు ఉన్నవారికి మరింత వేగంగా ఈ సమస్య వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. ఈ కొమ్ముల వల్ల వెంటనే ప్రమాదం లేకున్నా.. తల లేదా మెడ ఆకృతి కోల్పోవచ్చని చెబుతున్నారు.
పురుషులే ఎక్కువగా...
సహాహర్ టీమ్ నిర్వహించిన అధ్యయనంలో 41 శాతం యువతలో ఈ సమస్య ఉన్నట్లు గుర్తించారు. బాధితుల్లో అత్యధికులు పురుషులే ఉన్నారు. స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఫోన్ మాట్లాడేప్పుడు తల, మెడ భంగిమలు సక్రమంగా ఉంచితే ఈ సమస్యను ఆదిలోనే అంతం చేయొచ్చన్నారు. కాబట్టి.. మీరు కూడా జాగ్రత్తలు పాటించండి.