Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లైఫ్‌లో ఏదైనా సాధించాలంటే పట్టుదల అవసరం. ఏ రంగంలో రాణించాలన్నా ఇదే ముఖ్యం. వ్యాపార రంగమైనా, సామాజికంగానైనా ఎదిగేందుకు ఇది దోహదపడుతుంది. సరైన సమయంలో పని ప్రారంభిస్తే తిరుగే ఉండదు. రేపూ, మాపూ అంటూ వాయిదా వేసుకుంటూపోతే మొదటికే మోసం. లేదంటే మనం చేయాల్సిన పని ఇంకొకరు చేసేస్తారు. మనం చేపట్టాల్సిన స్టార్టప్ మరెవరో ప్రారంభించేస్తారు. అప్పుడు తీరిగ్గా బాధపడినా టైమ్ వేస్ట్ తప్ప ప్రయోజనం ఉండదంటున్నారు నిపుణులు.
- మన ఆలోచన అమల్లో పెడితే ప్రపంచాన్ని మార్చవచ్చు అని గట్టిగా అనిపించగానే కార్యచరణలోకి దిగిపోవాలి. మంచిరోజులు, ముహూర్తాలంటూ సమయం వృధా చేసుకోవద్దు.
- ఒక స్టార్టప్ ప్రారంభించాలనుకున్నప్పుడు మన మనసు దేనిపై ఉన్నదనేది గుర్తించగలగడం ప్రధానాంశం. చిన్న సమస్య పెద్ద కల్లోలాన్ని సృష్టించగలదు. కానీ సమస్యనే అవకాశాలుగా మార్చుకుంటే విజయం వెతుక్కుంటూ వస్తుంది.
- స్టార్టప్ ప్రపంచంలో అడుగుపెట్టినప్పుడు అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కోవడానికైనా మానసికంగా సిద్ధపడాలి. ఎలాంటి ప్రతికూల పరిస్థితిలోనూ స్థైర్యాన్ని కోల్పోకూడదు.
- మంచి కెరీర్‌ను మధ్యలో వదిలిపెట్టి కొత్త ఐడియాతో స్టార్టప్ ప్రారంభిస్తున్నప్పుడు అందరి దృష్టి మనమీదే ఉంటుంది. చాలా అంచనాలు పెరిగిపోతాయి. వ్యాపార ప్రపంచంలో కొత్త రాక్స్టార్లుగా వెలిగిపోతారు. అయితే ఎంట్రప్రెన్యూర్షిప్ అనేది సరదాగా వారాంతాల్లోనో, వేసవి సెలవుల్లోనో ఆడుకునే జాలీగేమ్ కాదు. ఇలాంటి మైండ్‌తో అసలు స్టార్టప్ రంగంలోకి అడుగు పెట్టకూడదు.
- ఒక్కోసారి ఎవరెస్ట్ అంత ఎదుగుతాం.. కానీ పాతాళంలోకి పడిపోతాం. దేనికీ గ్యారెంటీ లేదు. అందుకే అంచనాలకు, వాస్తవాలకు మధ్య తేడాను గుర్తించి మసలుకోవాలి.
- ఒక్క స్టార్టప్ సక్సెస్ అయిందంటే కొన్ని వందల స్టార్టప్‌లు ఫెయిలై ఉంటాయనే విషయాన్ని మర్చిపోవద్దు. గెలుపోటములను ఒకే ఒక చిన్న అంశం ప్రభావితం చేస్తుంది. చేయాల్సిన 20 పనుల్లో 19 పర్ఫెక్ట్గా చేసి... ఆ ఒక్కటే కదా! అని నిర్లక్ష్యం చేస్తే మొత్తానికే మోసం రావచ్చు. ఇక్కడ కావాల్సింది చిత్తశుద్ధితో ప్రయత్నించడమే. ఒకసారి ప్రారంభించిన తర్వాత పరుగెడుతూనే ఉండాలి. వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం కూడా రాకపోవచ్చు.
- ఏదైనా రేసులో పాల్గొంటున్నప్పుడు వందలు, వేలల్లో పోటీదారులు ఉంటారు. అయితే... అందులో ఒకరే విజేతగా నిలుస్తారు. అయినా అందరూ గెలుస్తామనే నమ్మకంతోనే పరుగు ప్రారంభిస్తారు. వారిలో ఏండ్ల తరబడి ప్రాక్టీస్ చేసేవాళ్ళూ ఉంటారు. అప్పటికప్పుడు రెడీ అయి వచ్చేవారూ ఉంటారు. అయితే ఎవర్నీ తక్కువ అంచనా వేయలేం. ఎంట్రప్రెన్యూర్షిప్ అనేది రోజువారీ పోరాటం. సుదీర్ఘంగా అత్యంత క్లిష్టమైన పోరాటం చేయాల్సి ఉంటుంది. ఫలితం ఎలాంటిదైనా నిబ్బరంగా అంగీకరించగలిగే స్థైర్యంతో అడుగుపెట్టాలి. ఎంట్రపెన్యూనర్గా మారడమనేది భయం కలిగించే థ్రిల్లింగ్ రైడింగ్ లాంటిది. ఒక్కసారి రుచి చూస్తే ఆగరు. మళ్లీ మళ్లీ ట్రై చేయాలనిపిస్తుంది.