Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రియదర్శి... ఇప్పుడు ఎవరి నోట విన్నా ఇదే పేరు. 'పెళ్లి చూపులు' సినిమాతో మంచి కమెడియన్‌గా ప్రేక్షకుల మన్ననలను పొందారు. అచ్చమైన తెలంగాణ యాసలో మాట్లాడుతూ తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆసు యంత్రాన్ని కనిపెట్టి చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపిన చింతకింది మల్లేశం జీవితంతో తెరకెక్కిన 'మల్లేశం' బయోపిక్‌లో నటించి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న అతనితో చిట్‌చాట్.
కమెడియన్‌గా ఉన్న మీరు ఒక్కసారిగా హీరో అయిపోయారు? ఎలా అనిపిస్తుంది?
చాలా సంతోషంగా ఉంది. సినిమా సక్సెస్ తర్వాత జిల్లాలకు వెళ్ళినప్పుడు మా ఆనందం ఇంకా రెట్టింపు అవుతుంది. ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారు. ముఖ్యంగా చేనేత కార్మికులు. ఓ ఆర్టిస్టుగా ఇంతకంటే ఏం కావాలి.
ఇలాంటి అవకాశం వస్తుందని ఊహించారా?
అస్సలు అనుకోలేదు. అంతా డైరెక్టర్ రాజ్‌గారి గొప్పదనం. యూట్యూబ్‌లోని నా షార్ట్ఫిలిమ్స్, నటించిన సినిమాలు అన్నీ చూశారు. అవి చూసిన తర్వాత చింతకింది మల్లేశం క్యారెక్టర్‌కు నేనే సరిపోతానని నిర్ణయించారు. అమెరికాలో జాబ్ చేసే ఆయన ఈ సినిమా తీయాలని ఇక్కడికి వచ్చారు.
ఈ క్యారెక్టర్ కోసం అడిగినప్పుడు ఎలా ఫీలయ్యారు?
ఇప్పటి వరకు అన్నీ కామెడీ క్యారెక్టర్స్ చేశాను. అసలు ఇలాంటి పాత్ర చేయగలనా అనే సందేహం వచ్చింది. కానీ నాకంటే రాజ్గారే నాపై నమ్మకం పెట్టారు. ఆయన నమ్మకమే నాతో మల్లేశం పాత్ర చేయించింది.
మల్లేశం కథ విన్నప్పుడు ఎలా అనిపించింది?
ముందు చాలా బాధపడ్డాను. తర్వాత స్ఫూర్తి పొందాను. ఆయన పడ్డ కష్టాలు విని ఏడ్చేశాను. ఇప్పుడు ఆయన్ని అందరూ గ్రామీణ శాస్త్రవేత్త అని పిలుస్తున్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. ఆయన ఈ ఆసు యంత్రం కనిపెట్టిన తర్వాత ఎంతో మంది ఆడపిల్లలు చదువుకోగలుగుతున్నారు. ఉపాధి పొందుతున్నారు. అలాంటి ఓ గొప్ప వ్యక్తి జీవితం ఈ ప్రపంచానికి తెలియజేయాలని రాజ్ ఎందుకు అనుకున్నారో ఆయన కథ విన్నతర్వాత స్పష్టంగా అర్థమయింది.
స్ఫూర్తి పొందాను అన్నారు...ఎలా?
ఆరో తరగతి మాత్రమే చదివిన వ్యక్తి. గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగిన ఓ సాధారణ చేనేత కుటుంబం వారిది. పేదరికం. అప్పుల్లో జీవితం. ఒక్క చీర తయారు చేయడానికి 9 వేల సార్లు ఆసును తిప్పడమంటే మామూలు విషయం కాదు. ఈ పని ఎక్కువగా మహిళలే చేస్తారు. తన చిన్న తనం నుండి ఆ పని చేయడానికి తన తల్లి లక్ష్మి ఎంత కష్టపడిందో కళ్ళారా చూశారు. ఆసుని తిప్పడం వల్ల చాలా మంది మహిళల చేతులు పని చేయకుండా పోయాయి. ఎలాగైనా తన తల్లికీ, చేనేత ప్రజలకు ఆ కష్టం లేకుండా చేయాలని పట్టుదలతో ఆసు యంత్రాన్ని తయారు చేశారు. ఇది చేసే క్రమంలో ఆయన్ని ఎందరో ఎగతాళి చేశారు. దూరం పెట్టారు. అయినా ఎంతో కష్టపడి యంత్రాన్ని కనిపెట్టాడు. అందుకే ఆయన ఎప్పటికీ నాకు స్ఫూర్తినిచ్చే వ్యక్తి.
సినిమా సక్సెస్‌ను ఎలా ఎంజారు చేస్తున్నారు?
చాలా హ్యాపీగా ఉంది. కమెడియన్‌గా ఉన్న నన్ను ఈ పాత్ర ఆర్టిస్టుగా మరో మెట్టు ఎక్కించింది. చాలా మంది గొప్ప గొప్ప రివ్యూస్ రాస్తున్నారు. మరీ ముఖ్యంగా ప్రజలు బాగా ఆదరిస్తున్నారు.
ఈ సినిమా ద్వారా మీరేమైనా నేర్చుకున్నారా?
చాలా నేర్చుకున్నా. వందల ఏండ్ల నుండి చేనేత కుటుంబాల్లో ఆడవాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఇవి. అప్పటి నుండి ఈ వృత్తిని బతికిస్తుంది మహిళలే. రాను రాను చేనేతకు ఆదరణ ఎలా తగ్గిపోతుందో తెలుసుకున్నా. మొత్తానికి చేనేత కార్మికుల జీవితాలను అర్థం చేసుకున్నా. అంత మంది ఆడవాళ్ళ బాధను తీర్చాలనే ఉద్దేశంతో మల్లేశం యంత్రాన్ని తయారు చేశారు. సాధారణంగా పిల్లలు తమ తల్లిదండ్రులకంటే మెరుగైనా జీవితాన్ని కోరుకుంటారు. కానీ ఆయన మాత్రం అందులోనే ఉంటూ, సమస్యలను అనుభవిస్తూ ఆ సమస్యకు పరిష్కారాన్ని కనిపెట్టడం గొప్ప విషయం. తన వారి కోసం తపించారు. ఆయన జీవితం నుండి చాలా నేర్చుకున్నా.
ఇప్పుడు మీ గురించి మాట్లాడుకుందాం... అసలు సినిమాల పట్ల మీకు ఆసక్తి ఎలా వచ్చింది?
ఎలా వచ్చిందో తెలియదు. చిన్నప్పటి నుండి కమల్‌హాసన్, చిరంజీవి, రవితేజ సినిమాలు బాగా చూసేవాడిని. వాళ్ళలా నటించాలని ఉండేది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆసు యంత్రాన్ని తయారు చేయాలని మల్లేశం గారికి ఎంత పిచ్చి ఉండేదో సినిమాల్లో నటించాలని నాకూ అంతే పిచ్చి ఉండేది. వయసు పెరిగే కొద్దీ ఆ కోరిక పెరుగుతూ వచ్చింది.
మరి ఇంట్లో ఏమీ అనలేదా?
ఎందుకు అనలేదు. చాలా అన్నారు. తల్లిదండ్రులుగా నా జీవితం ఏమౌతుందో అని వాళ్ళ భయం. మనకు ఇవన్నీ అసవరమా? మంచి ఉద్యోగం చేసుకోవచ్చు కదా అని వాళ్ళ బాధ. కానీ నేను మాత్రం పట్టుదలగా అవకాశాల కోసం ప్రయత్నించేవాడిని. ఫ్రెండ్స్‌తో కలిసి షార్ట్ఫిలిమ్స్ తీసి యూట్యూబ్‌లో పెట్టేవాడిని. ఇక నా ఆసక్తి చూసి ఇంట్లో కూడా ఒప్పుకున్నారు. వాళ్ళు ఒప్పుకున్న తర్వాత మరింత పట్టుదలతో ప్రయత్నించా.
మీ కుటుంబం గురించి చెప్పండి?
అమ్మ జయమ్మ, నాన్న పులికొండ సుబ్బాచారి. మా నాన్నది ఖమ్మం జిల్లా. నేను పెరిగింది, చదువుకుంది హైదరాబాద్. నాన్న ద్రవిడ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా చేసి రిటైర్ అయ్యారు. కవిత్వం కూడా రాస్తారు. మా చెల్లి నావీలో ఆఫీసర్. నేను సెంట్రల్ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ చేశాను.
ఇండిస్టీలో అవకాశాల కోసం ఏమైనా కష్టపడ్డారా?
చాలా కష్టపడ్డా. ఓ రకంగా యుద్ధం చేశానని చెప్పాలి. యూనివర్సిటీ నుండి బయటకు వచ్చిన తర్వాత నాలుగైదేళ్ళు బాగా తిరిగాను. ఇక ఆడిషన్స్ విషయానికొస్తే వందల సంఖ్యలో పాల్గొని వుంటాను. ఈ విషయంలో మాత్రం రవితేజ, విక్రమ్ నాకు ఇన్సిపిరేషన్. వాళ్ళు కూడా పది, పదిహేనేళ్ళ తర్వాతే సక్సెస్ అయ్యారు. మొదట టెర్రర్ సినిమాలో నటించినా గుర్తింపు ఏమీ రాలేదు. తర్వాత 'పెళ్ళి చూపులు' సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది.
ఆ సినిమాలో అవకాశం ఎలా వచ్చింది?
ఆ సినిమా డైరెక్టర్ తరుణ్ బాస్కర్ నా ఫ్రెండ్. తను కూడా షార్ట్ఫిలిమ్స్ తీసి డైరెక్టర్‌గా ఎదిగిన వ్యక్తి. 'పెళ్ళి చూపులు' సినిమాకు ఆడిషన్స్ జరుగుతుంటే వెళ్ళాను. సెలక్ట్ అయ్యాను. ఈ సినిమా ద్వారానే ఓ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్నాను.
ప్రతి సినిమాలో మీకంటూ ఓ ప్రత్యేకత చూపిస్తారు. అదెలా సాధ్యం?
అవకాశాల కోసం తిరుగుతున్నప్పుడే చాలా నేర్చుకున్నా. నటించడం మొదలుపెట్టిన తర్వాత నాకంటూ ప్రత్యేకత ఉండాలనుకున్నా. బాడీ లాంగ్వేజ్ కన్నా డైలాగులపై దృష్టి పెట్టా. మొదటి నుండి తెలంగాణ యాసలో మాట్లాడడం నాకో ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. దాన్నే కొనసాగించా. అదే ఇప్పుడు నాకు 'మల్లేశం' లో అవకాశం వచ్చేలా చేసింది.
సినిమాలో ఝాన్సీ మీ తల్లి పాత్ర చేశారు. ఆమెతో షూటింగ్ ఎలా అనిపించింది?
మొదట ఎఫ్2 సినిమా చేసినప్పుడు ఝాన్సీ గారితో పరిచయం. గలగలా మాట్లాడే వ్యక్తి. గొప్ప యాంకర్. ఇలాంటి సైలెంట్ పాత్ర చేస్తారా? అనే అనుమానం వచ్చింది. కానీ ఆమె ఈ పాత్రలో లీనమై పోయారు. 100 శాతం న్యాయం చేశారు.
భవిష్యత్‌లో హీరో పాత్రలే చేయాలనుకుంటున్నారా?
అలాంటిది ఏమీ లేదు. కామెడీ జోనర్‌ని మాత్రం వదలుకోను. మల్లేశం తర్వాత రిలేజ్ అయిన 'బ్రోచేవారెవరురా' సినిమా కూడా ఫుల్ కామెడీ సినిమా.
మొదట్లో సినిమాల్లో నటిస్తానంటే ఇంట్లో ఒప్పుకోవడం లేదు. ఇప్పుడేమంటున్నారు?
చాలా సంతోషంగా ఉన్నారు. మా అమ్మకైతే మొదట్లో అస్సలు నచ్చేది కాదు. కానీ మల్లేశం సినిమా ప్రివ్యూ చూసి బయటకు వచ్చిన తర్వాత కౌగిలించుకొని ఏడ్చేసింది.
మీ ఫ్యూచర్ ఎలా ఉండాలనుకుంటున్నారు?
ఇలాగే ఉండాలని ప్లాన్ ఏమీ లేదు. ఇప్పటి ప్రయాణం సంతోషంగా ఉంది. ఇలాగే కొనసాగాలనుకుంటున్నా. మంచి పాత్రలు వస్తే చేసుకుంటూ పోతాను.