Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీవితమంటే సుఖదు:ఖాల సమ్మేళనం. మనం అనుకున్నట్లే ఏదీ జరగదు. ఆటుపోట్లు సహజం. మనిషన్నాక విజయాలు వరించడమే కాదు... ఎదురుదెబ్బలు తగలడం పరిపాటే. ప్రతికూల పరిస్థితుల్లో మనోధైర్యాన్ని కూడగట్టుకుని ముందుకు వెళ్ళేవారే జీవితంలో విజయం సాధిస్తారు. అలాంటి వారిని వారి ఆత్మవిశ్వాసమే ముందుకు నడుపుతోంది. పరిస్థితులు అనుకూలించడం లేదంటూ కుమిలిపోవద్దు. నిరంతరం కృషితోనే విజయం సాధ్యమనే విషయాన్ని మరువద్దు.
అడ్డంకుల్ని అధిగమించాలి
జీవితంలో ఎదురయ్యే అడ్డంకుల్ని పెద్దగా భావిస్తే విజయం సాధించలేం. ప్రతికూల పరిస్థితుల దాపురించాయంటూ నిరాశ, నిస్పృహలతో జీవితాన్ని చేతులారా నాశనం చేసుకోవద్దు. లైఫ్‌లో సెటిల్ కావాలంటే సాధన అవసరం. లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానికి అనుగుణంగా కృషి చేస్తేనే సక్సెస్‌ను పొందగలం. ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కడం లేదనే నిరాశకు తావివ్వొద్దు. అనేక ప్రయత్నాలతోనే విజయం వరిస్తుంది. కొన్నిసార్లు జాక్పాట్లు తగిలినా వాటిని కూడా తేలికగా తీసుకోవద్దు. నిరంతరం కృషితో పొందిన విజయం, ఒక్కసారిగా మనముందొచ్చి వాలిన విజయం రెండింటినీ సమానంగా గౌరవించాలి. సాధించుకున్న దానిని కాపాడుకుంటేనే జీవితమంతా ఆనందంగా సాగుతుంది. లేదంటే నేడు ఉన్న వెలుగులు రేపు చీకట్లుగా మారొచ్చు.
కీలకమైన దశ ఇదే...
యుక్తవయసు అనేది మానవ జీవితంలో కీలకం. భవిష్యత్‌కు బంగారు బాట వేసుకునేందుకు ఈ దశ ముఖ్యమైనది. లైఫ్‌లో ఇది ఒక్కసారే లభిస్తుంది. గడిచిపోయిన ఈ కాలాన్ని కోరుకున్నా మళ్లీ చేతికి రాదు. ఇంతటి విలువైన యుక్తవయసులో సయమాన్ని వృథా చేయొద్దు. కెరీర్‌పై దృష్టి సారిస్తే జీవితమంతా సుఖమయంగా సాగుతుంది. లేదంటే కడదాకా బాధలు తప్పవు.
సమయాన్ని వృథా చేయొద్దు
కాలేజీ లైఫ్ జాలీగా గడుస్తుంటుంది. స్నేహితులలతో సరదా కబుర్లు, సినిమాలు, రెస్టారెంట్లు, షికార్లు తప్ప మరెలాంటి వ్యాపకం లేదన్నట్లు వ్యవహరిస్తుంటారు కొందరు. ఎంజారుమెంట్ మధ్య విలువైన సమయాన్ని వృథా చేస్తుంటారు. కాలేజీ తర్వాత లైఫ్‌ను ఎలా ప్లాన్ చేసుకోవాలో ఆలోచించరు. యుక్తవయసు అన్నాక సరదాగా ఉండకూడదని కాదు. వాటికి నిర్ధిష్ట సమయం మాత్రమే కేటాయించాలి. మిగతా సమయమంతా కెరీర్‌పై దృష్టి సారించాలి.
స్నేహితులతో షేర్ చేసుకోండి
చెడు స్నేహాలకు దూరంగా ఉండటమే ఉత్తమం. మంచి స్నేహాలు కలిగి ఉన్నవారు జీవితంలో విజయం సాధిస్తారనేది వాస్తవం. తమ లైఫ్ప్లాన్ ఏమిటో స్నేహితుల వద్ద ప్రస్తావించాలి. వారి నుంచి మీకు ఏదైనా మంచి సలహా దొరక్కపోదు. మంచి స్నేహితుడు తోటి స్నేహితుడి హితమే కోరుకుంటాడు కనుక హానికలిగించే సలహా ఇవ్వడు. మీకు అనర్థం కలగాలనే దురాలోచనలతో సలహాలు ఇచ్చేవారు అసలు స్నేహితులే అనిపించుకోరు. వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి.
స్ఫూర్తిగా తీసుకోవాలి
యువతలో కొందరు చదువులో మంచి ప్రతిభను కలిగి ఉంటే... మరికొందరు సాంస్కృతిక నైపుణ్యం కలిగి ఉంటారు. కొందరు ఆటపాటల్లో ఆరితేరితే... మరి కొందరు సాహసోపేతమైన విద్యలను ప్రదర్శింస్తుంటారు. అంగవైకల్యం, ఆనారోగ్యంలోనూ కొందరు విజయబావుటా ఎగురవేస్తారు. మరికొందరు పేదరికంలో మగ్గుతూ ఎలాంటి వనరులు లేకున్నా సక్సెస్‌ను సాధించి తీరుతారు. ఇలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. అందుకు అనుగుణంగా జీవితాన్ని మలచుకోవాలి.
కచ్చితమైన ప్లానింగ్ ఉండాలి
నిరంతర కృషి ఉంటే జీవితంలో లక్ష్యాలను సాధించుకోవడం సులువే. రోజుకు రెండు గంటలు సమయాన్ని కేటాయించుకుంటే నిర్దేశించుకున్న లక్ష్యాలు సాధించుకోవచ్చు. అదేలాగంటే... ఐదేండ్లలో మీ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రణాళిక తయారు చేసుకోవాలి. అనవసరమైన విషయాలను పక్కకు పెట్టేయాలి. చెత్తను బయటకు విసిరేసినట్లే మనలోని పనికి మాలిన ఆలోచనలను తొలగించుకోవాలి. విజయం మన కోసం ఎదురు చూస్తోందనే భావం ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి. అందుకు అనుగుణంగా ప్రయాణించాలి. ఉత్తమమైన కెరీర్‌ను ఎంచుకుని దాని ద్వారా జీవితాన్ని చక్కదిద్దుకోవాలనే ఆలోచన ఉన్నప్పుడే విజయం సాధించుకుంటారు. చదువు తర్వాత ఏదైనా మంచి వృత్తిలో స్థిరపడాలనుకునే వారికి పక్కా ప్రణాళిక అవసరం. కుటుంబ అవసరాలలు ఎలా తీర్చాలనే కచ్చితమైన ప్లానింగ్ ఉండాలి. ఎక్కువ డబ్బులు సంపాదించినా ఒకట్రెండు ఏండ్లలో మీరు వేసుకున్న మొదటి ప్రణాళికనే అమలు చేయాలి. వృత్తిని నిర్వర్తించడానికే ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. ఏదైనా వ్యాపారం మొదలెట్టినప్పుడు ఎక్కువ సమయం కేటాయించాలి. కుటుంబ అవసరాలు తీరాక మిగిలిన డబ్బులు వ్యాపారాభివృద్దికి మాత్రమే కేటాయించాలి. అనవసర ఖర్చులు చేయకూడదు.
నిపుణుల సలహాలు తీసుకోవాలి
ప్రపంచీకరణ నేపథ్యంలో వ్యాపార లావాదేవీలు ఎలా ఉండాలో అంచనాలు కలిగి ఉండాలి. వృత్తి ధర్మాన్ని సక్రమంగానే నిర్వర్తిస్తున్నానా... లేదా అని రోజుకు కనీసం రెండు గంటలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. లోపాలను సరిచేసుకుంటూ పోవాలి. ప్రోత్సహించే బంధుమిత్రుల వద్ద తమ ఆలోచనలు చర్చించాలి. వారి నుంచి సూచనలు, సలహాలు స్వీకరించాలి. వారాంతపు సెలవుల్లో కుటుంబానికి కనీసం ఐదు గంటలు కేటాయించాలి. జీవన ప్రమాణాలు, భవిష్యత్, ఆర్థిక ఎదుగుదల, వృత్తి అనుభవాలను పంచుకోవాలి. కుటుంబ సభ్యుల ఆలోచన విధానాలను క్రమబద్దీకరించుకుని అవసరమైన చోట మీరు వాటిని ఉపయోగించుకోవచ్చు. వృత్తిని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకునేందుకు నిపుణుల సలహాలు, సూచనలు పాటిస్తూ ఉండాలి.