Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రక్త సంబంధాలను తల్లిదండ్రులు మనకు అందిస్తారు. స్నేహితులను మాత్రం మనమే ఎంచుకుంటాం. మంచి స్నేహాన్ని సంపాదించుకుని భద్రంగా కాపాడుకుంటే అది మన జీవితాన్ని సంతోషంగా ఉంచుతుంది. స్నేహం అనేది ఇలా ఉండాలి... అలా ఉండాలి అంటూ ఓ నిర్ధిష్ట లెక్కలు, అంచనాలు ఉండవు. మనలా ఆలోచిస్తూ మనకు గురువులా బోధించి, దారి చూపి, తప్పు చేసినప్పుడు మందలించే వ్యక్తులు నిజమైన స్నేహితులు. మంచి స్నేహితుల మధ్య ఎలాంటి మొహమాటాలు, రహస్యాలు ఉండవు. అవసరమైనప్పుడు నిస్సంకోచంగా తమ కష్టసుఖాలు ఒకరికొకరు పంచుకుంటారు. కష్ట సమయంలో కలత చెందిన మనసుకు వెన్నలా చల్లదనాన్ని, ప్రశాంతతను కలిగించే అద్భుతమైన ఔషధం స్నేహం.
తమకు అవసరమైనప్పుడు కనీసం మాట సాయం చేయడానికైనా ఆప్తమిత్రులు ఉన్నారనే భావం మన కష్టాల తీవ్రతను తగ్గిస్తుంది. వారితో చర్చించి సమస్యకు పరిష్కారం కనుకొనాలనే ఆలోచనను కూడా కలిగిస్తుంది. ప్రతిరోజూ మాట్లాడుకోకున్నా అవసరమైనప్పుడు మనకు ధైర్యం, ఓదార్పు చెప్పే, తప్పొప్పుల ఎంపిక చేసి మార్గనిర్దేశం చేసే నేస్తం ఉన్నాడనే నమ్మకం మనకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఒక్కోసారి కుటుంబ సభ్యులతో కూడా చెప్పుకోలేని సమస్యలను ఆత్మీయ స్నేహితులతో నిర్మొహమాటంగా చర్చించొచ్చు. ఈ స్నేహం అనేది ఇద్దరు పరిచయస్తుల మధ్య మాత్రమే ఉండే బంధం కాదు. కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు... ప్రతి వ్యక్తిలోనూ ఉండాల్సిన ముఖ్యమైన భావన. స్నేహమనేది ఉన్నప్పుడు కుటుంబ సభ్యుల మధ్య పొరపచ్చాలు తగ్గి ఒకరినొకరు అర్థం చేసుకుని మసులుకునే అవకాశాలు మెండుగా ఉంటాయి. దీని వల్ల సమస్యలు తీవ్ర రూపం దాల్చకముందే పరిష్కారమవుతాయి.
స్నేహంగా ఉన్నప్పుడు అనుమానం, కోపం, ద్వేషం కూడా దరిదాపులకు రావడానికి జంకుతాయి. అయితే... ఈ స్నేహం కూడా దుర్వినియోగమయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. అందరినీ స్నేహితులని నమ్మి మోసపోవడం కంటే ముందే జాగ్రత్త పడడం మంచిది.