Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనిషి అన్నాక కొన్నింటిని తప్పక పాటించాలి. వాటిలో రిలేషన్షిప్ ఒక్కటి. లైఫ్‌లో రిలేషన్షిప్ పాత్ర ఎంతో కీలకం. బంధాలు, అనుబంధాలు లేని జీవితం వ్యర్థం. అందుకే వీటిని కచ్చితంగా పాటించి తీరాలి. పది కాలాలపాటు బంధాలను నిలబెట్టుకోవాలి. జీవితాన్ని ఒడిదుడుకులు, ఆటుపోట్లు, ఆటంకాల నుంచి కాపాడుకోవడానికి ఇవి ఎంతో దోహదపడతాయి. మానవ సంబంధాలు మెరుగుపర్చుకుంటేనే జీవితం సాఫీగా సాగుతుంది. ముఖ్యంగా ఈ విషయంలో యువత ముందుండాలి. జీవితంలో స్థిరపడే వయసు, సమయం ఇదే కాబట్టి బంధాల విలువ తెలుసుకోవాలి.
ఎప్పుడూ బిజీ బిజీ... రోజుకు 24 గంటలు చాలడం లేదు... పక్కవారితో మాట్లాడే సమయం కూడా ఉండదు. ఇక వారితో బంధాలను కొనసాగించే అవకాశం ఎక్కడిది. ఫోన్లు, వాట్సాఫ్‌లు, ఫేస్‌బుక్‌లు, ట్విట్టర్లు, వీడియో గేమ్‌లు ఇదే జీవితంగా మారిపోయింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని అనివార్య కారణాల వల్ల కుటుంబ సభ్యులతో కలిసి మెలసి ఉండటమనేది సర్వసాధారణం. కానీ మన చుట్టూ ఉన్న సమాజంతోనూ సత్సంబంధాలు ఏర్పర్చుకోవడం ప్రధానం.
కలుపుకుపోవాలి
ఫ్రెండ్షిప్తోనే రిలేషన్షిప్ బలపడుతుంది. కాబట్టి దీనికి అత్యంత ప్రధాన్యం ఇవ్వాలి. చేతిలోని సెల్‌ఫోన్ కాసేపు పక్కన పెట్టి పక్కవారితో కలుపుగోలుతనాన్ని అలవర్చుకోవాలి. చిన్నాపెద్ద తేడా లేకుండా ప్రతిఒక్కరితోనూ కలసిమెలసి ఉండాలి. మనకన్నా వయసులో పెద్ద వాళ్లతో స్నేహం చేయాల్సి వస్తే వారి గౌరవానికి భంగం కలగకుండానే సత్సంబంధాలు కొనసాగించాలి.
ఆత్మీయ దృక్పతం ఉండాలి
మనిషికి మనిషితో ఎన్నో అవసరాలు ఉంటాయి. వాటికి ఆటంకాలు కలగొద్దంటే మానవ సంబంధాలు తప్పనిసరి. అవసరాలంటే ఆర్థికపరమైనవి మాత్రమే కావని గుర్తుపెట్టుకోవాలి. ఇతరుల సలహాలు, సూచనలు స్వీకరించడం, వారి అనుభవాల నుంచి జీవిత పాఠాలు నేర్చుకోవడం, వారు చూపిన మార్గాన్ని అనుసరించి జీవితాన్ని సెటిల్ చేసుకోవడం, వారి సిఫార్సుల మేరకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందడం లాంటివి కూడా అవసరాలే. ఇవన్నీ తీరాలంటే ఆత్మీయ దృక్పథం కలిగి ఉండాలి.
కాస్త మనసు పెడితే
కొత్తగా కాలేజీలో మీరు అడుగుపెట్టారు. లేదా కోరుకున్న ఉద్యోగం సొంతం చేసుకున్నారు. అయితే అక్కడి వాతావరణం మీకు కొత్త. మనుషులంతా భిన్న వ్యక్తిత్వం గలవారు ఉంటారు. వీరందరితో ఎలా మెలగాలి..? అనే ఆలోచన మిమ్మల్ని కలవరపర్చొచ్చు. దీనికి మీరు కంగారు పడాల్సిన పనిల ఏదు. మీ చుట్టూ ఉన్న వారి మనసు గెలుచుకోవడం సులువే. కాస్త మనసు పెట్టి ప్రయత్నిస్తే ఎవరికైనా సాధ్యమే. ఫ్రెండ్షిప్ చేయడానికి మీకు ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. అయితే... దానికి మీకు ఉండాల్సిన అర్హత ఒక్కటే. మీలోని మంచి మనస్తత్వమే ఎదుటి వారిని ఆకట్టుకునేలా చేస్తుంది.
చిన్న చిరునవ్వుతో...
అందరినీ ఆకట్టుకోవాలంటే మీలో ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ చిరునవ్వు. ఎదుటి వాళ్లతో మాట్లాడేటప్పుడు నవ్వుతూ పలకరిస్తే.. ఈజీగా మిమ్మల్ని ఇష్టపడతారు. మీకు స్నేహితులవుతారు. చిన్న చిరునవ్వుతో ఎవరి మనసైనా దోచుకోవచ్చు. అలాగే మీ గురించి పూర్తి వివరాలు వారికి తెలియజేయండి. వారి గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి. కొన్ని చెప్పుకోలేని వ్యక్తిగత విషయాల జోలికి మాత్రం పోవద్దు. ఎదుటి వారి అభిరుచులు తెలుసుకుని దానికి అనుగుణంగా వ్యవహరిస్తే వారు మీతో ఎక్కువ సేపు మాట్లాడటానికి సమయం కేటాయిస్తారు.
మంచి సంభాషణతోనే...
ఎదుటి వాళ్లు మాట్లాడేటప్పుడు శ్రద్ధగా వినాలి. ప్రతి మాటా ఆలకించాలి. వారు పలకరించినపుడు మీరు ఫోన్ మాట్లాడుతున్నట్లయితే మధ్యలోనే కట్ చేసి మీరు చెప్పదల్చుకున్న విషయాలు ప్రస్తావించడం మొదలుపెట్టొద్దు. దీంతో వారికి చిరాకు కలుగుతుంది. మంచి సంభాషణతోనే సత్సంబంధాలు బలపడతాయనే విషయాన్ని ఎన్నటికీ మరువద్దు.
గుర్తుపెట్టుకోవాలి
ఎవరైనా ఒకసారి పరిచయమయ్యారంటే వారి పేర్లు గుర్తుపెట్టుకోవాలి. మళ్లెప్పుడైనా వారు తారసపడితే పేరు పెట్టి పలకరించాలి. మాట్లాడే క్రమంలో కూడా పేరు ప్రస్తావిస్తూ ఉండాలి. అప్పుడే ఎదుటి వ్యక్తిని మీరు ఆకట్టుకుంటారు. తనకు మీరు విలువ ఇస్తున్నట్టు ఆ వ్యక్తి భావిస్తాడు. తద్వారా మిమ్మల్ని అభిమానిస్తారు.
వెంటనే స్పందించాలి
ఎవరైనా మిమ్మల్ని సలహాలు అడిగితే వెంటనే స్పందించాలి. మంచి సూచనలు ఇచ్చి సహకరించాలి. అయితే... అడగకపోయినా చీటికీమాటికి సలహాలు ఇవ్వడం కొందరికి నచ్చదు. మీ అంతట మీరు సలహాలు, సూచనలు ఇస్తే మీ మీద చెడు అభిప్రాయం మొదలవుతుంది. ఆధిపత్యం చెలాయిస్తున్నారన్న అపోహ కలుగుతుంది. మిమ్మల్ని ఏదైనా విషయం అడగటానికి ఎవరైనా సిద్ధమైతే మీరు అత్యంత ఆసక్తి చూపాలి. అప్పటి వరకు మీరు ఫోన్లో మాట్లాడుతున్నా సరే. వెంటనే ఫోన్ కట్ చేసైనా ఎదుటి వ్యక్తి చెప్పేది ఆసక్తిగా వినండి. అప్పుడే మీరంటే అభిమానం పెరుగుతుంది.
సూటిగా చూసి మాట్లాడండి
ఎదుటి వ్యక్తులను ఆకర్షించాలంటే... ఏ విషయంలోనూ కంప్యారిజన్ చేయకండి. ఎదుటివాళ్లు చెబుతున్న అంశాలు విని తెలుసుకోండి. అనవసరంగా మీ విషయాలతో పోల్చడం వల్ల ఎదుటివాళ్లు ఇబ్బందిగా ఫీలవుతారు. అలాగే ఇతరులతో మాట్లాడేటప్పుడు ఐ కాంటాక్ట్ కరెక్ట్‌గా ఉండాలి. సూటిగా కండ్లలో చూసి మాట్లాడటమంటే మీరు ఆ సంభాషణకు అత్యంత ప్రాధాత్యం ఇస్తున్నట్టు.
అంగీకరించే గుణం
ఒక్కొక్కరి అభిప్రాయం ఒకోలా ఉంటాయి. కాబట్టి ఎదుటివాళ్లను అంగీకరించే గుణం అలవరచుకోవాలి. ఇతరులను వేలెత్తి చూపకండి. కొన్ని సందర్భాల్లో మీ అభిప్రాయాలు వాళ్ల ఆలోచనలు వేరుగా ఉంటాయి. మీరు చెబుతున్నా తప్పని వాళ్లు వారించొచ్చు. అలాంటి సందర్భంలో మీకు నష్టం లేనపుడు వాళ్ల అభిప్రాయంతో ఏకీభవించడం మంచిది.