Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నీ చుట్టూ పరిభ్రమించే ఆ పరిమళం నన్ను స్పృశించి ఎన్నాళ్ళయిందో.. మళ్ళీ ఇవాళ మనసంతా పరుచుకుంది. ఆకాశమంత ప్రేమను గుండెల్లో దాచుకొన్న నిన్ను కలవడం నాకెప్పుడూ సంతోషాన్నే కలిగిస్తుంది. ప్రతీ క్షణాన్ని అమృతతుల్యంగా ఒడిసిపట్టు కుంటాను.
మనం గడిపిన జ్ఞాపకాలూ, కలబోసుకున్న ముచ్చట్లూ, పొందిన అనుభూతులూ పొల్లు పోకుండా గుర్తుపెట్టుకొనే నీ గొప్పతనం నన్నెపుడూ అబ్బురపరుస్తుంది. నామీద నీకున్న అమితమైన ప్రేమను అవి పట్టి చూపుతాయి. ఇంతటి నీ ప్రేమకు అర్హున్ని కావడమే నాకు దక్కిన భాగ్యం. ఆ ప్రేమ ముందు అందుకే సాష్టాంగ పడతాను. నిజంగా నీది నూటికి నూరు పాళ్ళూ స్వచ్ఛమైన ప్రేమ. ఆ కాంతిలో నేను ఆనందంగా అడుగులు వేస్తున్నా.
ఇవాళ నీలి రంగు చీరలో నువ్వెంత ముద్దుగా ఉన్నావో తెలుసా? అమాంతం హత్తుకొని, ఎత్తుకొని గిరగిరా తిప్పాలన్న ఆశను బలవంతంగా అణుచుకున్నానులే. అన్నింటికన్నా మిన్నగా నీ చిరు స్పర్శ నన్ను వివశుణ్ణి చేస్తుంది. ఎవరన్నారు శారీరక స్పర్శ గొప్పది కాదని. మనసూ మనసూ కలిసిన మైమరపూ, తనువు తనువూ తాకిన మైకమూ మనల్ని మరో లోకం మెట్లు ఎక్కిస్తాయి కదూ!
నా చెవిలో మాటిమాటికి ''నీతో వచ్చేస్తా'' అంటుంటే ఈ హృదయమెంత బరువెక్కిందో ఆ క్షణం నీకు మాటల్లో చెప్పలేక నా ఆశక్తతకు సిగ్గు పడుతుంటాను. నువ్వలా అంటుంటే ఏం చెప్పాలో తోచని స్థితిలోకి వెళ్ళి పోతాను. ఓరు! ఏమాత్రం చిన్న అవకాశం ఉన్నా చందమామ కథలో రాజకుమారుడిలా రెక్కల గుర్రం మీద వచ్చి నిన్ను ఎత్తుకు పోనా!?
అయినా నాకు మాత్రం లేదా నువ్వు ఎప్పటికి నాతోనే ఉండాలని. అలా ఉండగలిగితే నా ఎడారి బతుకు ఎంత వెలిగిపోతుందో నాకు తెలియదా చెలీ!
ఈ జీవన సాగర మధనంలో మనకు హాలాహలమే దక్కినా... అమృతంగా మార్చుకుంటున్నాం కదూ! గడిచిపోయిన శిశిరపు బతుకులు మనకసలే వద్దు బంగారం! శేష జీవితాలయినా వసంతాలుగా పూయనిద్దాం. నా ఉన్నతికై నిరంతరం తపించే నీ ముందు నాకు ''దాసుడి'' లా ఉండటమే నాకిష్టం. నా ఇష్టాన్ని కాదనకు. ఎన్నటికీ అపురూప బంధం మనది. చివరి శ్వాస దాకా కమనీయంగా సాగాలి. ఏది ఏమైనా మన ప్రతి సంగమాన్ని హృదయంగమంగా మరుస్తూ ప్రేమామృతాన్ని నా జీవితంలోకి ఒంపుతున్న నీ సౌజన్యానికి నా ''సలాం''!
-వెన్నెల సత్యం
9440032210