Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పొద్దు పొద్దున్నే
మంచు బిందువులతో
నిలువెల్లా అలంకరించుకున్న
పచ్చికనడగాలి
తన సౌందర్య రహస్యమేమిటో..?
పొద్దు గూకితే చాలు
ఆకాశం అమ్మాయిలా మారి
చుక్కల పూలు కొప్పులో తురిమి
జాబిల్లిని హారంగా వేసుకుని
వెన్నెల చీర కట్టుకున్న
నింగి నడగాలి
తన అందచందాల ఆంతర్యమేమిటో..!!
మేఘం కరిగితే చాలు
చిటపట చినుకుల సంగీతానికి
తరువులన్నీ తలస్నానాలాడటమే కాదు
తమకొచ్చిన నాట్యాలన్నీ చేసేస్తుంటారు
అవని వేదికపై జరిగే ఈ అద్భుతానికి
మట్టి చప్పట్లు కొడుతుంటే వచ్చే
పరిమళాల్ని అడగాలి
ఈ పరవశాల గుట్టేమిటో చెప్పమని...?
స్పందించే మనసుంటే చాలు
మనిషి స్వర్గాన్ని నేల మీదే చూడొచ్చు
ఆస్వాదించే గుణముంటే చాలు
అవని మీదే అద్భుతాలు వీక్షించవచ్చు
ప్రేమించే మనసుంటే చాలు
ప్రకృతి కంటే సౌందర్యరాశి
ప్రపంచంలో మరెక్కడా లేదు..!!
- యు. లక్ష్మీ నరసింహా గౌడ్
7702280542