Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓనా! సుందర హృదయారవిందమా!
మన చూపులపై ఎన్ని పొరలను పరచి వుంచిందో కదా ఈ మనుష్య సమూహం. అందుకే నేను నిన్ను చూడటానికి హృదయాన్ని ఆశ్రయించాను. ప్రేమను ప్రేమగా ప్రేమించని ప్రేమలు ఎందుకు చెప్పు. ప్రేమను ప్రేమగా చూడలేని చూపులు మాత్రం ఎందుకు! ఈ చూపులకు ఎన్ని రంగుల తెరలు! ఇన్ని రకాలుగా ప్రేయసిని చూసే చూపుల్లో ప్రేమరహిత గుణాలు నింపుకుని, కులాల పొరల్లోంచి మతాల తెరల్లోంచి, అంతస్తుల అరల్లోంచి చూసేచూపు ఎంత కళావిహీనమో కదా! ఎంతటి అసౌందర్య వీక్షణమో కదా! చూపుల్లోకి పాతిన తెరలను, పొరలను తవ్వి పారేసేందుకే మనం ఏకమవ్వాలి ప్రియా!
నువ్వన్నావు చూడు 'ప్రేమను పరిశీలించేందుకు నాలోకి నేను ప్రశ్ననై పరీక్ష నిర్వహిస్తానని' ఆ మాటలో ఎంత నిజాయితీ, ఎంత ఆత్మవిమర్శనా చైతన్యం. అది నాకూ ఓ పాఠమై నిలిచింది. అవును ఎవరికి వారే తమను తాము పరీక్ష నాళికలోకి ప్రవహించుకోవాలి. మనస్సును శుభ్రంగా స్నానించుకోవాలి. ఇదంతా ఇతరుల కోసమని అనుకోరాదు. మనల్ని మనం మనుషులుగా నిలబెట్టుకోవటానికి నిత్యం ఈ ప్రక్షాళ జరుగుతూనే ఉండాలి. లేకుంటే మానవీయ చూపు మందగిస్తూనే ఉంటుంది.
మనల్ని మనం ప్రేమించుకోవాలన్నా ఇతరులను ప్రేమించాలి. ప్రేమ ఇస్తేనే పెరుగుతుంది. ఎదుటి వారిని ప్రేమిస్తున్నది వాళ్ళ కోసం కాదు. అది మన కోసమే. ప్రేమించిన మనసే నిండుకుండలా వుంటుంది. పరిమళ భరితమై ఆనందిస్తుంది. సంతృప్తమౌతుంది.
సఖీ! ''ప్రేమంటే దివ్య సౌందర్యానుభూతి కోసం మానవ మనసు అర్రులు చాచడం. సౌందర్యాన్ని దర్శించడమే కాక, సృజించడం. అమరత్వాన్ని సాధించడం. అందుకే లోకంలో స్త్రీపురుషులు పరస్పరం ప్రేమించుకుంటారు. అందుకే తల్లిదండ్రులు తమ సంతానాన్ని ప్రేమిస్తారు. వారుకనేది కేవలం సంతానాన్నే కాదు సౌందర్యాన్వేషణలో తమ భాగస్వాములను, తమ వారసులను, అన్వేషకులను. ప్రేమ ద్వారా మనం శాశ్వతం చేసుకుంటున్న ఈ సౌందర్యం ఏమిటి? అది వివేకం, సచ్ఛీలం, ఆత్మగౌరవం, ధైర్యం, న్యాయం, విశ్వాసం, ఒక్కమాటలో చెప్పాలంటే సౌందర్యమంటే సత్యం'' అని క్రీస్తుపూర్వమే సోక్రటీస్ బోధించాడు కదా! అట్లాంటి సౌందర్యాన్ని, సత్యాన్ని చేరుకోవడానికి ఎంత స్వచ్ఛమనసును నిర్మించుకోవాలో మనం!
ప్రేమకు కొన్ని హద్దులను, దారులనూ ఏర్పరచిన నేటి సామాజిక చట్రంలోంచి ఉన్నతమైన ప్రేమను చూడగలగటమనేది ఒక సవాలుగానే కనిపిస్తున్నది. చెరిగి పోవాల్సిన మతం గీతలు మరింత పెరిగిపోతున్నాయి. కరిగి కలవాల్సిన కులం హద్దులు మరీ పైకి లేస్తున్నవి. రాజ్యం కూడా వీటికి ఆజ్యం పోస్తున్నది. నేడు ఎవరైనా ఒకరిని చూస్తున్నపుడు ఒక మనిషిగా చూడటమే మానేశాడు. వాణ్ణి ఏదో ఒక కులం వాడిగానో, మతం వాడిగానో చూడటమే నేటి చూపుకు అర్థంలా మారింది. ఇవేవీ లేకుండా మనుషులంతా బ్రతకలేమా? వేరే కులం హృదయానికి ప్రేమను పంచిందని దారుణంగా చంపటం ఎంతటి దుర్మార్గం! ఎంతటి హేయమైన చర్య! ఇది మన కళ్ళముందే జరుగుతోంది కదా!
ప్రపంచంలో ఎక్కడా లేని ఈ కుల విభేదాలు హైందవ మతం పెంచి పోషించిన ఫలితంగా మనుషులను విభజించింది. హీనం, ఉన్నతమనీ చూస్తున్నది. నిత్యం శ్రమ చేస్తూ, ఈ ప్రపంచాన్ని శుభ్రపరిచేవాళ్ళను మరింత హీనమని వివక్షతకు గురిచేస్తున్నది. అమానవీయమైన ఈ భావనలన్నీ మన మెంత వద్దనుకున్నా మన మీదెక్కి స్వారీ చేస్తున్నాయి. సౌందర్యానందభరితమైన ప్రేమను కూడా మురికి మయం చేస్తున్నది.
అందుకే ప్రియా! మన చూపులపై అలుముకున్న తరతరాల అంతరాల పొరలను తెంచి నూతన దృష్టికోసం సమష్టి కృషి చేయాలి. ప్రేమను ప్రేమగా నిలుపుకోవడానికి చేస్తున్న ప్రయత్నమిది. నీ జ్ఞాపకాల కలల్ని కళ్ళ నిండా నింపుకున్న వాణ్ణి, ఒక స్వచ్ఛమైన చూపుతో, సౌందర్య పిపాసినై స్వర్ణ వర్ణితమైన ఉషస్సును తిలకిస్తాననే విశ్వాసంతో....
నీ ప్రియసఖుడు
- ఆనందాచారి,
9948787660