Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కథకు కాళ్ళు లేవు, ముంతకు చెవులు లేవు' అనే మాటోటి వుంది. చిత్రంగా ఈ కాళ్ళు లేని కథలన్నీ దొర్లుకుంటూ కంచికి వెళ్తాయంటారు. ఎన్ని కథలని సంచిలో మోస్తుంది కంచి. ఒకదాని వెనుక ఒకటి వచ్చేస్తూ వుంటే మోయలేక ఉసూరుమంటూ కింద కూలబడ్డట్టుంది. ఇక లాభం లేదు, కంచిలో జాగా లేదని కథలన్నీ ఇతర దారులు వెదుక్కోసాగినయి. కొన్ని కథలు మీడియా బుర్రలో దూరినయి. అందువల్ల ఇప్పుడు వార్తలకి బదులు కట్టుకథలు పుట్టుకొస్తున్నాయి. కొన్ని కథలు యూట్యూబులో రాజ్యమేలుతున్నయి. గూగుల్లోనూ, వాట్సప్‌లోనూ స్వేచ్ఛావిహారం చేస్తున్నయి. ఇప్పుడు ఏవి వార్తలో, ఏవి కట్టుకథలో, ఏవి పుట్టుకథలో తెలుసుకోవడం నరమానవులకు అసాధ్యం! ఇక అనేక కథలు టీవీ సీరియళ్ళుగా అనేకానేక కొంపల్లోకి వీధి రౌడీలల్లే, అచ్చోసిన ఆంబోతులల్లే జొరబడుతున్నయి.
కాలమ్ రాద్దామని కూచున్నానా.. కలం క్యాప్‌లో నుంచి నా సూక్ష్మరూపం బయటికి వచ్చి కాగితం మీద కూర్చుంది. 'ఎవడ్రా నువ్వు?' అంటే, నీ మనస్సుని రా అంటుందని అర్థమయింది. ఏమిటి సంగతి? అన్నట్టు మాట్లాడ కుండా కనుబొమ్మలు ఎగరేశాను.
నలభైయేళ్ళ నుంచీ కాలమ్‌లకు కాగితాలు ఖర్చు చేస్తున్నావు కదా. దాదాపు దశాబ్ద కాలం నుంచి 'చౌరస్తా' లో నిలబడ్డావు కదా. రాజకీయాల మీద, నాయకుల మీద నువ్వు కురిపించిన అక్షరాల వర్షం దున్నపోతు మీద కురిసిన వానే కదా. ఏమిటి ప్రయోజనం? దిగజారుడే కాని ఎగబాకుడు ఎక్కడైనా వుందా? అనడిగాడు సూక్ష్మరూపంలో వున్న సుదర్శన్.
ఏదైనా ఆలోచన రావాలన్నా, మాటలు వెదుక్కోవాలన్నా ధారాళంగా నోరు తెరవాలన్నా ఎవరైనా ఏం చేస్తారు? బుర్రే కదా గోక్కుంటారు. నేనూ ఆ పనే చేశాను.
కాస్త విపులంగా, విస్తారంగా, విశృంఖలంగా, మనసు తీరా తల గోక్కుంటే సెటైరుకి బదులు షార్టు స్టోరీ రాయగలవు. ఈ జమానాలో నిష్టూరంగా వుండే నిజాలకన్నా నికార్సయిన వార్తలకన్నా, అబద్దాలకు, పుక్కిటి పురాణాలకూ, అదిగో పులీ ఇదుగో తోకకూ డిమాండు ఎక్కువ. అందువల్ల తమరివ్వాళ్ళ ఓ కథే రాస్తున్నారు అన్నాడు ధీమాగా సుదర్శన్ మనస్సాక్షి.
కథా... దానికి చాలా సరుకూ సరంజామా కావాలి. నేనేది రాసినా సెటైరే అవుతుందన్నారు చేకూరి రామారావు గారు 'చేరాతల్లో'. నా కథల పుస్తకం 'అమృతం కురవని రాత్రి'కి ముందు మాట రాస్తూ నా కథలన్నీ సెటైర్లే అన్నారు అంపశయ్య నవీన్. లాభం లేదు నేను 'చౌరస్తా'కు కాలమ్ రాస్తానంతే అన్నాను.
ఈసారికి నా మాట విను బ్రో. నీకు కావాల్సిన సరుకు సరంజామా నేనందిస్తాను అని మనసు అంటుండగానే బాగా లావూ ఎత్తూ వున్న ఓ ఆకారం నా ముందుకు వచ్చి నిలబడ్డది.
ఎవడు వీడు అని అరుద్దామనుకున్నా కానీ, కథ రాయకపోతే తన్నడానికి పిలిపించాడేమోనని భయపడి 'ఎవరు వీరు?' అన్నా లో గొంతుకతో.
'నీ కథకు బాగా కావలసిన వాడు. కమ్యూనిజమ్, సోషలిజమ్ అనే పదాలు వినిపించే చోట ఇప్పుడు వినిపిస్తున్నది 'విలనిజమ్'. వ్యక్తులు ఇజాలకు తమ పేర్లు పెట్టుకుంటున్నారు కదా. ఈ విలనిజం బాగా తెలిసిన వాడు నీ కథలోకి విలన్‌గా పనికొస్తాడు చూస్కో. అబద్దం, అన్యాయం, అధర్మం, మోసం, కుట్ర, కసి, కపటం, నమ్మక ద్రోహం వంటి సుగుణాలెన్నో వున్నవాడు. కోపం వస్తే 'తియ్యండ్ర బండ్లు, లేపెయ్యండ్ర, బాంబులు పెట్టి పేల్చెయ్యండ్ర' అన్న మాటలు వాడుక భాష వీడికి. మనుషుల్ని చంపించడం వీడి హాబీ. నువ్వు కథలోకి తీసుకో... విశ్వరూపం చూపిస్తాడు' అన్న మనశ్శరీరం వైపు చూస్తూ 'నాకు విలన్ అక్కర్లేదు. సాదాసీదా కథ రాసుకుంటాను. రాయాల్సివస్తే వినయం, విధేయత, జాలి, కరుణ, కర్తవ్య నిర్వహణ, సాటి మనిషికి సాయపడే మనస్తత్వం, మానవత్వం మూర్తీభవించిన కథానాయకుడు కావాలి నాకు' అన్నాను.
ఈ పదాలకు అర్థాలు డిక్షనరీలోనే వుంటాయి అంటూ నవ్వాడు ఆత్మారాముడు. పిచ్చోడా ఆ కాలం చెల్లిపోయింది. ఎంత పవర్ఫుల్ విలన్ వుంటే అంత మంచి కథ అవుతుంది. హీరోకేముంది ఒక్క చివరాఖరి సీను తప్ప. మొత్తం ఎంజారు చేసేది విలనే. ఈ కాలపు కథల్లో విలనే హీరో, అధర్మమే జయం. కాదూ కూడదూ కథానాయకుడే కావాలంటే ఒక్కొక్కణ్ణి కాదు, వందమందిని పంపినా ఎముకలు ఏరేసే బక్కచిక్కిన పొట్టి కథానాయకుడ్ని పిలిపిస్తాను. అయినా హీరోదేంలే, ఎవరో ఒకడవుతాడు కథ ముగించడానికి. అసలు వున్నదంతా విలనే! కథ నిండా అతనే. అతను 'హరీ' అంటే కథ అయిపోయినట్టే. కథానాయకుడి క్రేజ్ వదిలెరు. ఆ కాలం నుంచి ఈ కాలం దాకా కథలన్నీ విలన్లవల్లే పకడ్బంధీగా నిల్చున్నాయి. అన్నా దర్మజా! అయిదూళ్ళేంటన్నా! అగ్రజుడివి ఈ సామ్రాజ్యమే నీది. మా నూరుగురు సోదరులకు నెలనెలా 'పెన్షన్' మంజూరు చేస్తే చాలు అని సుయోధనుడన్నాడనుకో, మహాభారత కథ ఉండేదేనా? రామా, శ్రీరామా, జగదభిరామా, కోదండరామా.. ఐయామ్ వెరీ సారీ! బుద్ది గడ్డి తిని నీ భార్యని ఎత్తుకొచ్చినందుకు ఇరవై చెంపలూ వేసుకుంటాను. పుష్పకవిమానం ఇస్తాను. మీరూ, మీ ఆవిడా దారంట ఊళ్ళు చూసుకుంటూ కులాసా కబుర్లు చెప్పుకుంటూ అయోధ్యకు వెళ్ళిపొండి అని ఆ పదితలలవాడు అని ఉంటే రామాయణ కథ సున్నా కదా! మగ విలన్‌తో వేగలేనని నువ్వనుకుంటే ఆడ విలన్లకూ కరువేం లేదు కథల్లో. మెట్ల మీద నూనె పోయడం, మసిలే సాంబారులో విషం కలపడం వంటి అనేక కళలు తెలిసిన వారున్నారు. కావాలా? అంది మనస్సాక్షి.
నిజమే! ఎన్నో మంచి లక్షణాలు వుండీ విలన్ అయిన వారి కథలు గొప్ప కథలయ్యాయి కానీ అనేక అవలక్షణాలున్న విలన్లు, కంటిచూపుతో, చిటికెన వేలితో చంపిన వాళ్ళనే మళ్ళీ మళ్ళీ చంపేసే కథానాయకుల కథలు రాయను. నువ్వూ, విలనూ మాయమైపొండి అంటూ పెన్ను మూత పెట్టేశాను. కాలమ్ పూర్తయింది.
- చింతపట్ల సుదర్శన్, 9299809212