Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనగనగా ఓ పిల్లి. ఆ పిల్లికి మూరెడు మీసమూ, బారెడు రోషమూ వున్నయి. అది నడిచేటప్పుడు అడుగుల చప్పుడు వినపడదు కానీ 'ముయ్యావ్' అనడం మాత్రం మానదు. అదే దాని 'వీక్నెస్'. అదలాగ పిల్లిలాగే నడుస్తూ ఇంట్లోకి జొరబడి పాలూ, పెరుగూ, వెన్నా, నెయ్యీ వంటి డైరీ సామాగ్రి కోసం వెతుకుతూ వుంటుంది. ఇదివరకు మట్టిపొయ్యిలుండేవి. వాటిల్లో వెచ్చగా పడుకునేది బారెడు పొద్దు ఎక్కేదాక. ఇంట్లో వాళ్ళు లేపేదాకా మొద్దు నిద్దుర పోయేది. కానీ ఇప్పుడు గ్యాసు బండ మీద పడుకోటానికి భయపడి పొయ్యి నిద్ర మానేసింది. దాని అదృష్టం కలిసొచ్చినప్పుడు కిచెన్ అరుగుమీద ఎవరన్నా ఏమరుపాటున గిన్నెల్లో పాలో, పెరుగో వుంచితే... ఎవరూ తనకు కనపడకుండా తల దూర్చి మూతి తుడుచుకుంటూ వెళ్ళిపోయేది.
ఈ మధ్యన జనం బాగా తెలివి మీరిపోయారు కదా. పాలూ, పెరుగూ ఫ్రిడ్జిల్లో దాచేసుకుంటున్నారు. ఎంగిలి చేత్తో కాకికి అన్నం విసరని వాళ్ళు పిల్లికి మిల్కూ, కర్డూ దక్కనిస్తారా? పాపం అనగనగా మూరెడు మీసమూ, బారెడు రోషమూ ఉన్న పిల్లి అన్నన్ని అంతస్తులున్న అపార్టుమెంటుల్లోకీ, కొత్తగా కట్టిన భవంతుల్లోకీ పోలేక, బయట కనిపించక, కడుపులో పరుగెత్తే ఎలకల బాధ తట్టుకోలేక పాత ఇండ్లమీద దృష్టి పెట్టేది. రేకుల ఇళ్ళూ, పెంకుల ఇళ్ళూ అయితే ఫ్రిడ్జీలు వుండవని అక్కడైతే పాలపాకెట్లు చించవచ్చనీ దాని ఆశ.
ఇలాగ పాత ఇళ్ళూ సగం కూలిన ఇళ్ళూ వెదుక్కుంటూ 'ముయ్యావ్ ముయ్యావ్' అని అరుచుకుంటూ నాలుకతో మీసాలు దువ్వుకుంటూ తిరుగుతున్న పిల్లికి ఓ పాత ఇల్లు కనిపించింది. పిల్లి కదా, పిల్లిలా అడుగులేస్తూ కిటికీలోంచి వంటింట్లోకి తొంగిచూసింది. నరమానవులెవ్వరూ లేరక్కడ. వంటింట్లో ఉత్తరపు గోడనుంచి దక్షిణపు గోడ వరకూ ఓ పొడుగాటి కర్రదూలం వుంది. దూలం నుంచి వేలాడుతున్నది ఓ ఉట్టి. అది ఒట్టి ఉట్టి కాదు. దానిమీద ఓ మట్టి చట్టి కుదిమట్టంగా కూచుని వుంది. దాని అంచుల నుంచి పాలచుక్కలు కొన్ని కిందికి జారిన జాడ వున్నది. ఆహా! ఏమి నా భాగ్యము. రొదికెనురా పాలచట్టి ఉన్న ఉట్టి అని ఆనందంగా 'కెవ్వు'మని కేకెయ్యలేదు కనుక 'ముయ్యావ్' అని అరిచేసింది.
వంటింటి తలుపు సందులో నుంచి లోపలికి 'గప్పుచిప్పు'గా దూరిన పిల్లి సరిగ్గా ఉట్టి కింద నిలబడి 'అందెను నేడే అందని ఆ ఉట్టి' అని పాడుకుంటూ 'హుప్' అంటూ పైకెగిరింది. కానీ ఉట్టికి చేరే లోపునే దభీమని నేలమీద పడింది. పడేటప్పుడు జాగర్తగా పడింది. కనుక డామేజీ ఏమీ జరక్కుండా ఒంటికి బొంతలా వున్న చర్మపు కోటు దులుపుకుని 'ట్రై ఒన్స్ ఎగైన్' అనుకుని మళ్ళీ ఎగిరింది. ఉట్టికి జానాబెత్తెడు దూరంలో మళ్ళీ దభీమంది. 'జస్ట్ మిస్' అయింది. ఈ సారి 'అయామ్ ద విన్నర్' అనుకుంటూ మళ్ళీ ఎగిరింది. ఈసారి ఉట్టికి కేవలం బెత్తెడు దూరంలో 'మిస్' అయింది.
పిల్లికి పిచ్చికోపం వచ్చింది. ముయ్యావ్ ముయ్యావ్ అంటూ వున్న చోటే 'ఆత్మప్రదక్షిణం' చేసింది. ఒక బెత్తేడే కదా, ఈసారి గ్యారంటీగా ఉట్టీ, ఉట్టి మీద చట్టిలోని పాలూ నీవే అంది దాని మనసు. కానీ మూరెడు మీసం బారెడు రోషం ఉన్న పిల్లి 'హోప్' వదులుకుని ఇంటి వెనుక చిట్టడవిలోకి పరుగెత్తింది. అలాగ పరుగెత్తీ పరుగెత్తీ ఓ చెట్టుకింద కళ్ళు మూసుకుని తపస్సు చేస్తున్న ముని ముందు నిలబడ్డది. మూరెడు మీసం బారెడు గడ్డం వున్న ఈ మనిషి ఎవరా అని వేసుకోడానికి వేలు లేదు కదా ముక్కు ఉబ్బించి నోరు తెరిచి 'ముయ్యావ్' అంది. మనిషి కళ్ళు తెరిచాడు. ''ఎవరు స్వామీ తమరు?'' అనడిగింది పిల్లి వినయంగా. ''నేను మునిని. తపస్సు చేస్తున్నాను'' అన్నాడా ముని గంభీరంగా. ''ఎందుకు స్వామీ తపస్సు? కళ్ళు మూసుకుంటే కడుపు నిండదు కదా!'' అంది పిల్లి.
''నేను తపస్సు చేస్తున్నది కడుపు నింపుకోడానికి కాదు. నాకు ఆకలీ దప్పికా లేవు. నా తపస్సు మోక్షం కోసమే. అంటే ముక్తి కోసమే'' అన్నాడు ముని. పిల్లికి విషయం ఎలా చెప్పాలో అర్థం అవక ''మోక్షమూ, ముక్తీ అంటే ఏమిటి స్వామి'' అంది పిల్లి. ''మోక్షం అంటే స్వర్గం. నేను స్వర్గానికి పోవడానికి ఈ తపస్సు'' అన్నాడు ముని. ''స్వర్గమా... ఏముంటుంది స్వామీ అక్కడ. పాలూ పెరుగూ దొరుకుతాయా. అయితే నేనూ వస్తా'' అంది పిల్లి ముని కళ్లలోకి చూస్తూ.
''నీకసలేం తెల్సినట్టు లేదు. అక్కడ పాలూ పెరుగూ వుండవు. అమృతం వుంటుంది. అక్కడ పెరుగూ, వెన్నా వుండవు. అమృతం వుంటుంది. అక్కడి వెళ్ళి ముప్పూటలా అమృతం సేవిస్తాను'' అన్నాడు ముని. 'పాలూ, పెరుగూ, వెన్నా, నెయ్యీ కంటే రుచిగా వుంటుదా అమృతం?'' అడిగింది పిల్లి. ''నువ్వు చెప్తున్న డైరీ ప్రొడక్ట్సు ఏవీ పనికిరావు దాని ముందు. అది తాగితే ఆనందోబ్రహ్మ. ఆకలి వుండదు, దాహమూ వుండదు. కార్పొరేటు ఆసుపత్రి పాలుచేసే రోగాలూ వుండవు. సతాయించే భార్యలుండరు. చావగొట్టే సంతానమూ వుండదు'' అన్నాడు ముని తన్మయంగా. ''అయితే నేనూ వస్తాను స్వామీ, నన్నూ తీసుకుపొండి. ఈ ఫ్రిడ్జుల లోకంలో ఆకలికి చస్తూ బ్రతకలేను'' అని బతిమాలింది పిల్లి.
సరిగ్గా ఈ టైమ్‌కి ఆకాశం నుంచి తెల్లటి పైజమా చొక్కాలు వేసుకున్న ఇద్దరు కిందికి దిగారు. ''మునీ, నీ తపస్సు ఫలించింది. రా స్వర్గానికి వెళ్దాం'' అన్నారు వాళ్ళు. ''స్వర్గానికా. వచ్చారా తీసుకెళ్తారా? నా తపస్సు ఫలించింది. కానీ పుష్పక విమానం ఏది. నడిచిరాలేను బాబులూ. మోకాళ్ళ నెప్పులు'' అన్నాడు ముని. ''విమానం రిపేరులో వుంది. చెరో రెక్కా పట్టుకుని గాల్లో తేలుతూ తీసుకెళ్తాం. నీ మోకాలి చిప్పలతో పనే లేదు'' అన్నారు వాళ్ళు. ముయ్యావ్ అంది పిల్లి మునితో పాటు తననూ స్వర్గానికి తీసుకెళ్ళండని వాళ్ళని వేడుకుంది. ఉట్టికెగరలేని పిల్లీ స్వర్గానికి ఎగరాలనుకోకు. అది ఆశ కాదు, అత్యాశ, దురాశ కూడా. నువ్వు ఎగర్లేక వదిలేసి వచ్చిన ఉట్టిని ఎగిరి అందుకునే శక్తిని నీకిస్తున్నాం పో. 'మైండ్ యువర్ ఓన్ బిజినెస్' అన్నారు. ఉసూరు మనలేని పిల్లి 'ముయ్యావ్' అంటూ మళ్ళీ ఉట్టి వున్న వంటింట్లోకి వచ్చింది కాళ్ళీడ్చుకుంటూ, తోక తిప్పుకుంటూ.
ఇప్పుడక్కడ ఉట్టి వుంది కానీ పాలు ఉన్న మట్టి చట్టి మాత్రం లేదు. ఇంట గెలవలేని వాళ్ళు రచ్చ గెలవాలని, కూటిలో రాయి ఏరలేని వాళ్ళు ఏట్లో రాయి ఏరాలని ప్రయత్నిస్తే జరిగేది ఇదే!!
- చింతపట్ల సుదర్శన్, 9299809212