Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'చిల్లర దేవుళ్ళు మాధవరావు' పేరుతో వచ్చిన పుస్తకం, వాస్తవంగా తెలంగాణ సినీ చరిత్రనూ, దాని నేపథ్యాన్ని రికార్డు చేసిన గ్రంథంగా మనం చెప్పుకోవచ్చు. ఇందులో తిరునగరి మాధవరావు సినీ జీవితాన్ని సంఘటనల ఆధారంగా, చరిత్ర వివరణలతో తెలియపరుస్తారు హెచ్.రమేష్‌బాబు. 1925 నుంచే తెలంగాణ నుండి వెళ్ళి ముంబాయిలో సినిమాల్లో నటించిన సరోజినీ నాయుడు చెళ్ళెండ్లు మృణాళినీదేవి, సునాళినీదేవి హైదరాబాదీలేనని, ఆ తర్వాత పైడి జయరాజ్ 1929లో మూకీ సినిమాలలో నటించాడని, వీరి తర్వాతనే ఎల్.వి.ప్రసాద్ నటించారని విశదపరచిన రచయిత, స్థూలంగా చరిత్రను తెలంగాణ కేంద్రంగా వివరించారు.
వరంగల్ నుండి సినీ రంగంలోకి వెళ్ళి ఆదుర్తి సుబ్బారావు దగ్గర సహాయ దర్శకుడుగా పదేండ్లు పని చేసిన మాధవరావు, మొదటి చిత్రం 'తాళిబొట్టు' తీసి తాళిబొట్టు మాధవరావుగా పేరు గడించడం, ఆ తర్వాత తెలంగాణ జీవన చిత్రాన్ని 'చిల్లర దేవుళ్ళు' గా తీయడంలోని అనేక సంగతులను ఒక్కొక్కటిగా, వ్యక్తుల వారిగా చెబుతుంటే, చదువరులంతా ఆ కాలంలోకి వెళ్ళిపోతారు. దాశరథి రంగాచార్య రచించిన 1938 - 48 లలో తెలంగాణ నేలలో రాజకీయ, సామాజిక జీవన పరిస్థితుల కథా దృశ్య నవల 'చిల్లర దేవుళ్ళ'ను కళాత్మకంగా తెరకెక్కించిన మాధవరావు ప్రయాణం మనకు సుబోధకమవుతుంది. సినిమా చరిత్రలో తెలంగాణ కథాంశాన్ని తెలంగాణలోనే చిత్రించిన సినిమాగా పేరు తెచ్చుకున్నదీ సినిమా. అగ్రశ్రేణి తారాగణంతో నిర్మించిన ఈ సినిమాకు 'చంద్ర' కళా దర్శకుడిగా, హరిపురుషోత్తమరావు నిర్మాణంలో సహాయకుడిగా పనిచేశారనే విషయాలు తెలియపరుస్తాయి. తెలంగాణ మాండలికంలో వచ్చిన సినిమాగా, ఈ ప్రాంతపు వాస్తవిక పోరాట చరిత్రను, ప్రజల జీవనాన్ని తీసిన సామాజిక సినిమా చిల్లర దేవుళ్ళు. అట్లాంటి సినిమా చరిత్రనూ, మాధవరావు జీవితం గురించిన సమాచారాన్ని, ఆనాటి పత్రికలలో వచ్చిన వ్యాసాలను, సినిమా నటుల అభిప్రాయాలతో పొందుపరచిన ఈ పుస్తకం ఎంతో ఆసక్తిగా చదివిస్తుంది. చరిత్రను కళ్ళకు గట్టించిన రమేష్‌బాబు అభినందనీయుడు.
- కె. ఆనందాచారి, 9948787660
చిల్లరదేవుళ్ళు మాధవరావు, జీవితం - సినిమాలు, రచయిత : హెచ్.రమేష్‌బాబు,
పేజీలు : 128, వెల : 125,
ప్రతులకు : ఓమ్ సాయి గ్రాఫిక్స్, 3-4-709, నారాయణగూడ, హైదరాబాద్ -500029.