Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భళా! చిత్రకళా!
క్రీ.శ. 5వ శతాబ్దం వరకు మన భారతీయ కళా సంస్కృతి చాటి చెప్పే ప్రదేశాల గురించి ఇప్పటి వరకు మాట్లాడాం . ఇలా పురాతన యుగం నుండి మధ్య యుగంలోకి నడిచే ముందు మరో విషయం మాట్లాడితే బాగుంటుంది అనిపించింది. భారతీయ, చైనా యాత్రికులు వారు రాసుకున్న యాత్రా విశేషాలు, డైరీలు మనకు ఎన్నో ముఖ్యమైన విషయాలు తెలిపాయి. ఇప్పటి వరకూ మనం చిత్రం, శిల్పం, శిలా శాసనాల వల్ల తెలిసిన కళాసంస్కృతి, సమాజ విషయాల గురించి మాట్లాడుకున్నాం. ఈ యాత్రికుల యాత్రా విశేష రచనలూ అంతే ముఖ్యపాత్ర వహిస్తాయి మనకు విషయ బోధనలో. బౌద్ధమతం తెలుసుకోవడానికి చైనావారు, మత ప్రచారానికి భారతీయులు... అటువారు ఇటు, ఇటు వారు అటు ప్రయాణం చేసినందువల్ల సాహిత్యం, సంగీతం, చిత్రకళ, ఖగోళ - భూగోళ శాస్త్రం, వైద్య శాస్త్రం ఒకరితో ఒకరు పంచుకున్నారు. అందువలన క్రీ.శ 7 నుండి 9 వ శతాబ్దం మధ్య కాలంలో భారత్, చైనా సాంస్కృతిక, సాంఘిక, వ్యాపార సంబంధాలు ఉన్నత స్థాయికి చేరాయి.
భారతీయ యాత్రికులు
ధర్మరక్సిత, కాస్యప మాతంగ : చైనా చరిత్ర ప్రకారం వీరిద్దరూ మొట్టమదట చైనా వెళ్ళిన భారతీయ బౌద్ధమత రాయబారులు. ఒకటవ శతాబ్దపు మూడవ భాగంలో హాన్ రాజుల కాలంలో మింగ్తీ పరిపాలించేటప్పుడు వీరు అక్కడికి వెళ్ళారు.
కుమార జీవ (330 - 409) : ఇతను కాశ్మీర బ్రాహ్మణ కుటుంబీకుడు. కుచీన్, బౌద్ధ భిక్కు. ఇతను క్రీ.శ.383 ఎ.డి లో చైనా వెళ్ళి చాంగాన్లో స్థిరపడి క్రీ.శ 409లో అక్కడే మరణించాడు. భారతీయ మహాయాన బౌద్ధ గ్రంథాన్ని చీనీ భాషలోకి అనువాదం చేసి, వారికి బౌద్ధ ధర్మ పాఠ్యగ్రంథంగా నెలకొల్పటానికి సాయంగా చైనా వెళ్ళాడు.
నితాడ, రుద : కుమార గుప్తుడనే గుప్తుల కాలం నాటి రాజు క్రీ.శ. 428 లో నితాడ అనే బౌద్ధ భిక్కుని, క్రీ.శ. 502 లో రుద అనే బౌద్ధ భిక్కుని రాయబారులుగా చైనా పంపాడు. వారు లియాన్ రాజ్యం యొక్క నాంకింగ్ రాజధానిని చేరారు.
పుణ్య తార : క్రీ.శ:. 399 నుండి 416 వరకు ఇతను చైనాలో వున్నాడు. ఇతను కాశ్మీర దేశస్థుడు. బౌద్ధ మత గ్రంథం కుభ, సర్వస్తివాద సూత్రాన్ని పూర్తిగా కంఠస్థం చదవగలడు కుమారజీవ అనే భారతీయ మరో ప్రయాణికుడితో పాటు పది భాగాల బౌద్ధ భిక్కుల ఆరామ నియమ నిబంధనలను అనువదించాడు ఆ గ్రంథం పూర్తయ్యే లోపలే మరణించాడు.
బోధిరుచి : కర్ణాటకకు చెందిన ఒక బ్రాహ్మణ పండితుడు, విద్యావేత్త. బదామి చాళిక్యుల రాజాశ్రయంలో వుండేవాడు. ఒక చైనా రాయబారి క్రీ.శ. 692లో చాళుక్యుల ఆస్థానానికి వచ్చినప్పుడు బోధి రుచిని చైనా రమ్మని ప్రార్థించాడు. ఇతను సముద్ర మార్గాన చాంగ్ అనే చైనా రాజధాని చేరి సిచాంగ్ఫు అనే బౌద్ధారామంలో వుండి, రత్నకూట, మహాయాన బౌద్ధం అనే సంస్కృత గ్రంథాలు చైనా భాషలోకి అనువదించాడు. 30 భారతీయ గ్రంథాల అనువాదం చేసే పనిలో ఇతని వద్ద 700 మంది బౌద్ధ భిక్కులు పనిచేశారు. అయిచింగ్ అనే చైనా యాత్రికుడు, ఇతను కలిసి శిక్షానంద అనే ఒక మధ్య ఆసియా బౌద్ధ గురువు వద్ద పని చేసి ఒక పెద్ద గ్రంథం చీనీ భాషలోకి అనువాదం చేసి, క్రీ.శ.699లో పూర్తి చేశారు.
బోధి ధర్మ : ఇతను కాంచీపురంలోని ఒక చిన్న అగ్రహార నాయకుడి 3వ కొడుకు. క్షత్రియుడు. ఇతను సముద్ర మార్గాన, ఆపై భూమి మార్గాన, గాంజావు, నింజింగ్ అనే చైనాలోని ప్రదేశాలకు చేరాడు. ఈయన 'ధ్యానం' అనే గ్రంథాన్ని చైనా భాషలోని చాన్‌గా ప్రవచనం చేశాడు. దానినే జపాన్ భాషలో జెన్ అని అంటారు. చైనా వారి విశ్వాసం ప్రకారం భారతీయ మార్షియల్ ఆర్ట్‌ని చైనా భిక్కులకు, వారి ఆరోగ్య వృద్ధి కోసం ఇతనే నేర్పాడు. ఇతని గురువు ప్రజ్ఞతార చనిపోయాక, గురువు ఆఖరి కోరికగా చైనా వెళ్ళి అక్కడ బోధనలు చేశాడు. గురుశిష్యుల సంబంధానికి వీరు గుర్తుగా పిలువబడతారు. ఇతను 5వ శతాబ్దంలో చైనా వెళ్ళాడు. ఇతని ప్రవచనాలు ధ్యానం, లంకావతార సూత్రంపై ఆధారపడి వుంటాయి.
గుణవర్మన్ : ఇతను కాశ్మీర రాజకుమారుడు. బౌద్ధ ప్రవచనాలు చేస్తూ చైనా, కాంటన్లో జాతక కథలు చిత్రాలుగా వేస్తూ, ఆ గ్రంథం కోసం జీవితం అర్పించాడు.
పర్రమత్త : మగధ దేశస్తుడు. క్రీ.శ. 545లో చైనా వెళ్ళాడు. చైనాలో తంత్రయాన బౌద్ధాన్ని మొదటగా చెప్పినవాడు ఇతనే.
ప్రభాకర మిత్ర : ఇతను క్రీ.శ. 627లో చైనా వెళ్ళాడు. ఇతను నలంద విశ్వవిద్యాలయం అధ్యాయి. అక్కడి నుండే చైనా వెళ్ళాడు.
ధర్మదేవ : పశ్చిమ భారత భిక్కులు క్రీ.శ. 972లో ఎంతోమంది చైనా వెళ్ళారు. ధర్మదేవ 'ఫాతీన్'గా పిలువబడ్డాడు. ఇతనూ నలంద విశ్వవిద్యాలయం నుండే చైనా వెళ్ళాడు. క్రీ. శ. 1001లో చనిపోయే వరకు ఎన్నో సంస్కృత బౌద్ధ గ్రంథాలని చైనా భాషలోకి అనువదించాడు.
భారతీయ బౌద్ధులు చైనాకి వెళ్ళి బౌద్ధ మత ప్రచారానికి ఎంత ఉత్సాహంగా ప్రయాణం చేశారో, అంతే ఉత్సాహంతో చైనావారూ భారతదేశానికి వచ్చి బౌద్ధానికి సంబంధించిన ప్రదేశాలు దర్శించడానికి, బౌద్ధమత గ్రంథాల గురించి తెలుసుకున్నారు. బుద్ధుడు పుట్టిన మన భారతదేశం, ఆసియాకు ఇచ్చిన సంస్కృతిలో ఒకటి బౌద్ధం.
చైనా యాత్రికులు
ఫాషీన్ : చైనాలో షాన్సీకి చెందిన ఇతను తన మూడవ ఏట బౌద్ధ సంఘంలో చేరాడు. ఆపై తన 25వ ఏట భారతదేశం వెళ్ళి 'వినాయపితాక' అనే గ్రంథం గురించి తెలుసుకోవాలని క్రీ.శ. 399లో మద్య ఆసియా ఎడారి దారిన ప్రయాణించి భారతదేశం చేరాడు ఇతను తోటి యాత్రీకులతో కలిసి గంగాలోయలు, కపిలవస్తు నగరం, బుద్దుడు పుట్టిన స్థలం, బోధగయ - బుద్ధునికి జ్ఞానోదయం అయిన స్థలం, బుద్దుడు మొదట ప్రవచనం ఇచ్చిన చోటు సారనాథ్, బుద్ధుడు నిర్యాణమయిన స్థలం - కుశింగరా దర్శించాడు. సముద్ర మార్గాన చైనా తిరిగి వెళ్తూ శ్రీలంక చూసి, క్రీ.శ. 414లో తన దేశం చేరాడు. మొతం 30 దేశాలు చూసి, వాటి గురించి రాశాడు. సిలోన్/ శ్రీలంక గురించి సమాచారం మొదట ఇతని రాతల వల్లనే తెలిసింది.
సుంగ్యున్, హూషెంగ్ : చైనాలోని 'వీ' అనే రాజ్యం రాయబారులుగా క్రీ.శ. 518లో వారు పశ్చిమ మార్గాన బయలుదేరారు. వీరు భారతదేశం వరకూ చేరలేకపోయారు. ఆనాడు గాంధార రాజ్యంగా పిలువబడ్డ నేటి పెషావర్, ఉద్యాన నేటి స్వాత్‌లోయ చేరాక అక్కడ అతిథి సత్కారం అందినా , ఆనాటి రాజు కల్పించిన నిరాటంకం, దురభిమానం వల్ల ఇండస్ నది దాటి భారతదేశం రాలేకపోయారు. కానీ మహాయాన బౌద్ధానికి చెందిన 170 గ్రంథాలు అందటంలో తృప్తి పడి క్రీ.శ.521లో చైనా తిరిగి వెళ్ళిపోయారు.
హుఆన్ త్సుంగ్ : ఇతని రాతలు మన చరిత్ర పుస్తకాల్లో ప్రసిద్ది చెందాయి. ఇతను క్రీ.శ. 603లో జన్మించాడు. ఇతని రెండో అన్న బౌద్ధ భిక్కు. ఇతని 13వ ఏట అన్నగారే ఇతన్ని బౌద్ధ సంగంలో చేర్చాడు. 20 ఏళ్ళ వయసులోనే చైనా అంతా తిరిగి బౌద్ధ మతగ్రంథాలు చదివి నేర్చుకున్నాడు. అప్పుడే బౌద్ధానికి పుట్టిల్లు అయిన భారతదేశం వెళ్ళాలనే కోరిక కలిగింది. ఎందుకంటే భారతదేశంలో సంస్కృతంలో రాయబడ్డ బౌద్ధ గ్రంథాలు చైనా చేరేటప్పటికి పదాలు పలికే పద్ధతి మారి, అర్థాలూ మారతాయని అర్థం చేసుకున్నాడు. అందుకనే తానే స్వయంగా ఆ గ్రంథాల అనువాదానికి పూనుకున్నాడు. ఇతను చైనా నుంచి క్రీ.శ. 629లో బయలుదేరి కనౌజ్ చక్రవర్తికి అతిథిగా వుండి, ఆపై మగధ చేరి, నలంద బౌద్ద విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు. ఆపై పశ్చిమ, దక్షిణ భారతదేశం తిరిగి క్రీ.శ.645లో చైనా చేరాడు. తాను తిరిగిన, విన్న ప్రదేశాల గురించి రాశాడు. క్రీ.శ. 664లో చనిపోయే ముందే ఎన్నో గ్రంథాలు అనువదించాడు. ఇతని రాతలలో మతపరమైన విషయమే కాక, భారతదేశ సంస్కృతి, జీవన విధానాలు... అలా ఎన్నో వివరాలు దొరుకుతాయి.
అయిచింగ్ : ఇతను తన 12వ ఏట బౌద్ద విద్య అవలంభించాడు. తన 14వ ఏట భిక్కు ధర్మం తీసుకున్నాడు. తన 18వ ఏట భారతదేశం రావాలనే కోరిక పెంచుకున్నా, 37వ ఏట వరకూ రాలేకపోయాడు. ఫాషీన్, హుఆన్త్సుంగ్ రాతలు చదివి భారతదేశం వెళ్ళాలనే కోరిక పెంచుకున్నాడు. క్రీ.శ.654లో 'వినయపితాక' చదివాడు. అభిధర్మ సాహిత్యం చదివాడు. బౌద్ద ధర్మ నియమ నిబంధనలు చదివి రాశాడు. అవే అతని ముఖ్యమైన రాతలు అయినాయి. ఇతను క్రీ.శ. 673లో చైనా నుండి సముద్రయానంలో బయలుదేరి మగధలో బౌద్ధ తీర్థ స్థలాలు చూస్తూ నలంద బౌద్ధ విశ్వవిద్యాలయంలో క్రీ.శ.676 నుండి 685 వరకు విద్యనభ్యసించాడు. క్రీ.శ.685లో భారతదేశం వదలి సుమత్ర దీవులలోని భోజనగరం వెళ్ళి, అక్కడ మూల సర్వాస్తివాదిన్ మార్గానికి చెందిన వినయగ్రంథాన్ని చదివి, చైనా తిరిగి వెళ్ళాడు. అక్కడి అనుచరులతో కలిసి అనువదించాడు. భారతదేశంలో ప్రయాణించిన చైనా బౌద్ధ యాత్రికుల గురించిన వివరాలు రాశాడు. ఆనాటి వూ, చక్రవర్తి, బౌద్ధమత ప్రేమి. ఆయన మన్ననలు పొందాడు. ఇతని బౌద్దమత నియమాలను, 40 సూత్రాలను, 4 పుస్తకాలుగా రాసి తన 79వ ఏట క్రీ.శ. 713లో చనిపోయాడు.
కొరియా నుండి
హ్యూచో : ఇతను కొరియా నుండి భారతదేశ యాత్ర చేసిన బౌద్దుడు. ఇతని వలన కొరియా వారు కూడా అప్పుడు భారత యాత్ర చేశారని అర్థం అవుతుంది. ఇతను తరువాత చైనా చేరాడు. క్రీ.శ. 719లో వజ్రబోధి, భారత బౌద్ధ గురువు చైనా వెళ్ళినప్పుడు అతని శిష్యుడు హూచో 16 ఏళ్ళ యువకుడు. క్రీ.శ. 716లో చైనా చేరిన భారతీయ బౌద్ధ గురువు శుభకర సింహకు కూడా శిష్యుడు. వీరి వద్ద తాంత్రిక బౌద్ధం చదివాడు. తన 16 ఏళ్ళ వయసులో భారతదేశ యాత్ర మొదలుపెట్టి, నికోబార్ ద్వీపం, సారనాథ్, కుసినాగర, బుద్ధగయ వంటి బౌద్ధ పుణ్యస్థలాలు చూస్తూ, దక్షిణ భారతం, పశ్చిమ భారతం, ఆపై జలంధర్, ఇండస్ నది ఒడ్డున వున్న రాజ్యాలు, కాశ్మీర్‌లోయ, గాంధార చూస్తూ క్రీ.శ. 727లో చైనా చేరాడు. అమోఘ వజ్ర అనే మరో భారత బౌద్ధ గురువు వద్ద చైనాలో చదువుకున్నాడు. మహాయాన - యోగ వజ్ర సూత్రంపై పని చేసి అనువాదాలలో సహకరించాడు. ఇతనికి భాషా ప్రావీణ్యం లేక ముఖ్య గ్రంథ కర్త అవలేదు.
భారత్, చైనా, కొరియా బౌద్ధ యాత్రికుల వలన పురాతన కాల సంస్కృతి, చరిత్ర, రాజకీయ, సాంఘిక విషయాలు తెలియడమే కాదు, అటూ ఇటూ యాత్రికులతో పాటు ప్రయాణించిన కొన్ని కళలూ సమాజంలో ముఖ్యపాత్ర వహించాయి. గాంధార పద్ధతిలో చెక్కిన 48 సెం.మీ. అశోక శిల్పం జియాన్ అనే స్థలంలో దొరికింది. దాని శిలాఫలకం ప్రకారం డుషాంగ్ అనే బౌద్ధ భిక్కు క్రీ.శ. 551లో చనిపోయిన తన కొడుకు గుర్తుగా అంకింతం చేశాడట.
ఒకటి మటుకు నిజం. పురాతన కాలంలో బౌద్ద మతాన్ని ఒక పెద్ద ప్రణాళికలాగా ప్రచారం చేయబడింది. హిందూ, జైన మతాలు వున్నా, వాటిని మబ్బులా కప్పి, బౌద్ధం ప్రచారం చేయడంలో క్రీ.పూ. 3వ శతాబ్దపు అశోకుడు ఒక్కడే కారణమని అనలేం.
- డా||ఎం.బాలామణి, 8106713356