Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాబాలకు, బైరాగులకు, సన్యాసులకు బాగా డిమాండు పెరిగిందట' అన్నాడు చెట్టుకింద ముక్కు మూసుక్కూచున్న తాంత్రిక్ బాబా. ఆ పక్కనే కూచున్న యాంత్రిక్ బాబా ఆ చప్పుడుకు ధ్యానం దొబ్బేయడంతో ముక్కూ నోరూ తెరిచి 'నిజంగానా' అన్నాడు.
'అవును యాంత్రిక్. వున్న ఊరూ, వాడా వదిలేసి చెట్లంటా పుట్లంటా తిరిగి చివరాకరుకు ఈ చెట్టుకింద సెటిలయ్యాం కానీ, మన వాళ్ళు చాలా మంది అడవులు వదిలి సిటీలు చేరుకున్నారు. అక్కడ మన బైరాగులకు బ్రహ్మరథమే కాదు, విష్ణురథంలో కూడా విహరింప చేస్తున్నారట' అన్నాడు తాంత్రిక్.
యాంత్రిక్ కాసేపు కళ్ళు మూసుకుని కాలచక్రం వెనక్కి తిప్పాడు చిన్నప్పుడు తండ్రి తనను బడికి వెళ్ళి బుద్దిగా చదుకోమనేవాడు. తనకు మాత్రం చదువంటే అస్సలు గిట్టేది కాదు. గిట్టుబాటయ్యే పనేదైనా చేద్దామని ఊళ్ళో కోళ్ళ వెంట పడ్డాడు. కొడుకు దొంగతనంగా కోళ్ళు పట్టుకురావడం, తల్లి కొనుక్కువచ్చిన మసాలాల్తో కూర వండడం, తండ్రి లొట్టలు వేసుకుంటూ తింటుండడంతో మరి బడి వైపు అడుగెయ్యలేదు యాంత్రిక్.
తెల్లవారు జామున 'కొక్కొరొకో' అని కూస్తూ జనాన్ని మేలుకొలిపే కోళ్ళు తక్కువవడంతో జనం లేటుగా లేవడం మొదలెట్టారు. దాంతో ఊళ్ళో పనులు జాప్యం కాసాగినయి. ఈ విపరీతం గ్రామ పెద్దకు తెలిసింది. ఊళ్ళో కోళ్ళు ఏమైపోతున్నాయని నిఘా పెట్టించేడు. నిజమూ, కోడి ఈకలూ ఎన్నాళ్ళు దాగి వుండగలవు గనక. ఊళ్ళో దొంగ కోళ్లు పట్టేవాడెవడన్నది అందరికీ తెలిసింది. చెట్టుకి కట్టేసి నాలుగు తగిలించి, అయిదు కొసరేసి ఊళ్ళో నుంచి తరిమేశారు.
అలాగ ఊరొదిలి అడవి బాట పట్టిన యాంత్రిక్ పాత పేరు వదలేసి యాంత్రిక్గా మారేడు. బైరాగిగా మారి చెట్టుకిందకి చేరేడు.
యాంత్రిక్ ఫ్లాష్ బ్యాక్‌లో వున్న సమయంలో తాంత్రిక్ కూడా తను బాబాగా మారడానికి ముందటి ఘన చరిత్రను గుర్తు చేసుకున్నాడు. బాబాలయితేనేం, బైరాగు లయితేనేం, సన్యాసులైతేనేం? ఇలాంటి వారి బయోగ్రఫీలకు దగ్గరి సంబంధమే వుంటుంది. కష్టాలు లేకుండా వుంటాయని, ఒళ్ళు భద్రంగా వుంటుందని గంజాయి దమ్ముకు, పరమాత్మ ప్రత్యక్షం అవుతాడనే కదా చాలామంది ఈ 'ప్రొఫెషన్' ఎన్నుకుంటున్నారు.
యాంత్రిక్, తాంత్రిక్ ఒకేసారి పాస్ట్ నుంచి ప్రజెంట్‌లోకి వచ్చేశారు. అయితే మనం మన ఊళ్ళకి వెళ్ళినా 'వీపు సేఫ్'గానే వుంటుందంటావా? అన్నాడు యాంత్రిక్. భయంలేదు, దేవదూతల్లా పూజించుకుంటారు. మనం ఆడింది ఆట, చేసింది భజన అన్నాడు తాంత్రిక్ ఉత్సాహంగా. ఈసారి కోళ్ళు దొంగతనంగా తినొచ్చు కానీ, దొంగతనంగా కోళ్ళు పట్టాల్సిన అవసరం లేదనుకున్నాడు యాంత్రిక్.
అవురా కాలమహిమ! డొక్కలో తన్నించుకున్న వారు, వీపు మీద పిడిగుద్దులు పడ్డవారు జైలులో ఊచలు లెక్కపెట్టినవారు బాబాలు, బైరాగులు, సన్యాసులుగా మారడమే కాదు, ఈ దేశంలో సెలబ్రిటీలు అయిన రాజకీయ నాయకులు, సినీతారలు, క్రీడాకారులు కూడా సెలబ్రిటీల స్థాయికి చేరుకున్నారు.
కదా కాలమహిమ! ఏ చెట్టుకు కట్టేసి తనను చావకుండా కొట్టారో ఆ చెట్టు కింద యాంత్రిక్కు పాద పూజలు, ప్రదక్షిణలు చేయసాగారు జనం. ఈ బాబా హిమాలయాల్లో అనేక సంవత్సరాలు తపస్సు చేసిన వాడని, చూడ్డానికి వయసు తెలియదు కానీ కనీసం రెండు వందల సంవత్సరాల వయసు వుండి వుండవచ్చని, తలమీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని మహిమలు ఉన్నవాడని ఉచిత ప్రచారం జరిగిపోయింది. బాబా దర్శనం కోసం 'క్యూ'లు పెరిగి పోయాయి. దుకాణాల వాళ్ళ దోపిడీ మొదలైంది. ఈ సందడి గ్రామ పెద్దకు వినిపించింది.
గ్రామ పెద్ద ఉరుకులూ పరుగులూ పెడుతూ బాబా దర్శనానికి వచ్చాడు. కాళ్ళకి మొక్కుతూ ఈ మొహాన్ని ఎక్కడో చూశానే అనుకున్నాడు. కానీ బాబాలకూ, బైరాగులకూ సన్యాసులకూ ఏపుగా దట్టంగా అడ్డదిడ్డంగా గడ్డాలూ, మీసాలూ పెరుగుట వల్ల వారిని గుర్తుపట్టడం 'సీబీఐ' క్కూడా అసాధ్యం కదా. బాబా ఈఊరి వాడేనని ఇక్కడి కోళ్ళను తిన్నవాడేనని ఎవరు ఊహిస్తారు?
ఏ పొలంలో ఏ విత్తు విత్తాలో, ఏ స్థలంలో ఏ కొంప కట్టాలో, ఏ కొంపలో ఏ మూల ఏమి పెట్టాలో, ఏ పెళ్ళి ఎప్పుడు చేయాలో, ఏ చావుకు ఏమి కారణమో అన్నీ యాంత్రిక్ బాబా సెలవియ్యడమే. శివుడి ఆజ్ఞను పట్టించుకోవుగానీ చీమలు ఆయన ఆజ్ఞ లేనిదే ఎవరినీ కుట్టవు. బెల్లం కూడా ముట్టవు.
గ్రామ పెద్ద పెద్దఎత్తున విరాళాలు పోగేసి, చెట్టు కింద బాబాకు లగ్జరీ ఆశ్రమం కట్టించాడు. వసూలైన దాంట్లో కొంత నొక్కేసాడని చెవులు కొరుకున్న వాళ్ళు లేకపోలేదు. పేదలకు ఇళ్ళు కట్టిస్తామని మంత్రిగారు హామీ ఇచ్చిన ప్రభుత్వ భూమిలో ఆశ్రమం కట్టారని గిట్టని వాళ్ళు కొందరు నెత్తీనోరూ బాదుకోవడం తప్ప ఏమీ చెయ్యలేకపోయారు. బైరాగులకూ బాబాలకు సన్యాసులకు కాకపోతే ప్రభుత్వ భూమి పైన హక్కు ఇంకెవరికి వుంటుంది?
పుట్టుకతో వచ్చిన బుద్ది, విద్యుత్తు దహన వాటికలో బూడిదయితే కానీ పోదు అంటారు. యాంత్రిక్ కి ఆ ఊరి కోళ్ళ మీద వున్న మమకారం పోలేదు మరి. చాలా ఏళ్ళ తర్వాత ఊళ్ళో కోళ్ళు మళ్ళీ దొంగతనం అవుతున్నాయని, వాటి ఈకలు ఆశ్రమం వెనుక వైపు కుప్పలుగా పడి వుంటున్నాయని జనం విస్తుపోయారు. స్వామీజీ అంటే భక్తి లేని మూర్ఖులు, కరడుగట్టిన నాస్తికులు, అజ్ఞానులు, బాబాజీని అప్రతిష్ట పాలు చేయాలని కావాలనే కోడి ఈకలు ఆశ్రమం వెనుక పడేస్తున్నారని, ఇవాళో రేపో ఖచ్చితంగా వాళ్ళ కళ్ళు కుళ్ళిపోయి గుడ్డివాళ్ళవుతారని జనం చెంపలు వాయించుకోసాగారు.
కోడి ఈకల సంగతి జనం మరిచిపోయారు. యాంత్రిక్ బాబా ప్రతిష్ట భారత్ వెలుగుతోంది లా వెలిగిపోసాగింది. ఓనాడు చెట్టుకింది మిత్రుడు తాంత్రిక్, యాంత్రిక్ సెల్లు మోగించాడు. మిత్ర బాబాలిద్దరూ గడ్డాలు సవరించుకుంటూ చాటింగ్ చేసుకున్నారు. తన పని ఆరు పవ్వులూ, పన్నెండు పండ్లులా వుందని, తుమ్మడమూ, దగ్గడమూ కూడా తనని అడిగాకే జనం చేస్తున్నారని, రాబోయే కాలమంతా బాబాలదేనని చెప్పాడు తాంత్రిక్. గ్రామ ఎన్నికల నుంచి దేశ ఎన్నికల దాకా తమదే హవా అని, ఏ నియోజకవర్గంలో ఎవరు నిలబడితే గెలుస్తారో తనే చెప్పేస్తున్నాడని, ఎవరు పార్టీ మారాలో, ఏ పార్టీ పేరు మార్చుకోవాలో, ఎన్నికలయ్యాక ఎవరికి ఏ పదవి వస్తుందో అన్నీ తన అంగీకారంతోనే జరగనున్నాయని చెప్పాడు.
యాంత్రిక్ కూడా తనదీ అదే స్థాయి అయిందనీ, రాజుల కాలంలో రాజ గురువుల మాటే శాసనంగా వుండేదని, ఇప్పుడు తామంతా రాజగురువులుగా రాజ్యాలేలవచ్చని స్టేట్మెంట్ ఇచ్చాడు.
రాబోయే ఎన్నికల్లో బాబాలు, బైరాగులు, సన్యాసులు మహత్తరమైన పాత్ర పోషించబోతున్నారని అంటే కాదంటారా??
- చింతపట్ల సుదర్శన్, 9299809212