Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కాకిలా కలకాలం బ్రతకడంకాదు.. హంసలాహొ కొద్దిరోజులు బ్రతికితే సార్ధకత 'అనేది పెద్దలు చిన్న వయస్సులోనే ఆయుష్షు తీరిన ప్రతిభావంతులకు, కళాకారులకు విద్వాంసులకు ఆపాదిస్తారు. అలాంటి కోవకు చెందిన వారిలో దేశాన్ని నలుచెరుగులా చుట్టివచ్చిన ఆది శంకరాచార్యులు, ప్రపంచ అధ్యాత్మిక వేదికపై భారతీయతను నిలిపిన వివేకానందుడు వంటివారు వస్తారు. ఆధునిక కాలంలో సాహితీసౌరభం ఎమ్వీయల్.యన్ గా ప్రసిద్ధి కెక్కిన మద్దాలి వేంకట లక్ష్మీనరసింహారావు గూర్చి మనం తప్పనిసరిగా మననం చేసుకోవాలి.
ఎమ్వీయల్ 42వ ఏట దేహం చాలించినా తనను గురించి భావి తరాల వారు సాహిత్యం గురించి ముఖ్యంగా మినీ కవితల గురించి ప్రస్తావించుకున్నాపుడల్లా తన పేరు గుర్తుచేసుకునే విధమైన ఘనకీర్తిని సంపాదించుకుని కీర్తిశేషుడయ్యారు. విద్యార్థుల మనసెరిగి పాఠాలు చెప్పిన గొప్పఅధ్యాపకుడిగా, సాహిత్యోపన్యాసకుడిగా, చక్కని సాహితీవేత్తగా, కాలమిస్టుగా సినీరచయితగా, వ్యాఖ్యాతగా సాహితీ విమర్శకుడుగా, పుస్తకస మీక్షకుడిగా సాహితీ వ్యవసాయంలో ఆరితేరారు. 'ముత్యాలముగ్గు' సినిమా నిర్మాతగా రాష్ట్రపతి నుండి అవార్డు అందుకున్నారు.
ఎమ్వీయల్ బందరు దగ్గర గూడూరులో జన్మించారు. చిట్టిగూడూరులో తెలుగు భాషాప్రవీణ, బందరులో డిగ్రీ చదివారు. ఉస్మానియాలో పీజీ పూర్తి చేసారు. కృష్ణాజిల్లా నూజివీడు పేరు చెబితే బంగినపల్లి మామిడిపండు గుర్తుకు వస్తుంది. అక్కడి ఎం.ఆర్.అప్పారావు కళాశాలలో తెలుగు శాఖకు అధ్యక్షుడిగా తన ఉద్యోగపర్వం ప్రారంభించారు. వయసులో చిన్నవాడే అయినా, ప్రతిభలో పెద్దవాడుగా పేరుపొంది, అందరి మన్ననలు అందుకున్నారు. ఆంధ్రజ్యోతి వారపత్రికలో యువజ్యోతి శీర్షికన ప్రశ్నలు జవాబులు ఇచ్చేవారు. ఆయన జవాబులు కొంటెగా, బహు చమత్కారంగా ఉండేవి. విశ్వనాథవారిని మెప్పించగలవారు ఎవరు అన్న ప్రశ్నకు సత్యనారాయణ అని చెప్పడం ఇందుకు మచ్చుతునక.
ఆయన ప్రాచీన, ఆధునిక సాహిత్యాలను సమానంగా ప్రేమించేవారు. విశ్వనాథ, దివాకర్ల వేంకకటావధాని, ఆరుద్ర, శ్రీశ్రీ, పింగళి, దేవులపల్లి వంటివారితో పాటు అలిశెట్టి ప్రభాకర్, చంద్రసేన్ వంటి కవులన్నా ఆయనకు ఎంతో ప్రీతి. అధ్యాపకుడిగా ఉన్న సమయంలోహొప్రముఖ సాహిత్య వేత్తలను కళాశాలకు రప్పించి, వారితో విద్యార్థులకు ఉపన్యాసాలు ఇప్పించేవారు. ఎంతోమందిని ఔత్సాహిక రచయితలుగా తయారుచేసారు. 'కొత్త రచయితలకు భావం ప్రధానం. దాని మీద దృష్టి పెట్టండి. భాషను తరువాత సర్దుకోవచ్చు. ముందు భావసంపద పెంచుకోండి..' అని యువ రచయితలను వెన్ను తట్టి ప్రోత్సహించారు. భావం ఉండేలా చూస్తే భాష అదే వస్తుందని చెప్పేవారు.
ఒకసారి సభలో శ్రీకృష్ణ దేవరాయలు రచించిన ఆముక్తమాల్యద పై అనర్గళ ఉపన్యాసం ఇచ్చి సభికులను ఆశ్చర్య పరిచారు. ముఖ్యంగా విద్యార్థులను విశేషంగా ఆకర్షించారు. ఆంధ్రదేశం నలుచెరగులా ఉపన్యాసాలతో సాహితీ ప్రియులను అలరించారు. మినీ కవిత్వం రంగు, రుచి చూపించారు. బాపుబొమ్మ, రమణమాట, బాలుపాట, వేటూరి సాహిత్యమంటే ఎమ్వీఎల్ కు అత్యంత ప్రీతి. రమణకు కానుక (మహారాజు- యువరాజు) మినీ కథానిక రూపంలో ఇచ్చారు. సాహిత్యమంటే చక్కటి వినోదాత్మక సౌరభాలుగా ఉండాలనేవారు. కష్టాలు, బాధలతో పాఠకులను హింసించరాదు అనేవారు. సినీ ప్రపంచంలో కూడా 'స్నేహం, గోరంతదీపం, మనవూరిపాండవులు' వగైరాలకు సంభాషణలు రాసారు. సాహిత్య అకాడమీకి పంచకావ్యాలను సామాన్య పాఠకుల కోసం క్లుప్తంగా వివరించి లఘు వ్యాఖ్య రాసారు. సాహితీ వ్యవసాయంలో మేటి కర్షకుడిగా కీర్తి గడించారు. 1986లో చిన్నవయస్సులో సుదూరతీరాలకు చేరుకున్న ఎమ్వీఎల్ ఆంధ్రసాహిత్య వినీలాకాశంలో ధృవనక్షత్రం.హొ
- యం.వి.రామారావు, 8074129668