Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత స్వతంత్ర సమర యోధులు, విప్లవ కారులు, సోషలిస్టుల్లో అగ్రశ్రేణికి చెందిన వారిలో భగత్‌సింగ్ ఒకరు. ఈ దేశంలో మొట్టమొదటి మాక్క్సిస్ట్ సిద్ధాంత ఆలోచనాపరుల్లో కూడా భగత్‌సింగ్ ఒకరు. ఉరికొయ్యకు తలవంచని దీరత్వం, ఇంక్విలాబ్ జిందాబాద్, రణధ్వని ప్రతిధ్వనిస్తుంది. భగత్‌సింగ్ సహచరుడైన శివవర్మ రాసిన స్మృతులు మనకు ప్రేరణ కలిగిస్తాయి. ఉగ్రవాద చర్యల నుండి మార్క్సిజం వైపు మరలడం, నాస్తికునిగా మారిన పరిస్థితి, నవ జవాన్ భారత్ సభ ప్రణాళికలు, 'హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీ' స్థాపన, దేశవ్యాప్తంగా విప్లవ గ్రూపులను ఐక్యం చేయడం, కార్మిక కర్షక, శ్రామిక శ్రేణులతో విప్లవోద్యమ నిర్మాణం, ఈ దేశాన్ని బ్రిటీష్ సామ్రాజ్యవాదం నుండి విముక్తి కోసం, కోర్టుల్ని, పార్లమెంట్‌ను ఎలా వేదిక చేసుకోవాలో భగత్‌సింగ్ చరిత్ర సుబోధకంగా ఈ చిన్న పుస్తకం తెలుపుతుంది. 1907 అక్టోబర్ 7న జన్మించి 1931 మార్చి 23న బ్రిటీష్ ముష్కరులచే 'ఉరి' తీయబడిన భగత్‌సింగ్ గొప్ప విప్లవ యోధుడు. ఆయన సహచరులు ఎందరో తరువాత కాలంలో కమ్యూనిస్ట్ పార్టీలో చేరి పనిచేశారు. వారిలో శివవర్మ, అజయ్‌ఘోష్, విజయకుమార్ సిన్హా, సత్యభక్త, గణేష్ శంకర్ విద్యార్థి లాంటి వారు వున్నారు.
ఆనాటి విప్లవ కారుల అపూర్వ త్యాగాలు, కోర్టుల్లో తమ కేసులు తామే వాదించుకుంటూ, దేశ స్వాతంత్య్రాన్ని బలంగా కోరడం, బ్రిటీష్ వానిపై పోరాటాలు, చంద్రశేఖర్ అజాద్ లాంటి వారి త్యాగం, సాండర్స్ అనే అధికారిని చంపడం, కొకారో రైలు దోపిడి, పారిశ్రామిక బిల్లు ఆమోద సందర్భంలో బ్రిటీష్ పార్లమెంట్లో బాంబులు వేసి పోలీసులకు స్వచ్చందంగా దొరకడం, నిరసనలతో కరపత్రాలు విసరడం, దేశంలో విప్లవ శక్తుల్ని కూడగట్టడం, దేవునిపై స్పష్టమైన ఆలోచనలు, నాస్తికతత్వ్తం తన విప్లవ మార్గం. ప్రజాపక్షంగా పోరాటం, విప్లవోద్యమ నిర్మాణం లాంటి అంశాలపై భగత్ సింగ్ ఆలోచనల్ని అవగాహన చేసుకునేందుకు ఈ చిన్న పుస్తకం చక్కటి ప్రయోజనకర కరదీపిక. రెడ్‌బుక్ సందర్భంగా నవల తెలంగాణ పబ్లిషింగ్ హౌస్ వెలువరించిన ఈ పుస్తకం ప్రతి సామాజిక కార్యకర్త వద్ద వుండాల్సిన సైద్దాంతిక గ్రంధం.
- తంగిరాల చక్రవర్తి , 9393804472
భారత విప్లవ కెరటం భగత్‌సింగ్,
రచన : శివవర్మ, పేజీలు : 80, వెల : 50/-, ప్రతులకు : నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్, ఎం.హెచ్.భవన్, ప్లాట్ నెం.21/1, ఆజమాబాద్, ర్.టి.సి.కళ్యాణ మండపం దగ్గర, హైదరాబాద్-500020.