Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తన పేరు లాగే ఆమె చేసిన, చేస్తున్న పనులు ప్రబోధాత్మకంగా ఉంటాయి. వ్యక్తిత్వం, ఆలోచన, ఆచరణ అద్దం పట్టి చూపిస్తాయి. జర్నలిస్టుగా, రచయిత్రిగా, 'జోగిని' వ్యవస్థ నిర్మూలన యజ్ఞంలో లవణం దంపతులతో కలిసి నడిచిన కార్యకర్తగా, అనాథ బాలల ఆశ్రమ నిర్వాహకురాలిగా, బాల సాహిత్యం, బాలల పునరావాసం, బాల వికాసకారిణిగా పనిచేస్తున్న సామాజిక కార్యకర్త, కావ్యకర్త వల్లూరిపల్లి శాంతి ప్రబోధ. ఈమె 24 అక్టోబర్, 1961న వరంగల్ జిల్లా ఘన్‌పూర్‌లో పుట్టింది. తల్లితండ్రులు శ్రీమతి కల్పన, శ్రీ వల్లూరిపల్లి రంగారావు. పెరిగింది ఆదిలాబాద్‌లో, మెట్టినిల్లు నిజామాబాద్, ఉంటున్నది హైదరాబాద్‌లో. కామర్స్, అనువాదాల్లో ఉస్మానియా, పద్మావతి విశ్వవిద్యాలయాల నుండి బంగారు పతకం సాధించిన శాంతిప్రబోధ కరీంనగర్, తిరుపతి, హైదరాబాద్‌లలోనూ విద్యాభ్యాసం చేశారు. సోషియాలజీ, తెలుగు సాహిత్యాల్లో ఎం.ఏ చదివారు.
శాంతి ప్రబోధ నిజామాబాద్ జిల్లాలో హేమలత-లవణంల నేతృత్వంలో జోగినుల సంస్కారం, పునరావాసం కోసం నిర్వహించిన 'సంస్కార్' కార్యక్రమంలో, బాలల కేంద్రంగా జరిగిన గ్రామీణాభివృద్ది కార్యక్రమాల్లో వివిధ ప్రాజెక్టుల సంచాలకులుగా, ఆనాథ ఆశ్రమ నిర్వాహకురాలుగా సేవలందించారు. బాలలను చైతన్యవంతులుగా చేస్తూ ఏర్పాటు చేసిన 'బాలల సేవా సంఘాల' ద్వారా పిల్లల్లో నాయకత్వ పటిమ, సృజనాత్మకత పెంచేదిశగా తొంభయ్యవ దశకంలోనే పనిచేశారు. సేవా రంగంలో రెండు దశాబ్దాలు పనిచేశారు. రచన నుండి సంపాదకుల వరకు బాలలే అన్నీ అయ్యి 5000 ప్రతులతో వెలువడ్డ 'మా మాట' పత్రిక వీరి అలోచనల ఆవిష్కారం. 2003 నుండి 2010 వరకు ఈ పత్రిక వచ్చింది. దీనికి ఢిల్లీ నిపుణుల బృందం తోడ్పాటు మరిన్ని ఫలితాలనిచ్చింది. తరువాత నిజామాబాద్ రేడియో ద్వారా ప్రసారమైన పిల్లల 'అల్లరి ముచ్చట్లు' గురించి మనకు తెలిసిందే. 'సమతా నిలయం' అనాథ పిల్లలతో 'బాణం' రాత పత్రిక తెచ్చారు, మరికొందరు పిల్లల రచనలు అమెరికాలోని 'నాట్స్' సావనీర్లో అచ్చయ్యాయి.
సామాజిక కార్యకర్తగానే కాక కావ్యకర్తగా శాంతి ప్రబోధ తన రచనల్లో 'సంస్కార' భావనలకు పెద్దపీట వేసింది. నిచ్చెనమెట్ల సమాజంలోని అట్టడుగు వర్గాల మహిళల స్థితులను చూసి చలించి రాసిన నవల 'జోగిని'. జహిరాబాద్ ప్రాంతంలోని మహిళల చైతన్యస్ఫూర్తిని చూసిన నేపథ్యంతో రాసిన నవల 'బతుకుసేద్యం'. మహిళలే నైపథ్యంగా 'నెచ్చెలి'లో ధారావాహికగా వస్తున్న మరో నవల 'నిష్కల'. పిల్లలతో పనిచేయడం, వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూడడం ప్రారంభించాక రాసిన కథలు 'గడ్డిపువ్వు' పేరుతో వచ్చాయి. 'ఆలోచనలో... ఆమె' సంపుటి మధ్యతరగతి స్త్రీల సమస్యలు చర్చించిన సంపుటి. ముఖ్యంగా హక్కులు, లైంగిక వేధింపులు, అత్యాచారాల వంటివాటిని ప్రధానంగా ఇందులో రచయిత్రి రాశారు. కవయిత్రిగా శాంతిప్రబోధ ఎయిడ్స్ సమస్యపై నిర్వహించిన కవతల పోటీలో బహుమతి అందుకుంది. వివిధ పత్రికల్లో 'ఆడపిల్లను కావడం వల్లనే', 'మేకోపాఖ్యానం', 'కిటికీ' వంటివి ఇప్పటికీ కాలమ్ రచనలుగా రాస్తున్నారు. వివిధ సందర్భాల్లో అనేక సమస్యలపై వ్యాసాలు రాశారు. ఇంటర్వ్యూలు, యాత్రా సాహిత్య రచనలు చేశారు. గల్పికలు, సరళ శతకం, సూక్ష్మకావ్యం వంటి రూపాల్లోనూ వివిధ రచనలు చేశారు. తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ నవల పురస్కారం, వెంకటసుబ్బు పురస్కారం, కందుకూరి పురస్కారం, ఇండూరు అపురూప పురస్కారం ఆమె రచయిత్రిగా అందుకున్న గౌరవాలు.
బాలల హక్కుల, వికాస కార్యకర్తగా ఎంతగా పనిచేశారో బాలసాహితీవేత్తగా అంతే బాల సాహిత్య సృజన చేశారు శాంతి ప్రబోధ. బాలభారతం, జాబిలి అంతర్జాల పత్రిక, మయూఖ, మొలక, తరుణి, బహుళల్లో వీరి పిల్లల కథలు అచ్చయ్యాయి. పిల్లల ప్రపంచంలో ఆడియో కథలు వెలువడ్డాయి. బాలల కోసం కానప్పటికీ బాలల అంతరంగం తెలయాలన్న ఆలోచనలతో రాసిన 'భావ వీచికలు' లేఖా సాహిత్యం బాలలకు సంబంధించిన అనేక అంశాలను చర్చించిన రచన. ముఖ్యంగా 'బాలల హక్కులు కూడా మానవ హక్కులే' అన్న ఎరుక ఈ లేఖల్లో పరుచుకుని ఆలోచింపజేస్తాయి. శాంతి ప్రబోధ బొమ్మల పుస్తకం 'క్యాంపింగ్' తానా బహుమతిని గెలుచుకుంది. 'ఆకాశంలో నిధి' పేరుతో ఆస్ట్రేలియాలో చూసిన హ్యాంగ్ గ్లైడింగ్ నేపథ్యంగా, ఒక బాలికకు కలిగిన హ్యాంగ్ గ్లైడింగ్ కోరికపై ఈ నవల నడుస్తుంది. వీరి బాల సాహత్య రచనల్లో ఎక్కువగా పేరు తెచ్చిన రచన 'అమర్ సాహస యాత్ర'. పద్నాలుగేళ్ళ అమర్ ఎవరెస్ట్ ఎక్కాలన్న కోరికను ఎలా నెవేర్చుకున్నాడు, అనాథాశ్రమంలో ఉండే అమర్ ఎవరెస్ట్‌ని ఎలా అధిరోహించాడో చెప్పే ఈ నవల బాలల్లోనే కాదు, పెద్దలకూ స్ఫూర్తిని కలిగించే రచన. వివిధ దేశాల్లో పర్యటించిన శాంతి ప్రబోధకు అక్కడ కూడా పిల్లల సదస్సుల్లో పాల్గొనే అవకాశం కలగడం కలిసివచ్చిన అవకాశం. రచయిత్రిగానే కాక బాలల వికాసం కోసం నిబద్ధతతో పనిచేసిన, చేస్తున్న బాల వికాస కార్యకర్త వల్లూరిపల్లి శాంతి ప్రబోధ. జయహో! బాల సాహిత్యం.
- డా|| పత్తిపాక మోహన్, 9966229548